మార్చి 28, 2022... ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ మొదటి మ్యాచ్... షమీ వేసిన తొలి బంతికే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అవుట్! అలా అద్భుతంగా మొదలైన ప్రయాణం రెండు నెలల తర్వాత చాంపియన్‌గా నిలిచే వరకు సాగింది. కొత్త జట్టుగా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గుజరాత్ అన్ని రంగాల్లో విశేషంగా రాణించి టైటిల్‌ను చేజిక్కించుకుంది. గ్రూప్ టాపర్‌గా నిలవడమే కాకుండా రెండు నాకౌట్ మ్యాచ్‌లలోనూ తమ బలాన్ని ప్రదర్శించింది.
ఫలితంగా 15 ఏళ్ల లీగ్ చరిత్రలో మరో కొత్త జట్టు ఖాతాలో ట్రోఫీ చేరింది. గత ఫైనల్ మ్యాచ్‌లకు భిన్నంగా పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ చేతులెత్తేసింది. పేలవ బ్యాటింగ్‌తో తక్కువ స్కోరుకే పరిమితమైన జట్టు కనీసం పోరాడేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఛేదనలో ఎలాంటి తడబాటు లేకుండా దూసుకుపోయిన గుజరాత్ సొంతగడ్డ అహ్మదాబాద్‌లో చిరస్మరణీయ విజయాన్ని లిఖించింది.
అహ్మదాబాద్: 19వ ఓవర్ తొలి బంతి... మెక్‌కాయ్ బౌలింగ్‌లో బంతిని డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా శుబ్‌మన్ గిల్ సిక్సర్ బాదాడు...అంతే! ప్రపంచంలోని అతి పెద్ద క్రికెట్ మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌కు హాజరైన 1,04,859 మందితో మైదానమంతా హోరెత్తగా, గుజరాత్ ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు. ఆదివారం జరిగిన ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్–2022 విజేతగా నిలిచింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (3/17) మూడు ప్రధాన వికెట్లతో ప్రత్యర్థి వెన్నువిరిచాడు. అనంతరం గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (43 బంతుల్లో 45 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
సమష్టి వైఫల్యం...
ఫైనల్‌కు ముందు 824 పరుగులు... అద్భుత ప్రదర్శనతో బట్లర్ ఒంటిచేత్తో రాజస్తాన్‌ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. తుది పోరులో కూడా అతను చెలరేగితేనే గెలిచే అవకాశాలు ఉండగా... బట్లర్‌ను కట్టడి చేయడంలో టైటాన్స్ సఫలమైంది. గత మ్యాచ్ వరకు 45 సిక్సర్లు కొట్టిన అతను ఈ మ్యాచ్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోగా, దాదాపు చివరి వరకు అతని స్ట్రయిక్‌రేట్ వంద పరుగులు దాటలేదు. గుజరాత్ పదునైన బౌలింగ్ ముందు ఇతర బ్యాటర్లు కూడా విఫలం కావడంతో రాజస్తాన్ ఇన్నింగ్స్ పేలవంగా ముగిసింది.
యశస్వి జైస్వాల్ (16 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు), దేవ్‌దత్ పడిక్కల్ (10 బంతుల్లో 2) ఖాతా తెరిచేందుకే చెరో ఎనిమిది బంతులు తీసుకోగా... మధ్యలో వరుసగా 28 బంతుల పాటు బౌండరీ రాలేదంటే పరిస్థితి అర్థమవుతుంది. కెప్టెన్ సంజు సామ్సన్ (11 బంతుల్లో 14; 2 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడటంలో విఫలమయ్యాడు. టీమ్‌లో ఉన్న మరో హిట్టర్ హెట్‌మైర్ (12 బంతుల్లో 11; 2 ఫోర్లు) కూడా ప్రభావం చూపలేకపోవడంతో రాయల్స్ చేసేందుకు ఏమీ లేకపోయింది. 13వ ఓవర్ తొలి బంతికి బట్లర్ అవుట్ కావడంతో రాజస్తాన్ భారీ స్కోరు ఆశలు ముగిసిపోయాయి.
ఆడుతూ పాడుతూ...
ఛేదనలో గుజరాత్‌కు ఎలాంటి సమస్యా రాలేదు. వృద్ధిమాన్ సాహా (7 బంతుల్లో 5; 1 ఫోర్), మాథ్యూ వేడ్ (10 బంతుల్లో 8; 1 సిక్స్) విఫలమైనా... గిల్, హార్దిక్ భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. రాజస్తాన్ బౌలర్లు వీరిద్దరిని ఇబ్బంది పెట్టలేకపోయారు. ప్రశాంతంగా ఆడిన గిల్, హార్దిక్ మూడో వికెట్‌కు 53 బంతుల్లో 63 పరుగులు జోడించారు. హార్దిక్‌ను చహల్ అవుట్ చేసినా... లక్ష్యం మరీ చిన్నది కావడంతో గుజరాత్ సునాయాసంగా గెలుపువైపు దూసుకుపోయింది. శుబ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్ నాలుగో వికెట్‌కు 29 బంతుల్లో 47 పరుగులు జోడించి విజయాన్ని అందించారు.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) సాయికిషోర్ (బి) యశ్ 22; బట్లర్ (సి) సాహా (బి) హార్దిక్ 39; సామ్సన్ (సి) సాయికిషోర్ (బి) హార్దిక్ 14; పడిక్కల్ (సి) షమీ (బి) రషీద్ 2; హెట్‌మైర్ (సి అండ్ బి) హార్దిక్ 11; అశ్విన్ (సి) మిల్లర్ (బి) సాయికిషోర్ 6; పరాగ్ (బి) షమీ 15; బౌల్ట్ (సి) తెవాటియా (బి) సాయికిషోర్ 11; మెక్‌కాయ్ (రనౌట్) 8; ప్రసిధ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 130.
వికెట్ల పతనం: 1–31, 2–60, 3–79, 4–79, 5–94, 6–98, 7–112, 8–130, 9–130.
బౌలింగ్: షమీ 4–0–33–1, యశ్ దయాళ్ 3–0–18–1, ఫెర్గూసన్ 3–0–22–0, రషీద్ ఖాన్ 4–0–18–1, హార్దిక్ పాండ్యా 4–0–17–3, సాయికిషోర్ 2–0–20–2.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (బి) ప్రసిధ్ 5; గిల్ (నాటౌట్) 45; వేడ్ (సి) పరాగ్ (బి) బౌల్ట్ 8; హార్దిక్ (సి) యశస్వి (బి) చహల్ 34; మిల్లర్ (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 133.
వికెట్ల పతనం: 1–9, 2–23, 3–86,
బౌలింగ్: బౌల్ట్ 4–1–14–1, ప్రసిధ్ కృష్ణ 4–0–40–1, చహల్ 4–0–20–1, మెక్‌కాయ్ 3.1–0–26–0, అశ్విన్ 3–0–32–0.
.@gujarat_titans - The #TATAIPL 2022 Champions! 👏 👏 🏆 👍
— IndianPremierLeague (@IPL) May 29, 2022
The @hardikpandya7-led unit, in their maiden IPL season, clinch the title on their home ground - the Narendra Modi Stadium, Ahmedabad. 🙌🙌 @GCAMotera
A round of applause for the spirited @rajasthanroyals! 👏 👏 #GTvRR pic.twitter.com/LfIpmP4m2f
Comments
Please login to add a commentAdd a comment