IPL 2022: రాయల్స్‌కు ‘జై’ | IPL 2022: Rajasthan Royals beat Punjab Kings by 6 wickets | Sakshi
Sakshi News home page

IPL 2022: రాయల్స్‌కు ‘జై’

Published Sun, May 8 2022 5:45 AM | Last Updated on Sun, May 8 2022 5:46 AM

IPL 2022: Rajasthan Royals beat Punjab Kings by 6 wickets - Sakshi

ముంబై: సీజన్‌ ఆరంభానికి ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు యశస్వి జైస్వాల్‌ను రూ. 4 కోట్లకు రిటెయిన్‌ చేసుకుంది. ఆడిన 3 మ్యాచ్‌లలో వరుసగా 20, 1, 4 పరుగులే చేయడంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించింది. ఇప్పుడు నెల రోజుల తర్వాత అతనికి మళ్లీ బరిలోకి దిగే అవకాశం రాగా, యశస్వి దానిని సమర్థంగా వాడుకొని జట్టును గెలిపించాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యశస్వి జైస్వాల్‌ (41 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీకి తోడు బౌలింగ్‌ లో చహల్‌ (3/28) రాణించడంతో రాజస్తాన్‌ రాయల్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది.

శనివారం జరిగిన పోరులో రాజస్తాన్‌ 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై నెగ్గింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (40 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్‌), జితేశ్‌ శర్మ (18 బంతుల్లో 38 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నారు. అనంతరం రాజస్తాన్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు సాధించింది. హెట్‌మైర్‌ (16 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పడిక్కల్‌ (32 బంతుల్లో 31; 3 ఫోర్లు), బట్లర్‌ (16 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.  

రాణించిన జితేశ్‌...
బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లతో శుభారంభం చేసిన బెయిర్‌స్టో... అతని మరో ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్‌ బాదాడు. బట్లర్‌ ఒంటిచేత్తో చక్కటి క్యాచ్‌ పట్టడంతో శిఖర్‌ ధావన్‌ (12) నిష్క్రమించాడు. క్రీజ్‌లో ఉన్నంతసేపు రాజపక్స (18 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, బెయిర్‌స్టో తన ధాటిని కొనసాగిస్తూ 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తర్వాతి మూడు వికెట్లు పడగొట్టి చహల్‌... పంజాబ్‌ను దెబ్బ తీశాడు.

చహల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రాజపక్స క్లీన్‌బౌల్డ్‌ కాగా, అతని తర్వాతి ఓవర్లో మయాంక్‌ అగర్వాల్‌ (15), బెయిర్‌స్టో వెనుదిరిగారు. ఈ దశలో జితేశ్, లివింగ్‌స్టోన్‌ (14 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) భాగస్వామ్యం పంజాబ్‌కు మెరుగైన స్కోరు అందించింది. వీరిద్దరు కలిసి 26 బంతుల్లో 50 పరుగులు జత చేశారు. ప్రసిధ్‌ ఓవర్లో 6, 4 కొట్టిన అనంతరం లివింగ్‌స్టోన్‌ అదే ఓవర్లో బౌల్ట్‌ కాగా, కుల్దీప్‌ సేన్‌ వేసిన చివరి ఓవర్లో జితేశ్‌ ఒక సిక్స్, 2 ఫోర్లు కొట్టడంతో మొత్తం 16 పరుగులు వచ్చాయి.  

హెట్‌మైర్‌ మెరుపులు...
తొలి ఓవర్లలో 2 ఫోర్లు, సిక్స్‌తో దూకుడు ప్రదర్శించిన యశస్వి ఇన్నింగ్స్‌ మొత్తం అదే జోరును ప్రదర్శించాడు. మరోవైపు రబడ వేసిన నాలుగో ఓవర్లో బట్లర్‌ ఆట హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో వరుసగా 6, 4, 4, 2, 4 బాది 20 పరుగులు రాబట్టిన అతను చివరి బంతికి వెనుదిరిగాడు. సామ్సన్‌ (12 బంతుల్లో 23; 4 ఫోర్లు) కూడా వేగంగా ఆడగా 33 బంతుల్లో యశస్వి అర్ధసెంచరీ పూర్తయింది. అయితే కీలక సమయంలో యశస్వి అవుట్‌ కాగా, పడిక్కల్‌ నెమ్మదిగా ఆడటంతో రాయల్స్‌పై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి స్థితిలో హెట్‌మైర్‌ జట్టు గెలుపును సునాయాసం చేశాడు. 34 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన అతను చకచకా పరుగులు సాధించి మరో 2 బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి చేశాడు.

స్కోరు వివరాలు
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) చహల్‌ 56; శిఖర్‌ ధావన్‌ (సి) బట్లర్‌ (బి) అశ్విన్‌ 12; రాజపక్స (బి) చహల్‌ 27; మయాంక్‌ (సి) బట్లర్‌ (బి) చహల్‌ 15; జితేశ్‌ (నాటౌట్‌) 38; లివింగ్‌స్టోన్‌ (బి) ప్రసిధ్‌ 22; రిషి ధావన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 189.
వికెట్ల పతనం: 1–47, 2–89, 3–118, 4–119, 5–169.
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–1–36–0, ప్రసిధ్‌ 4–0–48–1, కుల్దీప్‌ సేన్‌ 4–0–42–0, అశ్విన్‌ 4–0–32–1, చహల్‌ 4–0–28–3.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) లివింగ్‌స్టోన్‌ (బి) అర్‌‡్షదీప్‌ 68; బట్లర్‌ (సి) రాజపక్స (బి) రబడ 30; సామ్సన్‌ (సి) శిఖర్‌ ధావన్‌ (బి) రిషి ధావన్‌ 23; పడిక్కల్‌ (సి) మయాంక్‌ (బి) అర్‌‡్షదీప్‌ 31; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 31 పరాగ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 190.
వికెట్ల పతనం: 1–46, 2–85, 3–141, 4–182.
బౌలింగ్‌: సందీప్‌ 4–0–41–0, రబడ 4–0–50–1, అర్‌‡్షదీప్‌ 4–0–29–2, రిషి ధావన్‌ 3–0–25–1, రాహుల్‌ చహర్‌ 3.4–0–39–0, లివింగ్‌స్టోన్‌ 1–0–6–0.

ఐపీఎల్‌లో నేడు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ X బెంగళూరు
వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి
ఢిల్లీ క్యాపిటల్స్‌ X చెన్నై సూపర్‌ కింగ్స్‌
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement