Photos Courtesy: IPL/BCCI
4 milestones to watch out for in Qualifier 2: ఐపీఎల్-2021 సీజన్‌లో బుధవారం ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్‌లో చెన్నైని ఢీకొట్టేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సమాయత్తమవుతున్నాయి. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇరు జట్లు 29 సార్లు ముఖాముఖి తలపడగా కోల్‌కతా 15 సార్లు గెలుపొంది పైచేయి సాధించింది. ఢిల్లీ 13 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. నేటి(అక్టోబరు 13) మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం!
పంత్(Rishabh Pant) 8 పరుగులు చేస్తే..
శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. ఈ సీజన్‌లో తొలి అంచెలో ఢిల్లీ అద్భుతంగా రాణించడంతో.. శ్రేయస్ జట్టులోకి తిరిగి వచ్చినా.. ఫ్రాంఛైజీ అతడినే సారథిగా కొనసాగించింది. యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగానే.. పంత్ జట్టును టేబుల్ టాపర్‌గా నిలిపాడు. బ్యాటర్‌గానూ తన వంతు సేవలు అందించాడు. ఐపీఎల్-2021లో 15 మ్యాచ్‌లలో పంత్ 413 పరుగులు సాధించాడు. ఇక క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో అతడు గనుక 8 పరుగులు చేస్తే.. ఐపీఎల్ కెరీర్‌లో 2500 రన్స్ మైలురాయిని చేరుకుంటాడు.
అక్షర్ పటేల్(Axar Patel)...
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో గేమ్ చేంజర్‌గా పలు కీలక మ్యాచ్‌ల విజయాల్లో భాగమయ్యాడు అక్షర్ పటేల్. బౌలర్‌గా, బ్యాటర్‌గా తన వంతు పాత్ర పోషించాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో తుది జట్టులో గనుక అక్షర్ చోటు దక్కించుకుని... 5 వికెట్లు తీయగలిగితే ఐపీఎల్ 100 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. ఇక ఈ సీజన్‌లో అతడు ఇప్పటి వరకు 15 వికెట్లు పడగొట్టాడు.
మోర్గాన్(Eoin Morgan) పూర్తి చేస్తాడా?
ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్-2021 రెండో అంచెలో అద్భుత విజయాలు సాధించింది. వరుస విజయాలతో టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. అయితే, బ్యాటర్‌గా మాత్రం మోర్గాన్ ఇంతవరకు మరీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే.. నేటి మ్యాచ్‌లో మోర్గాన్ 9 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్ కెరీర్‌లో వెయ్యి పరుగుల మార్కును చేరుకుంటాడు.
డీకే(Dinesh Karthik) ముంగిట బౌండరీల రికార్డు
కేకేఆర్ మాజీ కెప్టెన్ దినేశ్ కార్తిక్.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 214 పరుగులు చేశాడు. ఇందులో 22 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో డీకే ఒక్క బౌండరీ బాదితే చాలు.. ఐపీఎల్‌లో 400 ఫోర్లు తన పేరిట లిఖించుకోగలుగుతాడు. తద్వారా లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా నిలుస్తాడు.
మరి వీళ్లందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా?!
చదవండి: Aakash Chopra: ఈరోజు మీ కథ ముగుస్తుంది.. ఆ జట్టుదే విజయం
Comments
Please login to add a commentAdd a comment