ముంబై: ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ వెనుకబడుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ఆల్‌రౌండ్ షోతో ఢిల్లీ క్యాపిటల్స్ 21 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముందుగా క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 92 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (35 బంతుల్లో 67 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగారు. అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులే చేయగలిగింది. నికోలస్ పూరన్ (34 బంతుల్లో 62; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించాడు. ఖలీల్ అహ్మద్ 3, శార్దుల్ 2 వికెట్లు తీశారు.
వార్నర్, పావెల్... ఫిఫ్టీ–ఫిఫ్టీ
ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగితే హైదరాబాద్ ఖాతా (వికెట్) తెరిచింది. భువనేశ్వర్ తొలి ఓవర్‌ను మెయిడిన్ వికెట్‌గా తీశాడు. ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలినా ఢిల్లీ పుంజుకుంది. ఈ లీగ్‌లోనే ‘స్పీడ్‌స్టర్’గా గుర్తింపు తెచ్చుకున్న ఉమ్రాన్ మాలిక్‌ను తొలి ఓవర్ నుంచే ఉతికేశారు. 4వ ఓవర్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో వార్నర్ 21 పరుగులు పిండుకున్నాడు. మార్‡్ష (10) అవుటైనా... కెప్టెన్ రిషభ్ పంత్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్సర్లు), వార్నర్ ఇద్దరు ఇన్నింగ్స్‌ను మెరుపులతో దారిలో పెట్టారు.
శ్రేయస్ గోపాల్ వేసిన 9వ ఓవర్లో పంత్ 6, 6, 6, 4లతో జూలు విదిల్చాడు. కానీ చివరి బంతినీ బాదేసే పనిలో పంత్ వికెట్ల మీదికి ఆడుకున్నాడు. వికెట్ పడ్డా... ఈ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. తర్వాత పావెల్, వార్నర్‌తో కలిసి విధ్వంసకరమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొదట వార్నర్ 34 బంతుల్లో (7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ఓవర్లు దగ్గర పడుతుంటే పావెల్ బ్యాట్ మరింత రెచ్చిపోయింది. అతను 30 బంతుల్లోనే (6 సిక్సర్లు) ఫిఫ్టీ చేశాడు. ఉమ్రాన్ ఆఖరి ఓవర్లో (6, 0, 4, 4, 4, 1) పావెల్ వీరవిహారంతో వార్నర్ శతకం 8 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇద్దరు కలిసి 11 ఓవర్లలో అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 122 పరుగులు జోడించారు.
పూరన్ మెరిపించినా...
కొండంత లక్ష్యం ఛేదించేందుకు దిగిన హైదరాబాద్ ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. టాపార్డర్ బ్యాటర్స్ అభిషేక్ శర్మ (7), విలియమ్సన్ (4), రాహుల్ త్రిపాఠి (22) నిరాశపరిచారు. మార్క్‌రమ్ (25 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), పూరన్ కాసేపు భారీ సిక్సర్లతో అలరించా రు. అయితే ఢిల్లీ బౌలర్లు ఖలీల్, శార్దుల్ ఎక్కడికక్కడ కళ్లెం వేశారు. పూరన్ 29 బంతుల్లోనే (1 ఫోర్, 5 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీ సాధించగా... 18వ ఓవర్లో అతను కూడా ఔటవడంతో అక్కడే హైదరాబాద్ గెలుపుదారి మూసుకుపోయింది.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మన్‌దీప్ సింగ్ (సి) పూరన్ (బి) భువనేశ్వర్ 0; వార్నర్ (నాటౌట్) 92; మార్‡్ష (సి అండ్ బి) అబాట్ 10; పంత్ (బి) గోపాల్ 26; పావెల్ (నాటౌట్) 67; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 207.
వికెట్ల పతనం: 1–0, 2–37, 3–85.
బౌలింగ్: భువనేశ్వర్ 4–1–25–1, అబాట్ 4–0–47–1, ఉమ్రాన్ మాలిక్ 4–0–52–0, కార్తీక్ త్యాగి 4–0–37–0, శ్రేయస్ గోపాల్ 3–0–34–1, మార్క్‌రమ్ 1–0–11–0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) కుల్దీప్ (బి) ఖలీల్ 7; విలియమ్సన్ (సి) పంత్ (బి) నోర్జే 4; త్రిపాఠి (సి) శార్దుల్ (బి) మార్‡్ష 22; మార్క్‌రమ్ (సి) కుల్దీప్ (బి) ఖలీల్ 42; పూరన్ (సి) పావెల్ (బి) శార్దుల్ 62; శశాంక్ (సి) నోర్జే (బి) శార్దుల్ 10; అబాట్ (సి) రిపాల్ (బి) ఖలీల్ 7; గోపాల్ (నాటౌట్) 9; త్యాగి (బి) కుల్దీప్ 7; భువనేశ్వర్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 186.
వికెట్ల పతనం: 1–8, 2–24, 3–37, 4–97, 5–134, 6–153, 7–165, 8–181.
బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–44–2, ఖలీల్ అహ్మద్ 4–0–30–3, నోర్జే 4–0–35–1, మార్‡్ష 4–0–36–1, కుల్దీప్ యాదవ్ 4–0–40–1.
Comments
Please login to add a commentAdd a comment