వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. పసిప్రాయంలోనే దూకుడైన ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థులను వణికించిన 15 ఏళ్ల సూర్యవంశీ ఏడాది కాలంగా అండర్-19 క్రికెట్‌లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవలే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 175 పరుగుల సంచలన ఇన్నింగ్స్ అతడి అసాధారణ ప్రతిభకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇంతకాలం అండర్-19 క్రికెట్‌లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ ఇక ఐపీఎల్‌లో తన మెరుపులు చూపించేందుకు సమాయ త్తమవుతున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సూర్యవంశీపై ఈసారి భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రియాన్ పరాగ్ వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘ఏడాది కాలంగా తిరుగులేని ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిలో పడ్డాడు. ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడ భారీ స్కోర్లు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఐపీఎల్ ద్వారా వైభవ్ కొత్తగా నిరూపించుకోవాల్సిన పని లేదు. అలాంటి యంగ్ ఓపెనర్ మా జట్టులో ఉండడం మాకు కొండంత బలం. ఇటీవలే అండర్-19 ప్రపంచకప్‌లో సూర్యవంశీ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్‌లే అందుకు నిదర్శనం.
ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉండడం సహజమే. కానీ కెప్టెన్‌గా వైభవ్‌కు నేను ఇచ్చే సలహా ఒక్కటే. అందరి దృష్టి తన మీదే ఉండడంతో మీడియా అటెన్షన్ ఉంటుంది. అందుకే మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ అతడు తన ఆటను ఎంజాయ్ చేస్తూ ఆడితే బాగుంటుంది. అతడికింకా 15-16 ఏళ్లు మాత్రమే. అందుకే సూర్యవంశీని తన ఆటను స్వేచ్ఛగా ఆడనిద్దాం.
జట్టుగా అతడిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడం మా బాధ్యత. సంచలన ఇన్నింగ్స్‌లతో దేశానికి గర్వకారణంగా నిలిచిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లోనూ అదరగొట్టాలని ఆశిస్తున్నా’ అని పరాగ్ చెప్పుకొచ్చాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర మాట్లాడుతూ.. ‘బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్ల సమతూకంతో మా జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తోంది. ఈసారి కచ్చితంగా టైటిల్ కొట్టేందుకే అహర్నిశలు శ్రమించనున్నాం’ అని తెలిపాడు.
కాగా గతేడాది వరకు రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్ ట్రేడింగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు వెళ్లిపోవడంతో రియాన్ పరాగ్ రాజస్థాన్ నూతన కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. శాంసన్ స్థానంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లు చెన్నై నుంచి రాజస్థాన్‌కు వచ్చారు.
చదవండి: ఇరాన్‌కు షాకిచ్చిన ఫిఫా!


