IPL 2021 PBKS Vs CSK : Live Score Updates, Match Highlights In Telugu - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2021: సీజన్‌ తొలి విజయాన్ని నమోదు చేసిన ధోని సేన‌‌‌‌‌‌‌‌

Published Fri, Apr 16 2021 7:01 PM | Last Updated on Sat, Apr 17 2021 1:39 AM

 IPL 2021: Punjab VS CSK Match - Sakshi

Photo Courtesy: BCCI/IPL

107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలో వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుఉంది. ఫలితంగా ఐపీఎల్‌ 2021 సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. గత మ్యాచ్‌లో 200కుపైగా స్కోర్‌ చేసిన పంజాబ్‌ను ఈ మ్యాచ్‌లో 106 పరగులకే పరిమితం చేసి సీఎస్‌కే, ఆ జట్టుపై 6 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. మెరిడిత్‌ బౌలింగ్‌లో సామ్ కర్రన్‌(4 బంతుల్లో 5; ఫోర్‌) బౌండరీ సాధించి చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఓపెనర్‌గా వచ్చి నిలకడగా ఆడిన డుప్లెసిస్‌(33 బంతుల్లో 36; 3 ఫోర్లు, సిక్స్‌) ఆఖరి వరకు క్రీజ్‌లో నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొయిన్‌ అలీ(‌‌‌‌‌‌‌31 బంతుల్లో 47; 7 ఫోర్లు, 1 సిక్స్‌ ) ఆకట్టుకున్నాడు. పంజాబ్‌ బౌలర్లలో షమీ 2, అర్ష్‌దీప్‌, మురుగన్‌ అశ్విన్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.  

వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే.. 14.3 ఓవర్ల తర్వాత 99/4
99 పరుగుల వద్ద సీఎస్‌కే రెండు వికెట్లు కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో తొలుత రైనా ఔట్‌ కాగా, ఆమరుసటి బంతికే రాయుడు డకౌట్‌గా వెనుదిరిగాడు. కవర్‌ పాయింట్‌లో పూరన్‌ క్యాచ్‌ అందుకోవడంతో రాయుడు పెవిలియన్‌ బాటపట్టాడు. క్రీజ్‌లోకి సామ్‌ కర్రన్‌ వచ్చాడు. ‌‌‌‌‌‌‌‌

రైనా(8) ఔట్‌
షమీ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రాహుల్‌ క్యాచ్‌ అందుకోవడంతో రైనా(9 బంతుల్లో 8; ఫోర్‌) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. 14.2 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 99/3. క్రీజ్‌లో డుప్లెసిస్‌(30 బంతుల్లో 33; 3 ఫోర్లు, సిక్స్‌), రాయుడు ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే.. మొయిన్‌ అలీ(46) ఔట్‌‌‌‌‌‌‌‌
వేగంగా పరుగులు సాధిస్తున్న మొయిన్‌ అలీని(‌‌‌‌‌‌‌31 బంతుల్లో 47; 7 ఫోర్లు, 1 సిక్స్‌) మురుగన్‌ అశ్విన్‌ బోల్తా కొట్టించాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో డిప్‌ మిడ్‌ వికెట్‌ ఫీల్డర్‌ షారుక్‌ ఖాన్‌ క్యాచ్‌ అందుకోవడంతో మొయిన్‌ అలీ పెవిలియన్‌కు చేరాడు. 12.3 ఓవర్ల తర్వాత సీఎస్‌కే స్కోర్‌ 90/2. క్రీజ్‌లో  డుప్లెసిస్‌(28 బంతుల్లో 33; 3 ఫోర్లు, సిక్స్‌), రైనా(0) ఉన్నారు.

గెలుపు దిశగా పయనిస్తున్న సీఎస్‌కే
9 ఓవర్ల వరకు ఆచితూచి ఆడిన చెన్నై.. ఆతరువాత గేర్‌ మార్చింది. 10వ ఓవర్‌లో 11 పరుగులు, 11వ ఓవర్‌లో 10 పరుగులు, 12వ ఓవర్‌లో 10 పరుగులు పిండుకుని విజయం దిశగా సాగుతుంది.  డుప్లెసిస్‌(28 బంతుల్లో 33; 3 ఫోర్లు, సిక్స్‌), మొయిన్‌ అలీ(20 బంతుల్లో 47; 7 ఫోర్లు) వేగంగా పరుగులు సాధిస్తూ లక్ష్యం దిశగా సాగుతున్నారు. 12 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 84/1.   

ఆచితూచి ఆడుతున్న సీఎస్‌కే.. 9 ఓవర్ల తర్వాత 53/1
ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతున్న సీఎస్‌కే.. స్ట్రేటజిక్‌ టైమ్‌ అవుట్‌ సమయం వరకు కూడా అలానే ఆడింది. ఓపెనర్‌ డుప్లెసిస్‌(21 బంతుల్లో 19; ఫోర్‌, సిక్స్‌), వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ మొయిన్‌ అలీ(17 బంతుల్లో 24; 5 ఫోర్లు) చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ.. స్కోర్‌ బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీంతో 9 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై స్కోర్‌ 53/1. 

తొలి వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే.. గైక్వాడ్(5) ఔట్
107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన చెన్నై జట్టుకు 5వ ఓవర్‌ ఆఖరి బంతికి షాక్‌ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ గైక్వాడ్‌ను(16 బంతుల్లో 5) అర్ష్‌దీప్‌ సింగ్‌ పెవిలియన్‌కు పంపాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డ గైక్వాడ్‌.. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌ వికెట్‌ ఫీల్డర్‌ హూడాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవర్ల తర్వాత చెన్నై స్కోర్‌ 24/1. క్రీజ్‌లో డుప్లెసిస్‌(14 బంతుల్లో 14; ఫోర్‌, సిక్స్‌), మొయిన్‌ అలీ(0) ఉన్నారు.

పంజాబ్‌ 106/8.. చెన్నై టార్గెట్‌ 107‌‌‌‌‌
కొత్త కుర్రాడు షారుక్‌ ఖాన్‌ బాధ్యతాయుతంగా ఆడటంతో పంజాబ్‌ కనీసం 100 పరుగుల మార్కును చేరుకోగలిగింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ స్కోర్‌ 106/8. షమీ(12 బంతుల్లో 9), మెరిడిత్‌(0) నాటౌట్‌గా ఉన్నారు.  చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌ అత్యుత్తమంగా బౌలింగ్‌ చేయడంతో పంజాబ్‌ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అతనికి ఫీల్డ్‌లో జడేజా సహకారం తోడవ్వడంతో పంజాబ్‌ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. చెన్నై బౌలర్లలో చాహర్‌ 4 వికెట్లు పడగొట్టగా, సామ్‌ కర్రన్‌, మొయిన్‌ అలీ, బ్రావో తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఫీల్డ్‌లో పాదరసంలా కదిలిన జడేజా రెండు అద్భుతమైన క్యాచ్‌లతో పాటు ఓ కళ్లు చెదిరే రనౌట్‌ చేసి పంజాబ్‌ వెన్నువిరిచాడు.

పంజాబ్‌ ఎనిమిదో వికెట్‌ డౌన్‌.. షారుక్‌ ఖాన్‌(47)
ఓవైపు వికెట్లు పడుతున్నా బాధ‍్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసిన కొత్త కుర్రాడు షారుక్‌ ఖాన్‌(36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు).. తృటిలో మెయిడిన్‌ హాఫ్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. పంజాబ్‌ స్కోర్‌ త్రీ డిజిట్‌కు చేరుకుందంటే అది అతని చలువే. సామ్‌ కర్రన్‌ వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌ అడే ప్రయత్నం చేసిన షారుక్‌.. జడేజాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 19.1 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 101/8.

మురుగన్‌ అశ్విన్‌(6) ఔట్‌..17 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 87/7 
పంజాబ్‌ ఆటగాళ్లు చెన్నై ఫీల్డర్లకు క్యాచ్‌ ప్రాక్టీస్‌ చేయించారు. బ్రేవో బౌలింగ్‌లో మురుగన్‌ అశ్విన్‌(14 బంతుల్లో 6) డుప్లెసిస్‌కు సునాయాసమైన క్యాచ్‌ అందించి ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. 17 ఓవర్ల తర్వాత  పంజాబ్‌ స్కోర్‌ 87/7. క్రీజ్‌లో షారుక్‌(39), షమీ(0) ఉన్నారు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌.. రిచర్డ్‌సన్‌(15) క్లీన్‌ బౌల్డ్
26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌.. 50 పరుగులలోపే చాపచుట్టేస్తుందనుకున్న తరుణంలో రిచర్డ్‌సన్‌(22 బంతుల్లో 15; 2 ఫోర్లు) కాసేపు నిలువరించి స్కోర్‌ను 50 పరుగులు దాటించాడు. అయితే స్కోర్‌ 57 పరుగుల వద్ద నుండగా మొయిన్‌ అలీ బౌలింగ్‌లో అతను క్లీన్‌ బౌల్డ్‌ అయి ఆరో వికెట్‌గా వెనుదిరగడంతో 12.1 ఓవర్ల‌ తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 57/6. క్రీజ్‌లో షారుక్‌ ఖాన్‌(15), మురుగన్‌ అశ్విన్‌(0) ఉన్నారు.  

26 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన పంజాబ్‌.. హూడా(10) ఔట్
చాహర్‌ ధాటికి పంజాబ్‌ కుదేలైంది. నిలకడగా ఆడుతున్న హూడాను (15 బంతుల్లో 10; ఫోర్‌) చాహర్‌ బోల్తా కొట్టించాడు. మిడాఫ్‌లో డుప్లెసిస్‌ క్యాచ్‌ అందుకోవడంతో హూడా పెవిలియన్‌ బాటపట్టాడు. దీంతో పంజాబ్‌ 11 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. పంజాబ్‌ కోల్పోయిన ఐదు వికెట్లలో చాహర్‌ ఒక్కడే నాలుగు వికెట్లు పడగొట్టాడంటే అతను ఏ మేరకు ప్రత్యర్ధిని దెబ్బకొట్టాడో అర్ధమవుతోంది. 3.2 ఓవర్లలో 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన చాహర్..‌ ఐపీఎల్‌ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. 6.2 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 26/5. క్రీజ్‌లో షారుక్‌ ఖాన్‌(0), రిచర్డ్‌సన్‌(0) ఉన్నారు.  

చాహర్‌ తీన్‌మార్‌.. పూరన్‌ డకౌట్‌‌‌
19 పరుగులకే 3వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న పంజాబ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆఖరి గుర్తింపు పొందిన బ్యాట్స్‌మెన్‌ పూరన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు. చాహర్‌... అంతుచిక్కని నకుల్‌ బంతులను సందిస్తూ పంజాబ్‌ వెన్నువిరిచాడు. అతని ధాటికి రాహుల్‌ సేన నాలుగు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి, కోలుకోలేని స్థితిలో ఉంది. పూరన్‌.. ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న శార్ధూల్‌ ఠాకూర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. దీంతో పంజాబ్‌ 19 పరుగులకే 4 వికెట్లు కోల్పయింది. క్రీజ్‌లో హూడా(3), షారుక్‌ ఖాన్‌(0) ఉన్నారు. పంజాబ్‌ కోల్పోయిన నాలుగు వికెట్లలో మూడు వికెట్లు చాహర్‌ పడగొట్టగా, జడేజా ఫీల్డ్‌లో మెరుపు వేగంతో కదులుతూ ఓ రనౌట్‌తో పాటు ఓ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. జడేజా, చాహర్‌ల ధాటికి పంజాబ్‌ మ్యాచ్‌పై అశలు వదులుకునే పరిస్థితికి చేరింది.

జడేజా మాయ, డేంజర్‌ మ్యాన్‌ గేల్‌(10) ఔట్
డేంజర్‌ మ్యాన్‌ క్రిస్‌ గేల్‌ను(10 బంతుల్లో 10; 2 ఫోర్లు) దీపక్‌ చాహర్‌ బోల్తా కొట్టించాడు. చాహర్‌ బౌలింగ్‌లో జడేజా అద్భుతమైన డైవ్‌ క్యాచ్‌ అందుకోవడంతో గేల్‌ పెవిలియన్‌ బాట పట్టక తప్పలేదు. పంజాబ్‌ జట్టు 4.2 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే సాధిం​చి మూడో కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. క్రీజ్‌లో హూడా(3), పూరన్‌(0) ఉన్నారు.

జడేజా సూపర్‌ త్రో.. రాహుల్‌ రనౌట్(5)‌
లేని పరుగు కోసం ప్రయత్నించిన పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(7 బంతుల్లో 5; ఫోర్‌) తగిన మూల్యమే చెల్లించుకున్నాడు. చాహర్‌ వేసిన 2వ ఓవర్‌ ఐదో బంతిని గేల్‌.. బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఆడగా అవతిలి ఎండ్‌లో ఉన్న రాహుల్‌ లేని పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. జడేజా కళ్లు చెదిరే డైరెక్ట్‌ త్రో రాహుల్‌ను పెవిలియన్‌కు పంపాడు. 2.5 ఓవర్ల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 15/2. క్రీజ్‌లో గేల్‌(10), హూడా(0) ఉన్నారు.  

తొలి ఓవర్‌లోనే పంజాబ్‌కు షాక్‌‌.. మయాంక్‌ డకౌట్
తొలి ఓవర్‌లోనే పంజాబ్‌కు షాక్‌ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌ నాలుగో బంతికి దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో మయాంక్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. నాలుగు బంతుల తర్వాత పంజాబ్‌ స్కోర్‌ 1/1. క్రీజ్‌లో కేఎల్‌ రాహుల్‌(1), గేల్‌(0) ఉన్నారు.

ముంబై: ఐపీఎల్ 14వ సీజన్‌‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో అద్భుత విజయం సాధించిన పంజాబ్‌ కింగ్స్‌ మాంచి జోష్‌ మీదుండగా.. ఢిల్లీతో మ్యాచ్‌ను చేజార్చుకున్న బాధలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢీలా పడిపోయి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్‌ కింగ్స్‌ మూడో స్థానంలో, సీఎస్‌కే ఆఖరు స్థానంలో ఉన్నాయి. ముఖాముఖి పోరులో ఇరు జట్లు మొత్తం 23 సార్లు పోటీ పడగా, చెన్నై 14 మ్యాచ్‌ల్లో, పంజాబ్‌ 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. దుబాయ్‌ వేదికగా జరిగిన గతేడాది ఐపీఎల్‌లో ఇరు జట్లు రెండు పర్యాయాలు తలపడగా, రెంటిలోనూ ధోనీ సేననే విజయం వరించింది. 

ఇక జట్ల బలాబలాల విషయానికొస్తే.. చెన్నై జట్టులో ఓపెనర్లు రుతురాజ్‌, డుప్లెసిస్‌లు తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ, వారి స్థాయికి తగ్గ మేరకు రాణిస్తే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కేకు బలమైన పునాది పడే అవకాశం ఉంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌ ధోని మినహా మిగిలిన వారందరూ ఓ మోస్తారుగా రాణించారు. రైనా అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మొయిన్‌ అలీ, సామ్‌ కర్రన్‌, జడేజా, రాయుడు తక్కువ స్కోర్లే చేసినా, మెరుపు వేగంతో పరుగులు సాధించారు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాని బ్రావో, శార్ధూల్‌లు కూడా బ్యాట్‌ను ఝుళిపించగల సత్తా ఉన్న ఆటగాళ్లే కాబట్టి చెన్నై జట్టుకు బ్యాటింగ్‌ పరంగా కష్టాలేమీ లేవనే చెప్పాలి. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే.. తొలి మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు చేతులెత్తేశారు. జడేజా, చాహర్‌ మినహా మిగతా బౌలర్లంతా ఢిల్లీ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. శార్ధూల్‌ 2 వికెట్లు, బ్రావో ఓ వికెట్‌ తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మొయిన్‌ అలీ, సామ్‌ కర్రన్‌లు తమ పూర్తి స్థాయి కోటా ఓవర్లను కూడా పూర్తి చేయ లేకపోయారు. ఈ మ్యాచ్‌లో ధోని మరో స్పిన్నర్‌ను తీసుకోవాలని భావిస్తే.. ఇమ్రాన్‌ తాహిర్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 

ఇక పంజాబ్‌ విషయానికొస్తే.. రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 221 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసి జోరుమీదుంది. గత మ్యాచ్‌లో కెప్టెన్‌ రాహుల్‌, దీపక్‌ హూడా, క్రిస్‌ గేల్‌ అకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో ఈ మ్యాచ్‌లో కూడా వారిపై భారీ అంచనాలే ఉన్నాయి. మయాంక్‌ అగర్వాల్‌, పూరన్‌, కొత్త కుర్రాడు షారుక్‌ ఖాన్‌ రాణిస్తే మరోసారి పరుగల వరద పారక తప్పదు. పంజాబ్‌ బౌలింగ్‌ విషయానికొస్తే.. తొలి మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లతో సంచలన ప్రదర్శన చేసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అతనికి మరో పేసర్‌ షమీ నుంచి పూర్తి మద్దతు లభించింది. నేటి మ్యాచ్‌లో వీరిద్దరూ మరోసారి చెలరేగితే చెన్నైకి మరో ఓటమి తప్పకపోవచ్చు. కోట్లు వెచ్చించి తెచ్చుకున్న మెరిడిత్‌, రిచర్డ్‌సన్‌, మురుగన్‌ అశ్విన్‌లు ధారళంగా పరుగులు సమర్పించుకొని పూర్తిస్థాయిలో నిరాశపరిచారు. ఈ మ్యాచ్లో వారు తిరగి టచ్‌లోకి వస్తే ప్రత్యర్ధికి కష్టాలు తప్పవు. 
జట్ల వివరాలు:
పంజాబ్‌ కింగ్స్‌: కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌)‌, మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, నికోలాస్‌ పూరన్‌, దీపక్‌ హూడా, షారుఖ్‌ ఖాన్‌, జైన్‌ రిచర్డ్‌సన్‌, మురుగన్‌ అశ్విన్‌, మెరిడిత్‌, షమీ, అర్షదీప్‌ సింగ్‌
చెన్నై సూపర్‌ కింగ్స్‌: ఎంఎస్‌ ధోని(కెప్టెన్, వికెట్‌ కీపర్‌‌), రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, ఫాఫ్ డు ప్లెసిస్, సురేష్ రైనా, మొయిన్ అలీ, సామ్‌ కర్రన్‌, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, డ్వేన్‌ బ్రావో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement