IPL 2022: These Players Who Can Replace Anrich Nortje of Delhi Capitals - Sakshi
Sakshi News home page

IPL 2022- Delhi Capitals: పాపం.. రూ. 6.5 కోట్లు.. అన్రిచ్‌ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే!

Published Thu, Mar 10 2022 12:58 PM | Last Updated on Fri, Mar 11 2022 11:58 AM

IPL 2022: Players Who Can Replace Anrich Nortje Of Delhi Capitals - Sakshi

అన్రిచ్‌ నోర్జే(PC: IPL)

ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ బౌలర్‌, దక్షిణాఫ్రికా పేసర్‌ అన్రిచ్‌ నోర్జే ఐపీఎల్‌-2022 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. గతేడాది ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన అతడు ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది. దీంతో రూ. 6.5 కోట్లు వెచ్చించి అతడిని రిటైన్‌ చేసుకున్న ఢిల్లీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇక గత సీజన్‌లో 8 ఇన్నింగ్స్‌ ఆడి 12 వికెట్లు పడగొట్టిన ఈ స్టార్‌ బౌలర్‌ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు ఎవరన్న అంశంపై ఓ లుక్కేద్దాం!

1. లాహిరు కుమార
శ్రీలంక పేసర్‌ లాహిర్‌ కుమార 50 లక్షల కనీస ధరతో ఐపీఎల్‌-2022 మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ ఫ్రాంఛైజీలు అతడి పట్ల ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక తరఫున 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన కుమార.. 23 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల టీమిండియాతో భారత్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా 1, 2, 2 వికెట్లు తీసిన ఈ రైట్‌ ఆర్మ్‌ పేసర్‌తో ఢిల్లీ నోర్జే స్థానాన్ని భర్తీ చేయవచ్చు.

2. ధవళ్‌ కులకర్ణి
టీమిండియా పేసర్‌ ధవళ్‌ కులకర్ణికి ఐపీఎల్‌లో మంచి అనుభవం ఉంది. 2012 నుంచి ఈ మెగా టోర్నీలో భాగమైన అతడు ఇప్పటి వరకు మొత్తంగా 92 మ్యాచ్‌లు ఆడి 86 వికెట్లు పడగొట్టాడు. సగటు 28.76. ధవళ్‌ను కూడా నోర్జేని రీప్లేస్‌ చేయగల ఆటగాళ్లలో ఒకడిగా భావించవచ్చు.

3. ఇషాంత్‌ శర్మ
గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న టీమిండియా బౌలర్‌ ఇషాంత్‌ శర్మ కూడా ఈసారి మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లలో ఒకడు. గత సీజన్‌లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన ఇషాంత్‌కు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం కలిసి వచ్చే అంశం.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 93 మ్యాచ్‌లు ఆడిన అతడు 73 వికెట్లు పడగొట్టాడు. వేలంలో కనీస ధర 1.5 కోట్లుగా నమోదు చేసుకున్న ఈ అనువభజ్ఞుడైన పేసర్‌ను జట్టులోకి తీసుకుంటే ఢిల్లీకి ఉపయుక్తంగా ఉంటుందనేది విశ్లేషకుల భావన.

4. కేన్‌ రిచర్డ్‌సన్‌
ఆస్ట్రేలియా పేసర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌కు నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 30 టీ20 మ్యాచ్‌లు ఆడిన రిచర్డ్‌సన్‌ 37 వికెట్లు పడగొట్టాడు.

ఇక క్యాష్‌రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ విషయానికొస్తే... ఇప్పటి వరకు ఆడిన 15 మ్యాచ్‌లలో 19 వికెట్లు తీశాడు. కనీస ధర 1.5 కోట్లుగా నమోదు చేసుకున్న రిచర్డ్‌సన్‌ను ఈసారి వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. 

5. ఆండ్రూ టై
ఆస్ట్రేలియా పేసర్‌ ఆండ్రూ టై ఐపీఎల్‌ మెగా వేలం-2022లో కోటి రూపాయల కనీస ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ అతడి పట్ల ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌లు ఆడి 40 వికెట్లు పడగొట్టిన ఈ పేసర్‌.. ఢిల్లీ జట్టులో నోర్జే స్థానాన్ని భర్తీ చేయగలడు.

చదవండి: IPL 2022- CSK: సీఎస్‌కే అభిమానులకు గుడ్‌న్యూస్‌.. అతడు వచ్చేస్తున్నాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement