FIFA World Cup 2022: Interesting Facts About Self-Goal Killed Football Player Andres Escobar - Sakshi
Sakshi News home page

FIFA WC 2022: సెల్ఫ్‌ గోల్‌ ఆటగాడి ప్రాణం తీసింది..

Published Thu, Dec 1 2022 10:04 PM | Last Updated on Fri, Dec 2 2022 9:31 AM

Intresting Facts About Self-Goal Killed Football Player Andres Escobar - Sakshi

ఫుట్‌బాల్‌లో సెల్ఫ్‌ గోల్‌ అంటే సొంతజట్టు గోల్‌బాక్స్‌లో కొట్టడం. ఇలా చేస్తే ప్రత్యర్థి జట్టు ఖాతాలోకి గోల్‌ వెళ్లిపోతుంది. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే జరిగాయి. అయితే అదే సెల్ఫ్‌ గోల్‌ ఒక ఫుట్‌బాల్‌ ఆటగాడి ప్రాణం తీసిందంటే నమ్ముతారా. కానీ నమ్మి తీరాల్సిందే.

విషయంలోకి వెళితే.. 1994 ఫిఫా వరల్డ్‌కప్‌లో కొలంబియా తన తొలి మ్యాచ్‌లో రొమేనియాతో తలపడింది. ఆ మ్యాచ్‌లో కొలంబియా 1-3 తేడాతో రొమేనియా చేతిలో ఓడిపోయింది. ఇక రెండో మ్యాచ్‌ అమెరికాతో జరిగింది. నాకౌట్‌ దశ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిందే. కొన్ని కారణాల రిత్యా జట్టులో కీలక ఆటగాడైన గాబ్రియెల్‌ గోమెజ్‌ను ఆఖరి నిమిషంలో జట్టు నుంచి తప్పించారు.

కీలక ఆటగాడు లేకుండానే బరిలోకి దిగిన కొలంబియా తొలి అర్థగంట మంచి ఆటను ప్రదర్శించింది. అయితే ఆట 35వ నిమిషంలో కొలంబియా ఆటగాడు ఎస్కోబార్‌ పెద్ద తప్పిదం చేశాడు. అమెరికా ఆటగాడు హర్కీస్‌ బంతిని కొలంబియా గోల్‌పోస్టు సమీపంలో ఉన్న స్టెవార్ట్‌ దిశగా కొట్టాడు. కానీ  ఆండ్రెస్‌ ఎస్కోబార్‌ స్టెవార్ట్‌కు బంతిని అందకుండా చేసే ప్రయత్నంలో అతడి కాలుకి తాకిన బంతి అనూహ్యంగా గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. ఎస్కోబార్‌ సెల్ఫ్‌గోల్‌ కారణంగా అమెరికాకు 1-0 ఆధిక్యం లభించింది.

ఇది కొలంబియాకు పెద్ద షాక్‌. ఆ తర్వాత ఆట 52వ నిమిషంలో యూఎస్‌ఏ ప్లేయర్‌ స్టెవార్ట్‌ మరో గోల్‌ కొట్టడంతో అమెరికా 2-0తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఆట చివర్లో కొలంబియా ఆటగాడు వాల్సేనియా గోల్‌ చేసినప్పటికి లాభం లేకపోయింది. దీంతో కొలంబియా 2-1 తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌ తర్వాత స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌ను కొలంబియా 2-0 తేడాతో ఓడించింది. కానీ అమెరికాతో మ్యాచ్‌లో ఓటమి కొలంబియాను ఇంటిబాట పట్టేలా చేసింది. దీనికి ప్రధాన కారణం ఎస్కోబార్‌ సెల్ఫ్‌గోల్‌ చేయడమే. అమెరికాతో మ్యాచ్‌లో ఎస్కోబార్‌ ఆ గోల్‌ చేయకపోయుంటే మ్యాచ్‌ డ్రా అయ్యి కొలంబియాకు నాకౌట్‌ చాన్సులు ఉండేవి.

ఇక కొలంబియా గ్రూప్‌ దశలోనే వెనుదిరగడంతో ఎస్కోబార్‌ స్వదేశానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి నైట్‌క్లబ్‌కు వెళ్లిన ఎస్కోబార్‌ అక్కడే చాలాసేపు గడిపాడు. ఆ తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటికి బయలుదేరిన ఎస్కోబార్‌తో కొందరు వ్యక్తులు గొడవకు దిగారు. ఆ తర్వాత తుపాకీ తీసి ఎస్కోబార్‌పై కాల్పులు జరిపారు. కాల్చిన ప్రతీసారి 'గో.. గో' అని అరిచారు.

దక్షిణ అమెరికాలో ఆటగాళ్లు గోల్‌ చేసిన ప్రతీసారి అక్కడి వ్యాఖ్యతలు గో అనే అంటారు. అరగంట పాటు రోడ్డుపైనే రక్తపు మడుగులో పడి ఉన్న ఎస్కోబార్‌ను కొందరు స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అలా ఒక సెల్ఫ్‌ గోల్‌ ఒక ఫుట్‌బాల్‌ ఆటగాడి ప్రాణం పోవడానికి కారణమైంది. ఆ మరునాడు ఎస్కోబార్‌ అంతిమయాత్రలో దాదాపు లక్షా 20వేల మంది పాల్గొన్నట్లు అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement