ఇంతకూ ‘ఎవరీ నటరాజన్‌?’ | Indian Cricket Bowler Thangarasu Natarajan Special Story | Sakshi
Sakshi News home page

ఇంతకూ ‘ఎవరీ నటరాజన్‌?’

Oct 14 2020 8:46 AM | Updated on Oct 14 2020 11:55 AM

Indian Cricket Bowler Thangarasu Natarajan Special Story - Sakshi

‘ఆట కూడెడుతుందా? కూలీ పనిచెయ్‌...చికెన్‌ కొట్టు’ అని తల్లిదండ్రులు ఎప్పుడూ ఆర్డర్‌ వేయలేదు. కొడుకు ఆడుతుంటే మురిసిపోవడం తప్ప ఎప్పుడూ అడ్డుకున్నది లేదు.

ఒక పెద్దాయన చాలా హుందాగా అన్నాడు...
‘నాకు యార్కర్‌ అంటే తెలియకపోవడం ఏమిటయ్యా! వింత కాకపోతేనూ... యార్కర్‌ అంటే నువ్వు వేసే బంతులే కదా. అవును... వీటిని  యార్కర్‌ అని ఎందుకు పిలుస్తారు? కాస్త చెబుతావా?’
అప్పుడు ప్రొఫెషనల్‌ ప్లేయర్‌ అమాయకంగా ఇలా బదులిచ్చాడు...
‘అమ్మతోడు సార్‌... నేను వేసే వాటిని యార్కర్‌ అంటారని మీరు చెప్పేవరకు నిజంగా నాకు తెలియదు’
వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌లోని ‘పంచ్‌’ మ్యాగజైన్‌లలో ఇలాంటి సరదా మాటలు బోలెడు దొరుకుతాయి. అయితే యార్కర్‌ అంటే సరదా కాదు. ప్రత్యర్థి కాళ్లకు బంధనాలు వేసి ఇరుకున పెట్టడం...జట్టు విజయానికి దారి పరచడం. ఆ విద్యలో తన టాలెంట్‌ చూపుతూ ‘కింగ్‌’ అనిపించుకుంటున్నాడు తంగరసు నటరాజన్‌. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కూడా మరోసారి తన యార్కర్లతో ఆకట్టుకున్నాడు.

కడు పేదరికం నుంచి వచ్చిన నటరాజన్‌ ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తున్నాడు.
సేలం జిల్లాలోని చిన్న ఊరు చిన్నప్పంపట్టి. చెన్నైకి 340 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ ఊరు వాడే తంగరసు నటరాజన్‌. తండ్రి దినసరి కూలి. తల్లి రోడ్డు పక్కన చికెన్‌ అమ్ముతుంది. ‘జీరో సౌకర్యాలు’ తప్ప ఆ ఊళ్లో చెప్పుకోదగ్గవి పెద్దగా ఏమీలేవు. అలాంటి ఊళ్లో టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఆడేవాడు నటరాజన్‌.
‘ఆట కూడెడుతుందా? కూలీ పనిచెయ్‌...చికెన్‌ కొట్టు’ అని తల్లిదండ్రులు ఎప్పుడూ ఆర్డర్‌ వేయలేదు. కొడుకు ఆడుతుంటే మురిసిపోవడం తప్ప ఎప్పుడూ అడ్డుకున్నది లేదు.
క్రికెట్‌ సీజన్‌ వస్తే నటరాజన్‌కు ఒకేసారి వందపండగలు వచ్చినట్లు. పొద్దుట ఎనిమిది గంటలకల్లా ఇంట్లో నుంచి బయటపడి ఊరూరు తిరుగుతూ ఆటలు ఆడేవాడు.
‘ఇంకేముంది వాళ్లే కచ్చితంగా గెలుస్తారు’ అంటూ డీలా పడిపోయి ప్రత్యర్థి జట్టుకు గెలుపు కిరీటం తొడగడానికి రెడీ అవుతున్న అనేకానేక సందర్భాలలో సొంత జట్టును గెలిపించాడు నటరాజన్‌.

