IPL 2023 MI Vs PBKS: Punjab Kings Troll Rohit Sharma On Twitter For Duck Out, MI Gives Fitting Reply, Tweets Viral - Sakshi
Sakshi News home page

#Rohit Sharma: రోహిత్‌ను దారుణంగా ట్రోల్‌ చేసిన పంజాబ్‌! ఘాటు కౌంటర్‌ ఇచ్చిన ముంబై.. దిమ్మతిరిగేలా..

Published Thu, May 4 2023 8:58 AM | Last Updated on Thu, May 4 2023 9:55 AM

IPL 2023: PBKS Dig At Rohit Out On Duck MI Hit Back In Brutal Fashion Viral - Sakshi

రోహిత్‌ శర్మ- పంజాబ్‌ సారథి శిఖర్‌ ధావన్‌ (PC: IPL/BCCI)

తమ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను దారుణంగా ట్రోల్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌కు ముంబై ఇండియన్స్‌ అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది. ఐపీఎల్‌ కెప్టెన్‌గా రోహిత్‌ విజయాలను ప్రస్తావిస్తూ.. ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని పంజాబ్‌కు దిమ్మతిరిగేలా జవాబు ఇచ్చింది. ఐపీఎల్‌-2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌- ముంబై ఇండియన్స్‌ బుధవారం తలపడ్డాయి.

భారీ స్కోరు
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై సారథి రోహిత్‌ శర్మ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో సొంతమైదానంలో రెచ్చిపోయిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి ఆరంభంలోనే షాక్‌ తగిలింది. 

ఆదిలోనే షాక్‌.. వాళ్లు దంచికొట్టడంతో
ఓపెనర్‌ రోహిత్‌ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెర్‌ ఇషాన్‌ కిషన్‌ (41 బంతుల్లో 75 పరుగులు), నాలుగో స్థానంలో వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (31 బంతుల్లో 66 పరుగులు) చెలరేగడంతో ముంబై విజయం దిశగా పయనించింది.

ఆఖర్లో తిలక్‌ వర్మ 10 బంతుల్లో 26 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి సిక్సర్‌తో ముంబై గెలుపును ఖరారు చేశాడు. దీంతో 4 వికెట్లు కోల్పోయి 7 బంతులు ఉండగానే ముంబై.. పంజాబ్‌ విధించిన టార్గెట్‌ను ఛేదించింది.

రోహిత్‌ సున్నా.. అవునా! మరి మీరు?
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ డకౌట్‌ కావడంతో అతడి వైఫల్యాన్ని హేళన చేస్తూ పంజాబ్‌.. ‘‘R(0)’’ అంటూ రోహిత్‌ సున్నా అన్న అర్థంలో ట్వీట్‌ చేసి నవ్వుతున్న ఎమోజీని జత చేసింది. ఇందుకు ముంబై ఇండియన్స్‌ స్పందిస్తూ.. ‘‘రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ ట్రోఫీలు.. 6.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 0, పంజాబ్‌ కింగ్స్‌ 0’’ అంటూ ఘాటుగా బదులిచ్చింది.

కనీసం ఒక్కసారైనా
కాగా ఐపీఎల్‌ ఇప్పటి వరకు అత్యధిక సార్లు(5) తమ జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ కొనసాగుతున్నాడు. అదే విధంగా గతంలో టైటిల్‌ గెలిచిన దక్కన్‌ చార్జర్స్‌ జట్టులో సభ్యుడు. ఈ క్రమంలో ఆరుసార్లు టైటిల్‌ గెలిచిన ఆటగాడు.. అదే విధంగా పనిలో పనిగా ఐపీఎల్‌-2023లోనూ తమదే విజయం అన్న అర్థంలో ఆరు ట్రోఫీలంటూ ట్వీట్‌ చేసిన ముంబై.. జట్టుగా పంజాబ్‌ వైఫల్యాన్ని ఎత్తిచూపింది.

ఇక కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నుంచి పంజాబ్‌ కింగ్స్‌గా పేరు మార్చుకున్న ఆ జట్టు ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేక చతికిలపడింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో ఐదు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరోవైపు ముంబై.. తొమ్మిదింట ఐదు విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి:  ముంబై ఇండియన్స్‌కే సాధ్యం.. ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement