IPL 2022 DC Vs RR No Ball Controversy: DC Rishabh Pant Loses His Cool During Match Goes Viral - Sakshi
Sakshi News home page

DC Vs RR No Ball Controversy: హైడ్రామా.. పంత్‌ తీవ్ర అసహనం.. బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ..

Published Sat, Apr 23 2022 7:36 AM | Last Updated on Sat, Apr 23 2022 11:25 AM

IPL 2022 DC Vs RR: DC Rishabh Pant Loses Cool No Ball Controversy - Sakshi

రిషభ్‌ పంత్‌ అసహనం(PC: IPL/BCCI)

IPL 2022 DC Vs RR- Rishabh Pant- No Ball Controversy: ఐపీఎల్‌-2022లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌ చివర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ముంబైలోని వాంఖడే వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు జోస్‌ బట్లర్‌(116 పరుగులు), దేవ్‌దత్‌ పడిక్కల్‌(54) అదిరిపోయే ఆరంభం అందించారు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌(46) సైతం బ్యాట్‌ ఝులిపించాడు. వీరి విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్‌ 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీ షా(37), డేవిడ్‌ వార్నర్‌(28) శుభారంభం అందించారు. కానీ, ఆ తర్వాత రిషభ్‌ పంత్‌(44), లలిత్‌ యాదవ్‌(37) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. అయితే, ఆఖర్లో రోవ్‌మన్‌ పావెల్‌ ఆశాకిరణంలా కనిపించాడు.  రాజస్తాన్‌ బౌలర్‌ మెక్‌కాయ్‌ వేసిన చివరి ఓవర్లో 36 పరుగులు కావాల్సి ఉండగా, తొలి 3 బంతుల్లో పావెల్‌ సిక్సర్లు బాదడంతో ఢిల్లీ గెలుపుపై ఆశలు చిగురించాయి.

అయితే ఫుల్‌టాస్‌గా వచ్చిన మూడో బంతి ‘నో బాల్‌’గా భావించినా అంపైర్‌ ఇవ్వలేదు. దాంతో ఢిల్లీ డగౌట్‌లో తీవ్ర ఆగ్రహం కనిపించింది. నోబా ల్‌ ఇవ్వమంటూ వారంతా సైగలు చేయడంతో పాటు ఇద్దరు బ్యాటర్లను వెనక్కి వచ్చేయమంటూ కెప్టెన్‌ పంత్‌ పిలవడం వరకు పరిస్థితి వెళ్లింది.

గ్రౌండ్‌లో ఉన్న అంపైర్లతో పాటు చహల్‌ తది తరులు కూడా బ్యాటర్లకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఢిల్లీ అసిస్టెంట్‌ కోచ్‌ ఆమ్రే అయితే మైదానంలోకే వచ్చేశాడు. అంపైర్‌ నితిన్‌ మాత్రం నిర్ణయానికి కట్టుబడుతూ ‘నోబాల్‌’ ప్రకటించలేదు.

మిగిలిన మూడు బంతుల్లోనూ సిక్సర్లు బాది పావెల్‌ గెలిపించగలిగేవాడా చెప్పలేం కానీ ఈ ఘటనతో ఢిల్లీ బృందం తమ బ్యాటర్‌ లయ దెబ్బ తీసిందనేది మాత్రం వాస్తవం. నిబంధనల ప్రకారం అవుటైన బంతులకే టీవీ అంపైర్లు నోబాల్‌ అవునా కాదా అని రీప్లే చూస్తారు.

కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ రాజస్తాన్‌ చేతిలో 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ‘నోబాల్‌’ ఘటనపై స్పందించిన నెటిజన్లు.. గతంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ఉ‍న్న ఎంఎస్‌ ధోని సైతం ఇలాగే వ్యవహరించాడని, బహుశా పంత్‌ అతడి నుంచే స్ఫూర్తి పొందాడేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందుకు సంబంధించి మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: IPL 2022 DC Vs RR: బట్లర్‌ ‘తీన్‌’మార్‌...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement