
రవీంద్ర జడేజా- ఎంఎస్ ధోని (Photo: IPL/BCCI)
Ravindra Jadeja Tweet On CSK Captaincy: గత సీజన్‌లో దారుణమైన ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్.. ఐపీఎల్-2021లో మాత్రం మెరుగైన ఆటతో అభిమానుల మనసు దోచుకుంటోంది. ఐపీఎల్- 2020లో ప్లే ఆఫ్స్ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న ధోని సేన ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టి దానిని చెరిపేయాలని భావిస్తోంది. ఇక ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే ఐదింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఆరంభం కానున్న రెండో అంచెకోసం సన్నద్ధమవుతోంది.
ఇదిలా ఉండగా.. సీఎస్‌కే కెప్టెన్సీ అంశంపై సోషల్ మీడియాలో మరోసారి ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతోంది. ఈసారి చెన్నై అదరగొడుతున్నప్పటికీ కెప్టెన్ ధోని మాత్రం ఇంతవరకు తన బ్యాటింగ్ ప్రతాపం చూపలేదు. మొదటి దశలో కేవలం 37 పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశకు గురిచేశాడు. ఈ నేపథ్యంలో 40 ఏళ్ల ధోని ఒకవేళ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటే తదుపరి కెప్టెన్ ఎవరనుకుంటున్నారు అంటూ సీఎస్‌కే ఫ్యాన్స్ ఆర్మీ పేజీ ఓ ప్రశ్నను సంధించింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చెన్నై స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. ‘‘నంబర్ 8’’ అంటూ ఠక్కున సమాధానమిచ్చాడు. కాగా జడేజా జెర్సీ నంబర్ 8 అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జడేజా.. కెప్టెన్ అవ్వాలన్న తన మనసులోని మాటను ఈ విధంగా బయటపెట్టాడంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. దీంతో వెంటనే తేరుకున్న జడేజా తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు.
ఆ అర్హత జడేజాకే ఉంది!
ఐపీఎల్-2021 సీజన్‌లో భాగంగా మైదానంలో మెరుపులాంటి ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకుంటున్న జడేజా, భారత్‌లో అత్యుత్తమ ఫీల్డర్‌గా మాజీలచే ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కెప్టెన్‌గా ధోని వారసుడు జడ్డూనే అని, అతడిని కేంద్రంగా చేసుకుని చుట్టూ జట్టును నిర్మించాలని సీఎస్‌కే ఫ్రాంఛైజీకి సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ కెప్టెన్‌గా ఉన్న సురేశ్ రైనాను కాదని, జడేజాకు కెప్టెన్‌గా అవకాశం వస్తుందా లేదా.. ఇంతకు ధోని ఇప్పుడప్పుడే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొనే అవకాశం ఉందా అన్న అంశాలపై సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. కాగా ధోని నేతృత్వంలోని చెన్నై మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా, దాదాపు ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
చదవండి: ధోని సేనకు భారీ షాక్.. ఒకేసారి నలుగురు విదేశీ స్టార్లు దూరం..!
Comments
Please login to add a commentAdd a comment