IPL 2023, SRH Vs KKR Highlights: Kolkata Knight Riders Beat Sunrisers Hyderabad By 5 Runs - Sakshi
Sakshi News home page

IPL 2023: కోల్‌కతా ప్రతీకారం

Published Fri, May 5 2023 4:45 AM | Last Updated on Fri, May 5 2023 8:49 AM

IPL 2023: Kolkata Knight Riders defeat Sunrisers Hyderabad by 5 runs - Sakshi

సన్‌రైజర్స్‌ విజయానికి ఒకదశలో 30 బంతుల్లో 38 పరుగులే కావాలి... చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. కెప్టెన్‌ మార్క్‌రమ్‌ కూడా అప్పుడే జోరు పెంచాడు... సొంత గడ్డపై గెలుపు ఖాయమనిపించింది. కానీ అంతా తలకిందులైంది. ఓటమి దిశగా వెళుతున్న కోల్‌కతా ఒక్కసారిగా పుంజుకుంది. పదునైన బౌలింగ్‌తో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి చివరి వరకు ఆటను తీసుకొచ్చింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వరుణ్‌ చక్రవర్తి వేసిన ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా 3 పరుగులే వచ్చాయి. దాంతో నైట్‌రైడర్స్‌ ఊపిరి పీల్చుకోగా, రైజర్స్‌ నిరాశలో మునిగింది.   

సాక్షి, హైదరాబాద్‌: ఈడెన్‌ గార్డెన్స్‌లో ఎదురైన పరాజయానికి ఉప్పల్‌ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ప్రతీకారం తీర్చుకుంది. గురువారం జరిగిన ఈ ఐపీఎల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 5 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ (35 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ రాణా (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేయగలిగింది. మార్క్‌రమ్‌ (40 బంతుల్లో 41; 4 ఫోర్లు), క్లాసెన్‌ (20 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించినా ఫలితం దక్కలేదు.  

కీలక భాగస్వామ్యం...
ఒక్కరూ విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడకపోయినా... కీలక ఆటగాళ్లంతా తలా ఓ చేయి వేయడంతో కోల్‌కతా చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. మార్కో జాన్సెన్‌ తన తొలి ఓవర్లోనే గుర్బాజ్‌ (0), వెంకటేశ్‌ అయ్యర్‌ (7)లను అవుట్‌ చేసి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. జేసన్‌ రాయ్‌ (19 బంతుల్లో 20; 4 ఫోర్లు) కూడా ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 43 పరుగులకు చేరింది. ఈ దశలో కెప్టెన్‌ రాణా, రింకూ కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 40 బంతుల్లో 61 పరుగులు జోడించారు. కార్తీక్‌ త్యాగి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 6తో రాణా దూకుడు ప్రదర్శించాడు. అయితే మార్క్‌రమ్‌ అద్భుత క్యాచ్‌కు రాణా వెనుదిరగ్గా... ఆండ్రీ రసెల్‌ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఎక్కువసేపు నిలవలేదు. సన్‌రైజర్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇన్నింగ్స్‌ చివర్లో కూడా కేకేఆర్‌ ఆశించినన్ని పరుగులు చేయలేకపోయింది. ఆఖరి 5 ఓవర్లలో ఆ జట్టు 42 పరుగులే సాధించింది.  

క్లాసెన్‌ మెరిసినా...
ఛేదనలో రైజర్స్‌ కూడా తడబడింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (18), అభిషేక్‌ శర్మ (9)లతో పాటు తక్కువ వ్యవధిలో రాహుల్‌ త్రిపాఠి (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హ్యారీ బ్రూక్‌ (0) వికెట్లను జట్టు కోల్పోయింది. అయితే మార్క్‌రమ్, క్లాసెన్‌ భాగస్వామ్యం ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. చక్కటి షాట్లతో, సమన్వయంతో వీరిద్దరు  పరుగులు రాబట్టారు. తన తొలి ఫోర్‌ కొట్టేందుకు మార్క్‌రమ్‌ 23 బంతులు తీసుకున్నా... అనుకూల్‌ రాయ్‌ ఓవర్లో రెండు సిక్సర్లతో క్లాసెన్‌ దూకుడు ప్రదర్శించాడు. ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 70 పరుగులు జోడించిన అనంతరం క్లాసెన్‌ వెనుదిరిగాడు. అయితే మార్క్‌రమ్‌ క్రీజ్‌లో ఉన్నంత వరకు రైజర్స్‌ గెలుపుపై ధీమాగానే ఉంది. 20 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన స్థితిలో కెప్టెన్‌ వెనుదిరిగారు. తర్వాతి బ్యాటర్లు మిగిలిన పనిని పూర్తి చేయలేకపోయారు. సమద్‌ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు) కొంత పోరాడినా లాభం లేకపోయింది.  

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) మయాంక్‌ అగర్వాల్‌ (బి) కార్తీక్‌ త్యాగి 20; గుర్బాజ్‌ (సి) బ్రూక్‌ (బి) జాన్సెన్‌ 0; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) క్లాసెన్‌ (బి) జాన్సెన్‌ 7; నితీశ్‌ రాణా (సి అండ్‌ బి) మార్క్‌రమ్‌ 42; రింకూ సింగ్‌ (సి) సమద్‌ (బి) నటరాజన్‌ 46; రసెల్‌ (సి) నటరాజన్‌ (బి) మార్కండే 24; నరైన్‌ (సి) మయాంక్‌ అగర్వాల్‌ (బి) భువనేశ్వర్‌ 1; శార్దుల్‌ ఠాకూర్‌ (సి) సమద్‌ (బి) నటరాజన్‌ 8; అనుకూల్‌ రాయ్‌ (నాటౌట్‌) 13; హర్షిత్‌ (రనౌట్‌) 0; వైభవ్‌ అరోరా (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 171.
వికెట్ల పతనం: 1–8, 2–16, 3–35, 4–96, 5–127, 6–130, 7–151, 8–168, 9–168.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–33–1, జాన్సెన్‌ 3–0–24–2, కార్తీక్‌ త్యాగి 2–0–30–1, మార్క్‌రమ్‌ 3–0–24–1, నటరాజన్‌ 4–0–30–2, మార్కండే 4–0–29–1.  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి) రసెల్‌ (బి) శార్దుల్‌ ఠాకూర్‌ 9; మయాంక్‌ అగర్వాల్‌ (సి) గుర్బాజ్‌ (బి) హర్షిత్‌ 18; రాహుల్‌ త్రిపాఠి (సి) వైభవ్‌ అరోరా (బి) రసెల్‌ 20; మార్క్‌రమ్‌ (సి) రింకూ సింగ్‌ (బి) వైభవ్‌ అరోరా 41; హ్యారీ బ్రూక్‌ (ఎల్బీ) (బి) అనుకూల్‌ రాయ్‌ 0; క్లాసెన్‌ (సి) రసెల్‌ (బి) శార్దుల్‌ ఠాకూర్‌ 36; సమద్‌ (సి) అనుకూల్‌ రాయ్‌ (బి) వరుణ్‌ చక్రవర్తి 21; జాన్సెన్‌ (సి) గుర్బాజ్‌ (బి) వైభవ్‌ అరోరా 1; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 5; మార్కండే (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166.
వికెట్ల పతనం: 1–29, 2–37, 3–53, 4–54, 5–124, 6–145, 7–152, 8–165.
బౌలింగ్‌: హర్షిత్‌ 4–0–27–1, వైభవ్‌ 3–0–32–2, శార్దుల్‌ 3–0– 23–2, రసెల్‌ 1–0–15–1, అనుకూల్‌ రాయ్‌ 3–0–26–1, నరైన్‌ 2–0–16–0, వరుణ్‌ చక్రవర్తి 4–0–20–1.   

ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్‌ X గుజరాత్‌ (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement