
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. తుది సమరంలో కేకేఆర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సన్‌రైజర్స్ తమ ప్రధాన బలమైన బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
నమ్మకాన్ని వమ్ము చేయని స్టార్క్
కేకేఆర్ పేసర్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనకు లభించిన ధరకు న్యాయం చేశాడు. అంతిమ సమరంలో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్‌కు గుండెకోత మిగిల్చాడు. అతను 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడు
ఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్‌రైజర్స్‌తోనే జరిగిన తొలి క్వాలిఫయర్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా (4-0-34-3) నిలిచాడు. సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ సీజన్‌లో స్టార్క్ సన్‌రైజర్స్ పాలిట విలన్‌లా దాపురించాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి అత్యుత్సాహంగా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లైనా కూడా ఆడకుండానే (18.3 ఓవర్లు) 113 పరుగులకు చాపచుట్టేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా నిరాశపరిచారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.
The winning by Celebration by Kolkata Knight Riders after winning the third IPL title. 🏆 pic.twitter.com/OgQBi87Kzt
— Johns. (@CricCrazyJohns) May 26, 2024
ఆడుతూ పాడుతూ..
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరో టైటిల్‌ను అందించాడు. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. గత సీజన్‌లో టేబుల్ చివర్లో ఉండిన సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలవడం ఆ జట్టు అభిమానులకు ఊరట కలిగించే అంశం. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్‌తో (14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు) ఇరగదీసి, బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.