
Photo: IPL Twitter
రెండు నెలలుగా అభిమానులను అలరించిన ఐపీఎల్ 16వ సీజన్ ఈ వారంతో ముగియనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, లక్నోసూపర్‌జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం(మే 23న) క్వాలిఫయర్-1లో సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ అమితుమీ తేల్చుకోనున్నాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెడితే.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. ఇక ఎలిమినేటర్ పోరులో లక్నో, ముంబై తలపడనున్నాయి.
ఈ విషయం పక్కనబెడితే ఐపీఎల్ 16వ సీజన్ విదేశీ ఆటగాళ్లకంటే దేశవాలీ ఆటగాళ్లనే ఎక్కువగా వెలుగులోకి తీసుకొచ్చింది. తక్కువ ధరకే అమ్ముడయిన చాలా మంది ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రింకూ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అథర్వ టైడే, తుషార్ దేశ్‌పాండే, యశస్వి జైశ్వాల్, మతీషా పతీరానా సహా చాలా మంది ఉన్నారు.
వీరిని మినహాయిస్తే ఐపీఎల్ 2023 సీజన్‌కు కోట్లు పెట్టి కొనుక్కున్న విదేశీ ఆటగాళ్లలో చాలా మంది దారుణంగా విఫలమయ్యారు. కొందరు గాయాలతో సీజన్‌కు దూరంగా ఉంటే.. అవకాశాలు ఇచ్చినా ఆడడంలో ఫెయిలయ్యారు. మరి ఐపీఎల్ 16వ సీజన్‌లో అత్యంత ఎక్కువ ధర పలికి ఫ్లాప్ షో కనబరిచిన టాప్-5 విదేశీ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం.
బెన్ స్టోక్స్(సీఎస్‌కే):
Photo: IPL Twitter
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సీఎస్‌కే తరపున రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసి 18 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అసలు సీజన్ ఆరంభానికి ముందు బెన్ స్టోక్స్ సీఎస్‌కేకు కీలకంగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ గాయం కారణంగా అతను రెండు మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమయ్యాడు. తర్వాత కోలుకున్నప్పటికి స్టోక్స్‌ను జట్టులోకి తీసుకోవడానికి మొగ్గు చూపలేదు. అలా రెండు మ్యాచ్‌లకు మాత్రమే పరిమితమైన స్టోక్స్ ఐర్లాండ్‌తో టెస్టుమ్యాచ్ కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. ఐపీఎల్ మినీ వేలంలో సీఎస్‌కే బెన్ స్టోక్స్‌ను రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
జోఫ్రా ఆర్చర్(ముంబై ఇండియన్స్):
Photo: IPL Twitter
జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో జోఫ్రా ఆర్చర్ ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తాడని అనుకున్నారు. కీలకంగా మారడం అటుంచి తన ప్రదర్శనతో జట్టుకు భారమయ్యాడు. సీజన్‌లో కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఆర్చర్ 9.50 ఎకానమీతో పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత గాయంతో ఐపీఎల్ నుంచే వైదొలిగాడు. ఈ సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన వారిలో ఆర్చర్ ఒకడిగా మిగిలిపోయాడు.
హ్యారీ బ్రూక్(ఎస్‌ఆర్‌హెచ్):
Photo: IPL Twitter
ఐపీఎల్ ఆరంభానికి ముందు హ్యారీ బ్రూక్‌పై మంచి అంచనాలున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్ ఏరికోరి బ్రూక్‌ను రూ. 13.35 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ తన ధరకు బ్రూక్ ఏ విధంగానూ న్యాయం చేయలేకపోయాడు. ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ సాయంతో కేవలం 190 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. తొలి అంచె పోటీల్లో అన్ని మ్యాచ్‌లు ఆడిన బ్రూక్ తర్వాత అంచె పోటీల్లో కేవలం మూడు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. టెస్టుల్లోనే విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగిన బ్రూక్ ఐపీఎల్‌లో మాత్రం ఫ్లాప్ షో చేశాడు.
కగిసో రబాడ(పంజాబ్ కింగ్స్):
Photo: IPL Twitter
కగిసో రబాడ అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా తరపున టాప్ బౌలర్. అతని వైవిధ్యమైన పేస్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టాడు. అలాంటి రబాడ ఐపీఎల్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన రబాడ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు.
సామ్ కరన్(పంజాబ్ కింగ్స్):
Photo: IPL Twitter
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా సామ్ కరన్ చరిత్ర సృష్టించాడు. రూ. 18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. సీజన్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్న సామ్ కరన్.. ధావన్ గైర్హాజరీలో పలు మ్యాచ్‌ల్లో పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేయడంతో పాటు 10 వికెట్లు తీశాడు. ప్రదర్శన పరంగా సామ్ కరన్ అందరిలో కాస్త బెటర్‌గా కనిపిస్తున్నప్పటికి.. అతనికి వెచ్చించిన ధర ప్రకారం ఈ ప్రదర్శన ఫ్లాప్ అని చెప్పొచ్చు.
చదవండి: 'నాలుగేళ్ల వయసులో వాడేంటో తెలిసింది... ఇది ఊహించిందే!'