5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. రెండో టెస్ట్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన (కాలు బెణికింది) వారి తురుపు ముక్క, స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ సిరీస్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. లయోన్ లేని లోటు ఆసీస్‌కు ఎదరుదెబ్బగా పరిగణించబడుతుంది.
లయోన్ స్థానంలో సీఏ ఎవరిని కొత్తగా ఎంపిక చేయలేదు. మూడో టెస్ట్‌కు లయోన్ స్థానంలో టాడ్ మర్ఫీ తుది జట్టులో ఉంటాడని తెలుస్తోంది. ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మర్ఫీ ప్రతిభను (4 టెస్ట్‌ల్లో 14 వికెట్లు) పరిగణలోకి తీసుకుని సీఏ అతనివైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన మర్ఫీ.. ఆసీస్ తరఫున ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడాడు. ఆసీస్-ఇంగ్లండ్‌ల మధ్య మూడో టెస్ట్ హెడింగ్లే వేదికగా జులై 6 నుంచి మొదలు కానుంది.
కాగా, రెండో టెస్ట్, రెండో రోజు ఆటలో బెన్ డకెట్ క్యాచ్ అందుకోబోతూ నాథన్ లయోన్ కాలు బెణికింది. యాదృచ్చికంగా ఈ మ్యాచ్ లయోన్‌కు తన కెరీర్‌లో వరుసగా వందో టెస్ట్ మ్యాచ్. గాయపడిన అనంతరం లయోన్ బరిలోకి దిగనప్పటికీ..నాలుగో రోజు జట్టు కోసం పెద్ద సాహసమే చేశాడు. కుంటుతూనే బ్యాటింగ్‌కు వచ్చి తన జట్టుకు అతి మూల్యమైన పరుగులు సమకూర్చాడు. ఈ మ్యాచ్‌లో లయోన్ లేకపోయినా ఆసీస్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది.
స్టోక్స్ పోరాటం వృధా..
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆసీస్ అంతిమంగా విజయం సాధించినప్పటికీ.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వారికి ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాపించాడు. వీరోచితమైన ఇన్నింగ్స్‌తో తన జట్టును గెలిపించినంత పని చేశాడు. ఆసీస్ నిర్ధేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక్కడే అద్భుతమైన పోరాటం చేశాడు. జట్టులో డకెట్‌్ (83) మినహా మిగతా వారెవ్వరి నుంచి సహకారం లభించకపోవడంతో ఇంగ్లండ్ 327 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment