న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్రధాన వేదికల్లో ఒకటైన ముంబైలో కరోనా ఉధృతి పెరగడంతో అక్కడి నుంచి తరలించే మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని అంటున్నారు టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్. ఈ మేరకు ఆయన ఆదివారం బీసీసీఐకి లేఖ రాసినట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు. ముంబై వాంఖడే స్టేడియంకు చెందిన 10 మంది సిబ్బంది, కొందరు ఈవెంట్ మేనేజర్లకు కోవిడ్ నిర్ధారణ కావడంతో అక్కడ మ్యాచ్‌లు నిర్వహించే విషయమై సందిగ్ధత నెలకొంది. దీంతో వాంఖడేలో నిర్వహించే మ్యాచ్‌లను ఇతర ప్రాంతాల్లో నిర్వహించేందుకు స్టాండ్ బై గ్రౌండ్లను సిద్ధం చేయాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అజ్జూ భాయ్ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకాబోయే 14వ సీజన్ ఐపీఎల్ కోసం ఇండోర్, హైదరాబాద్‌లను స్టాండ్-బై వేదికలుగా బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ముంబైలో పరిస్థితులు ఎంతగా దిగజారినా క్రికెట్ మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం ఉండదని బీసీసీఐ ఆఫీసు బేరర్ ప్రకటించడం కొసమెరుపు. కాగా, షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10న వాంఖడే స్టేడియంలో జరగాల్సిన తొలి మ్యాచ్‌లో గతేడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్, త్రీ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.
చదవండి: కోహ్లితో ఓపెనర్‌గా అతనైతే బాగుంటుంది, కానీ..
Comments
Please login to add a commentAdd a comment