అయిదుగురు సంతానంలో పెద్దవాడు నటరాజన్‌. కుటుంబమంతా  కలిసి ఒక చిన్నగదిలో నివసించేది.
‘తిండి, నీళ్లు, ఆరోగ్యం అన్నీ సమస్యలే. స్కూల్లో ఉచితంగా పెట్టే భోజనంతో కడుపు నింపుకునేవాడిని’ అంటూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు నటరాజన్‌.
‘మావాడు టైమ్‌పాస్‌ కోసం ఆడడం లేదు. వాడికంటూ ఒక టైమ్‌ వస్తుంది’ అని తల్లిదండ్రులు అనుకున్నారో లేదోగానీ....అతడికంటూ ఒక ‘టైమ్‌’ వచ్చింది!
రంజీల్లో రాణించి, టీఎన్‌పీఎల్‌(తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌)లో తడాఖా చూపిన నటరాజన్‌ను కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ మూడు కోట్లకు ఎంపిక చేసుకుంది. ఆ డబ్బుతో తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టించాడు. ఊళ్లో ‘క్రికెట్‌ అకాడమీ’ మొదలు పెట్టి యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు.
నటరాజన్‌తో కలిసి 2009 నుంచి క్రికెట్‌ ఆడిన జయప్రకాష్‌ ‘ఆరు బంతులకు ఆరు యార్కర్లు పడేవి’ అని గతాన్ని తలుచుకుంటు మురిసిపోతుంటాడు. ‘నీకు క్రికెట్‌లో మంచి భవిష్యత్‌ ఉంది’ అని గట్టిగా చెప్పింది, ప్రోత్సహించిందే ఇతడే. వీరి అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. జయప్రకాష్‌ను మార్గ నిర్దేశకుడిగా చూస్తాడు నటరాజన్‌. లోకల్‌ విలేజ్‌ టోర్నమెంట్స్‌లో నటరాజన్‌ గెలుచుకున్న 150కి పైగా ట్రోఫీలలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆట మైకంలో అర్ధాకలితో  గడిపిన రోజల నుంచి మొదలు ఓటమిని పసిగట్టి గెలుపు వ్యూహం రచించడం వరకు ఎన్నెన్నో వాటిలో ఉన్నాయి.

‘ఈ కుర్రాడికి ఎప్పుడు చూసిన ఆటలే’ అని విసుక్కున్న వారు కూడా ఇప్పుడు...
‘మన ఊరు అబ్బాయి ఎంత ఎదిగిపోయాడో చూశావా. అలా ఉండాలి పట్టుదల అంటే’ అంటుంటారు.
అయితే నటరాజన్‌ కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోనంతగా ఏమీ దూసుకుపోలేదు. మొదట్లో ‘ఇంప్రాపర్‌ బౌలింగ్‌ యాక్షన్‌’ అని వెనక్కి పిలిచినప్పుడు ‘ఇక నా పని అయిపోయినట్లే’ అనుకున్నాడు. అంతమాత్రానా ఆటకు టాటా చెప్పలేదు. తనను తాను మరింత పదును పెట్టుకున్నాడు. ఆ తరువాత  ‘బౌలింగ్‌ యాక్షన్‌’కు క్లీన్‌చీట్‌ వచ్చింది. ప్రయాణం మొదలైంది. మధ్యలో కాస్త తడబడ్డాడు. మరో ఛాన్స్‌ కోసం ఎక్కువ సమయమే వేచి చూడాల్సి వచ్చింది. ఎక్కడ నిరాశ పడలేదు. మళ్లీ లేచాడు. ముత్తయ్య మురళీధరన్‌లాంటి దిగ్గజాల దృష్టిలో పడ్డాడు. 
తన యార్కర్కతో మెరుపులు మెరిపించినప్పుడల్లా ‘ఎవరీ నటరాజన్‌?’ అనే ప్రశ్న వస్తూనే ఉంటుంది. జవాబులో ఎంత స్ఫూర్తి ఉంటుందో కదా!

అది మాత్రమే చాలదు
తమిళనాడు గ్రామీణ ప్రాంతాలలో క్రికెట్‌ చూడడం, ఆడడం గొప్ప విషయమేగానీ దాన్ని కెరీర్‌ ఆప్షన్‌గా మలుచుకోవాలనే ఆలోచన తక్కువ. దీన్ని టైమ్‌పాస్‌ ఆటగానే చూస్తున్నారు. ప్రతిభ ఉండాలేగానీ మన కుటుంబ ఆర్థికనేపథ్యం అనేది ముఖ్యం కాదు. ఆటతీరు మాత్రమే ముఖ్యమవుతుంది.
– తంగరసు నటరాజన్, లెఫ్టార్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement