Rohit IPL 2023 These 2 Guys Going To Be Big Stars: Rohit Sharma Explosive Claim - Sakshi
Sakshi News home page

రానున్న రెండేళ్లలో ముంబై, టీమిండియా సూపర్‌ స్టార్లు ఈ ఇద్దరే: రోహిత్‌

Published Wed, May 24 2023 5:22 PM | Last Updated on Wed, May 24 2023 6:01 PM

IPL 2023 These 2 Guys Going To Be Big Stars: Rohit Sharma Explosive Claim - Sakshi

ముంబై ఇండియన్స్‌ జట్టు (పాత ఫొటో PC: IPL)

IPL 2023- Rohit Sharma: ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్‌కు పేరుంది. టీమిండియా స్టార్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో ఏకంగా ఐదుసార్లు టైటిల్‌ గెలిచి ఇంత వరకు మరే ఇతర జట్టుకు సాధ్యం కాని రీతిలో రికార్డు సృష్టించింది. ప్రస్తుతం టీమిండియా స్టార్లుగా కొనసాగుతున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ముంబైకి ఆడి లైమ్‌లైట్‌లోకి వచ్చినవాళ్లే!

తిరిగి పుంజుకుని టాప్‌-4లో
వీరిద్దరితో పాటు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లకు లైఫ్‌ ఇచ్చింది ముంబై ఫ్రాంఛైజీ. ఇక ఐపీఎల్‌-2023 ఆరంభంలో వరుస పరాజయాలు నమోదు చేసిన ముంబై తిరిగి పుంజుకుని ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. టాప్‌-4తో లీగ్‌ దశను ముగించిన రోహిత్‌ సేన బుధవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడనుంది.

బుమ్రా, హార్దిక్‌లా వాళ్లిద్దరు కూడా
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కి జియో సినిమా షోలో ముంబై సారథి రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. హార్దిక్‌, బుమ్రాలాగే రానున్న రెండేళ్లలో టీమిండియాకు ముంబై ఫ్రాంఛైజీ ఇద్దరు స్టార్లను అందించబోతోందని హిట్‌మ్యాన్‌ వ్యాఖ్యానించాడు. ‘‘బుమ్రా, హార్దిక్‌ విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగబోతోంది. 

తిలక్‌ వర్మ, నేహల్‌ వధేరా రానున్న రెండేళ్లలో సూపర్‌ స్టార్లు అవుతారు. అప్పుడు మా జట్టును అందరూ ఇది సూపర్‌స్టార్ల టీమ్‌ అంటారు. వాళ్లకు మేమిచ్చే శిక్షణ అలాంటిది. వీళ్లిద్దరు మా జట్టుకే కాదు.. టీమిండియాలోనూ ప్రధాన పోషించే స్థాయికి ఎదుగుతారు’’ అని ప్రశంసలు కురిపించాడు.

తెలుగు తేజం తిలక్‌ వర్మ
తెలుగు క్రికెటర్‌ తిలక్‌ వర్మను గతేడాది ముంబై కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌-2022లో 14 మ్యాచ్‌లు ఆడిన ఈ హైదారాబాదీ బ్యాటర్‌ 397 పరుగులు సాధించాడు. ముంబై తరఫున రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లలో 274 పరుగులు స్కోరు చేశాడు తిలక్‌ వర్మ. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

నేహల్‌ వధేరా ఈ ఏడాదే
ఇక నేహల్‌ వధేరా ఈ ఏడాదే ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. 8 ఇన్నింగ్స్‌ ఆడి 214 పరుగులు సాధించాడీ ఈ పంజాబ్‌ ఆటగాడు. కీలక సమయాల్లో రాణించి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నమ్మకాన్ని చూరగొన్నాడు. ఈ సీజన్‌లో నేహల్‌ అత్యధిక స్కోరు 64(ఇప్పటి వరకు).  ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నోను ఓడిస్తేనే ముంబై ఇండియన్స్‌ ప్రయాణం కొనసాగుతుంది. చెన్నై మ్యాచ్‌లో గెలిస్తే క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో పోటీ పడుతుందీ రోహిత్‌ సేన.

చదవండి: లక్నోతో కీలక పోరు.. ముంబై జట్టులోకి యువ స్పిన్నర్‌! విధ్వంసకర ఓపెనర్‌ కూడా
ఛీ.. అపార్థం చేసుకున్నావు! ధోనిని అవమానించావు.. నీకేం తక్కువ చేశాం?
Virat Kohli: మీకు ఇంగ్లిష్‌ అర్థం కాకపోతే.. వెళ్లి!.. దాదా ట్వీట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement