చెన్నై: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో(ముంబై, హైదరాబాద్) వికెట్లు దక్కకపోవడంపై ఆర్‌సీబీ స్పిన్నర్ చహల్ భావోధ్వేగానికి లోనయ్యాడు. బాగా బౌలింగ్ చేసినప్పుడు ఫలితం దక్కకపోతే ఆ బాధ వేరుగా ఉంటుందని వాపోయాడు. ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సీజన్ తొలి వికెట్ దక్కించుకున్న చహల్.. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 34 పరుగులు సమర్పించుకుని 2 కీలకమైన వికెట్లు సాధించి, ఆర్‌సీబీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ప్రస్తుత సీజన్‌లో ఆర్‌సీబీ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి జోరుమీదున్నప్పటికీ.. చహల్‌కు మాత్రం తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా దక్కకపోవడం విశేషం.
సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడిన ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో గెలుపొందినప్పటికీ.. ఆ మ్యాచ్‌లో చహల్‌కు ఫలితం దక్కకపోగా(4 ఓవర్లలో 0/41) 10కిపైగా ఎకానమీతో పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. ఆ తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో సైతం చహల్‌కు వికెట్లు దక్కలేదు. అయితే ఈ మ్యాచ్‌లో(4 ఓవర్లలో 0/29) అతను 7.2 ఎకానమీతో కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తిరిగి ఫామ్‌ను అందుకున్న చహల్.. కీలమైన నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్‌ల వికెట్లు పడగొట్టాడు.
పవర్ ప్లేలో(ఇన్నింగ్స్ 3వ ఓవర్) బౌలింగ్ చేసిన అతను.. కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్‌ను కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ మ్యాక్స్‌వెల్(78), డివిలియర్స్(76 నాటౌట్) మెరుపుల సాయంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్‌ను సాధించగా, అనంతరం జేమీసన్(3/41), చహల్(2/34), హర్షల్ పటేల్(2/17), సుందర్(1/33) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్‌సీబీ 38 పరుగుల తేడాతో విజయం సాధించి, ఈ సీజన్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఆర్‌సీబీ ఏప్రిల్ 22న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముంబై వేదిక కానుంది.
చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు గ్రీన్‌సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment