ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి(PC: IPL/BCCI)
IPL 2022- RCB Virat Kohli: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఐపీఎల్-2022లో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. కెప్టెన్సీ భారం మోయలేనంటూ గత సీజన్‌లో ఆర్సీబీకి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న కోహ్లి... ఈసారి బ్యాటర్‌గానూ ఆకట్టుకోలేకపోయాడు. ఆరంభంలో వన్‌డౌన్‌లో.. ఆ తర్వాత ఓపెనర్‌గా వచ్చినా ఆట తీరును మెరుగుపరచుకోలేకపోయాడు. ఇక ఫైనల్ చేరాలంటే రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన కీలక క్వాలిఫైయర్-2లోనూ మరోసారి నిరాశ పరిచాడు కోహ్లి.
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఓపెనింగ్ వచ్చిన అతడు.. మొదటి ఓవర్ ఆఖరి బంతికి సిక్స్‌తో అలరించాడు. దీంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోయారు. ఈ మ్యాచ్‌లో మొదటి సిక్సర్ అంటూ సంబరాలు చేసుకున్నారు. కానీ తర్వాతి నాలుగు బంతులకే వారి ఆనందం ఆవిరైంది. ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి పెవిలియన్ చేరాడు.
ఇక ఈ సీజన్‌లో కోహ్లి మొత్తంగా 16 ఇన్నింగ్స్‌లో సాధించిన పరుగులు 341. అత్యధిక స్కోరు 73. రెండు అర్ధ శతకాలు. ఇప్పటి వరకు పరుగుల వీరుల జాబితాలో 22వ స్థానం. ఐపీఎల్‌లో ఘనమైన రికార్డులు కలిగి ఉన్న కోహ్లి ఇలా వైఫల్యం చెందడాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆట తీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి తన కెరీర్ మొత్తంలో కంటే ఈ ఐపీఎల్ సీజన్‌లో బహుశా ఎక్కువ తప్పులు చేసి ఉంటాడని పేర్కొన్నాడు. ఈ మేరకు క్రిక్‌బజ్ మిడ్ ఇన్నింగ్స్ షోలో వీరూ భాయ్ మాట్లాడుతూ.. ‘‘ఫామ్‌లో లేనప్పుడు.. ప్రతి బంతిని ఆచితూచి ఆడుతూ విశ్వాసం ప్రోది చేసుకోవాలి. కుదురుకున్నాక నీదైన శైలిలో దూసుకుపోవాలి.
మొదటి ఓవర్‌లో కాస్త ఆచితూచి ఆడాడు. కానీ ఆ తర్వాత అలా జరుగలేదు. కొన్నిసార్లు అదృష్టవశాత్తూ మన బ్యాట్ అంచుక బంతి తాకినా బతికిపోతాం. కానీ ఇక్కడ అలా జరుగలేదు. అసలు మనకు తెలిసిన కోహ్లి ఇతడు కానే కాదు. ఈ విరాట్ కోహ్లి మరెవరో! ఈ సీజన్‌లో చేసినన్ని పొరపాట్లు అతడు.. బహుశా తన కెరీర్‌లో ఇప్పటి వరకు చేసి ఉండడు. ఈ ఎడిషన్‌లో ఒక బ్యాటర్ ఎన్ని విధాలుగా అవుట్ అవ్వగలడో అన్ని విధాలుగానూ అవుటయ్యాడు.
కీలక మ్యాచ్‌లో ఇలాంటి ఆట తీరుతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాడు’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొన్న కోహ్లి ఒక సిక్సర్ సాయంతో 7 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఆర్సీబీలో డుప్లెసిస్(25), రజత్ పాటిదార్(58), మాక్స్‌వెల్(24) మినహా ఎవరూ పెద్దగా స్కోరు చేయలేదు.దీంతో 157 పరుగులకే పరిమితమైన ఆర్సీబీ.. రాజస్తాన్ రాయల్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడింది. సంజూ శాంసన్ సేన సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తుది పోరుకు అర్హత సాధించింది.
చదవండి 👇
Jos Buttler: వారెవ్వా.. బట్లర్ విధ్వంసకర ఆట తీరు.. అరుదైన రికార్డు సొంతం!
IPL 2022: 'ఆర్‌సీబీ కప్ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు'
WHAT. A. WIN for @rajasthanroyals! 👏 👏
— IndianPremierLeague (@IPL) May 27, 2022
Clinical performance by @IamSanjuSamson & Co. as they beat #RCB by 7⃣ wickets & march into the #TATAIPL 2022 Final. 👍 👍 #RRvRCB
Scorecard ▶️ https://t.co/orwLrIaXo3 pic.twitter.com/Sca47pbmPX
Comments
Please login to add a commentAdd a comment