IPL 2022: Sam Curran Says Frustrating Watching From Home - Sakshi
Sakshi News home page

IPL 2022: ప్చ్‌.. వేలంలో పాల్గొనలేకపోయా.. మ్యాచ్‌లు చూస్తుంటే చిరాగ్గా ఉంది! నాకు ఛాన్స్‌ వస్తే..

Published Thu, Mar 31 2022 12:58 PM | Last Updated on Thu, Mar 31 2022 2:30 PM

IPL 2022: Sam Curran Says Frustrating Watching From Home - Sakshi

సురేశ్‌ రైనాతో సామ్‌ కరన్‌(ఫైల్‌ ఫొటో- కర్టెసీ: IPL/ BCCI)

IPL 2022: వెన్ను నొప్పి కారణంగా ఐపీఎల్‌-2021 సీజన్‌ మధ్యలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌. గత సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సామ్‌.. అక్టోబరులో జరిగిన రెండో అంచె సందర్భంగా గాయపడ్డాడు. ఆ తర్వాత నొప్పి తీవ్రతరం కావడంతో ఐసీసీ మెగా ఈవెంట్‌ టీ20 ప్రపంచకప్‌-2021తో పాటు ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ 2021-22కు కూడా దూరమయ్యాడు. 

అయితే, గాయం నుంచి కాస్త ఉపశమనం కలగడంతో ఐపీఎల్‌ మెగా వేలం-2022లో తన పేరును నమోదు చేసుకోవాలనుకున్నాడు సామ్‌ కరన్‌. కానీ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు వైద్య సిబ్బంది మాత్రం మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని, ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు సామ్‌ కరన్‌ దూరమయ్యాడు. 

ఈ నేపథ్యంలో తాజాగా ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ ఇన్ఫోతో మాట్లాడిన సామ్‌ కరన్‌ ఐపీఎల్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘అక్కడికి(భారత్‌) వెళ్లలేకపోయిన కారణంగా నిరాశకు లోనయ్యాను. ఇంట్లో కూర్చుని మ్యాచ్‌లు చూస్తుంటే విసుగు పుడుతోంది. వేలంలో పాల్గొనాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ... చివర్లో మనసు మార్చుకున్నా. నిజానికి అది చాలా మంచి నిర్ణయం’’అని పేర్కొన్నాడు.

అదే విధంగా.. ‘‘అవకాశం వస్తే తప్పక అక్కడికి తిరిగి వెళ్తాను. ఎందుకంటే ఐపీఎల్‌ లాంటి టోర్నీల్లో ఆడితే మన ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుంది. అక్కడే క్రికెట్‌నే శ్వాస, ధ్యాస. బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్లిన సమయంలో సూపర్‌స్టార్లతో కూర్చుని ఆట గురించే మాట్లాడతాం. అందుకే అక్కడికి వెళ్లడాన్ని ఇష్టపడతా’’ అని సామ్‌ కరన్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తున్నానని, త్వరలోనే మైదానంలో అడుగుపెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

చదవండి: IPL 2022- RCB: ఆర్సీబీకి గుడ్‌న్యూస్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ వచ్చేస్తున్నాడు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement