IPL 2022 Retention: List Of 11 Players Released By All 8 Franchises - Sakshi
Sakshi News home page

IPL 2022 Retention: వీళ్లను వదిలేశారు.. ఈ 11 మంది ఒకే జట్టులో ఉన్నారంటే రికార్డులు బద్దలే!

Published Thu, Dec 2 2021 3:28 PM | Last Updated on Thu, Dec 2 2021 4:41 PM

IPL 2022 Retention: Best XI Of Released Players Check Here - Sakshi

IPL 2022 Retention: Best XI Of Released Players Check Here: ఐపీఎల్‌-2022 మెగా వేలానికి ముందు తాము కొనసాగించాలనుకుంటున్న ఆటగాళ్ల జాబితాను 8 ఫ్రాంఛైజీలు ఇప్పటికే ప్రకటించాయి. గరిష్టంగా నలుగురిని అట్టిపెట్టుకునే అవకాశం ఉండటంతో తమకు అత్యంత ముఖ్యమైన క్రికెటర్ల వైపే మొగ్గుచూపిన యజమాన్యాలు.. కారణాలేవైనా సరే కొంతమంది దిగ్గజ ఆటగాళ్లను మాత్రం వదిలేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఫ్రాంఛైజీలు రిలీజ్‌ చేసిన బెస్ట్‌ ఎలెవన్‌పై ఓ లుక్కేద్దామా!

1.కేఎల్‌ రాహుల్‌(పంజాబ్‌ కింగ్స్‌)
టీమిండియా టీ20 ఫార్మాట్‌ వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ పంజాబ్‌ కింగ్స్‌ సారథిగా వ్యవహరించాడు. గత సీజన్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్న ఈ కర్టాటక ఆటగాడు... ఐపీఎల్‌-2021 సీజన్‌లో బ్యాటర్‌గా అత్యుత్తమంగా రాణించాడు. 626 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అయితే, వచ్చే సీజన్‌లో లక్నో ఫ్రాంఛైజీ రాకతో ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించేందుకు రాహుల్‌ ఒప్పందం చేసుకున్నాడని అందుకే తనను రిటైన్‌ చేయవద్దని పంజాబ్‌ను కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతో తేలాలంటే కొన్ని రోజులు వేచిచూడక తప్పదు.

2.డేవిడ్‌ వార్నర్‌(సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తొలి టైటిల్‌ అందించిన ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్‌-2021 సీజన్‌లో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించిన యాజమాన్యం.. యూఏఈ వేదికగా సాగిన రెండో అంచెలో తుది జట్టులో కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో అతడిని రిలీజ్‌ చేసింది. ఇక టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో సత్తా చాటి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచిన వార్నర్‌ కోసం మెగా వేలంలో భారీ డిమాండ్‌ ఉండటం సహజం.

3. శుభ్‌మన్‌ గిల్‌(కోల్‌కతా నైట్‌రైడర్స్‌)
టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ను అనూహ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వదిలేసుకుంది. మరో ఓపెనర్‌, ఈ సీజన్‌లో రాణించిన వెంకటేశ్‌ అయ్యర్‌ వైపే మొగ్గు చూపింది. అతడి కోసం ఏకంగా 8 కోట్లు వెచ్చించింది. ఈ క్రమంలో గిల్‌ వేలంలోకి వస్తే అతడిని కొనుగోలు చేయాలంటూ కేకేఆర్‌ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

4.శ్రేయస్‌ అయ్యర్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌)
గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో రిషభ్‌ పంత్‌ ఢిల్లీ పగ్గాలు చేపట్టి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ క్రమంలో పంత్‌ను రిటైన్‌ చేసుకున్న ఢిల్లీ అయ్యర్‌ను రిలీజ్‌ చేసింది.

5. ఇషాన్‌ కిషన్‌(ముంబై ఇండియన్స్‌)
యువ సంచలనం ఇషాన్‌ కిషన్‌ను ముంబై ఇండియన్స్‌ వదిలేసుకోవడం క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది. ముంబైకి భవిష్యత్‌ కెప్టెన్‌ అంటూ అభిమానులు సంబరపడుతున్న వేళ ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను కొనసాగించకపోవడంతో షాక్‌ తగిలింది. ఇషాన్‌కు కూడా వేలంలో మంచి డిమాండ్‌ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

6. హార్దిక్‌ పాండ్యా (ముంబై ఇండియన్స్‌)
ఐపీఎల్‌-2021లో విఫలమైన హార్దిక్‌ పాండ్యాను ముంబై ఇండియన్స్‌ రిలీజ్‌ చేసింది. ఆది నుంచి ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన హార్దిక్‌ను ఫిట్‌నెస్‌ కష్టాలు వెంటాడుతున్న వేళ అతడిని రిటైన్‌ చేసుకోకపోవడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కాగా 28 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 85 ఐపీఎల్‌ మ్యాచ్‌లలో 1476 పరుగులు చేశాడు. 60 ఇన్నింగ్స్‌లో 42 వికెట్లు పడగొట్టాడు.

7.రషీద్‌ ఖాన్‌(సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)
స్టార్‌ ప్లేయర్‌ రషీద్‌ ఖాన్‌ను వదిలేసుకున్నందుకు ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంఛైజీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రిటెన్షన్‌లో భాగంగా తననే మొదటి పిక్‌గా ఎంచుకోవాలంటూ రషీద్‌ పట్టుబట్టిన క్రమంలో తలెత్తిన విభేదాల కారణంగానే అతడిని రిలీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. కారణమేదైనా రషీద్‌ జట్టును వీడటం నిజంగా పెద్ద దెబ్బే.

8. జోఫ్రా ఆర్చర్‌(రాజస్తాన్‌ రాయల్స్‌)
ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ జోఫ్రా ఆర్చర్‌ను రాజస్తాన్‌ రాయల్స్‌ వదిలేసింది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడమే గాక అవసరమైన సమయంలో హిట్టింగ్‌ ఆడతాడు. ఇలాంటి ప్లేయర్‌ కోసం వేలంలో జట్లు పోటీ పడటం సహజం.

9. కగిసో రబడ
ప్రస్తుత క్రికెట్‌ ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ పేసర్లలో కగిసో రబడ కూడా ఒకడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక ప్లేయర్‌ అయిన ఇతడిని ఫ్రాంఛైజీ వదిలేయడం గమనార్హం. వరల్డ్‌క్లాస్‌ సీమర్ల కోసం వెదుకుతున్న ఫ్రాంఛైజీలకు మెగా వేలంలో అతడొక మంచి ఆప్షన్‌ అనడంలో సందేహం లేదు.

10.దీపక్‌ చహర్‌
చెన్నై నాలుగోసారి చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు టీమిండియా ప్లేయర్‌ దీపక్‌ చహర్‌. కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని నమ్మకాన్ని గెలుచుకున్న దీపక్‌ను చెన్నై రిలీజ్‌ చేయడం నిజంగా ఆశ్చర్యకరమే. అయితే, రవీంద్ర జడేజాతో పాటు ధోని, ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను రిటైన్‌ చేసుకునే క్రమంలో అతడిని వదిలేసింది.

11.యజువేంద్ర చహల్‌(ఆర్సీబీ)
టీమిండియా బౌలర్‌ యజువేంద్ర చహల్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు వదిలేసింది. నలుగురిని రిటైన్‌ చేసుకునే అవకాశం ఉన్నా అతడిని రిలీజ్‌ చేయడం గమనార్హం.

అన్నట్లు ఈ 11 మంది ఒకే జట్టులో ఉంటే ఎలా ఉంటుందంటారు? ఐడియా బాగున్నా డిమాండ్‌కు తగ్గట్లు వీళ్లందరికీ భారీ ధర చెల్లించాలంటే ఫ్రాంఛైజీల పర్సులో ఉన్న మొత్తం సరిపోదేమో!

చదవండి: IPL 2022 Retention- Auction: కోట్ల ఖర్చు.. మెగా వేలం.. ఆ ఫ్రాంఛైజీ పర్సులో 72 కోట్లు.. మరి మిగిలిన జట్ల వద్ద ఎంతంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement