24 ఏళ్ల తర్వాత మ్యాచ్‌.. సంచలనం రిపీటయ్యేనా? | India Women Set Landmark Test Return In South Africa After 24 Years | Sakshi
Sakshi News home page

SAw Vs INDw: 24 ఏళ్ల తర్వాత మ్యాచ్‌.. సంచలనం రిపీటయ్యేనా?

Mar 20 2026 6:22 PM | Updated on Mar 20 2026 6:57 PM

India Women Set Landmark Test Return In South Africa After 24 Years

భారత మహిళల జట్టు సౌతాఫ్రికా గడ్డపై టెస్టు మ్యాచ్‌ ఆడనుండడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే 24 ఏళ్ల కిందట మహిళల జట్టు సౌతాఫ్రికాలో ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని అందుకుంది. 

మరి 2002లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన టీమిండియా మహిళలు మరోసారి ఆ సీన్‌ను రిపీట్‌ చేస్తారా లేదా అన్నది చూడాలంటే డిసెంబర్‌ 20 వరకు ఆగాల్సిందే. ఈ నేపథ్యంలో క్రికెట్‌ సౌతాఫ్రికా శుక్రవారం భారత మహిళల జట్టు పర్యటనకు సంబం ధించిన వన్డేలు, ఏకైక టెస్టు మ్యాచ్‌కు సంబంధించి షెడ్యూల్‌ విడుదల చేసింది. 

సఫారీల పర్యటనలో తొలుత సౌతాఫ్రికా ఎమర్జింగ్‌ టీమ్‌తో హర్మన్‌ బృందం వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత డిసెంబర్‌ 9 నుంచి 15 మధ్య మూడు వన్డేలు, ఆ తర్వాత డిసెంబర్‌ 20 నుంచి 23 మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందే టీ20 ప్రపంచకప్‌ సన్నాహకంగా వచ్చే నెలలో సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. మహిళల టీ20 ప్రపంచకప్‌  ఇంగ్లండ్‌ వేదికగా జూన్‌ 12 నుంచి జూలై 5 వరకు జరగనుంది.

2002లో మార్చి 19 నుంచి 22 వరకు పార్ల్‌ వేదికగా జరిగిన ఆనాటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ 9 వికెట్ల నష్టానికి 404 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. భారత బ్యాటర్లలో అంజూ జైన్‌ (52), కెప్టెన్‌ అంజుమ్‌ చోప్రా (80), మిథాలీరాజ్‌ (55), హేమలతా కలా (64), మమతా మబెన్‌ (50) అర్థసెంచరీలతో రాణించారు. 

ఆ తర్వాత దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపా మరాతే 3 వికెట్లు తీయగా, నీతూ డేవిడ్‌ 2 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత ఫాలోఆన్‌ ఆడిన సౌతాఫ్రికా జట్టు 266 పరుగుల వద్ద ఆలౌటైంది. జులన్‌ గోస్వామి, హేమలతా కలా చెరో 3 వికెట్లతో రాణించారు. ఆ తర్వాత 13 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 1.3 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా ఛేదించి విజయాన్ని అందుకుంది.

సౌతాఫ్రికాలో భారత మహిళల జట్టు పర్యటన వివరాలు..

  • డిసెంబర్‌ 6: సౌతాఫ్రికా ఎమర్జింగ్‌ జట్టుతో వార్మప్‌మ్యాచ్‌

  • డిసెంబర్‌ 9: తొలి వన్డే, పోచెఫ్‌స్ట్రూమ్
    డిసెంబర్‌ 12: రెండో వన్డే, బ్లోమ్‌ఫోంటైన్
    డిసెంబర్‌ 15: మూడో వన్డే, కేప్‌టౌన్‌

  • డిసెంబర్‌ 20-23: ఏకైక టెస్టు మ్యాచ్‌, గెబెర్హా

చదవండి: ‘అతడి వెంటపడొద్దు.. స్వేచ్ఛనివ్వండి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement