Hardik Pandya: కెప్టెన్‌ నేనే కాబట్టి తొలి ఓవర్‌ నేనే బౌలింగ్‌ చేస్తా..! | Funny Memes and Jokes on Hardik Pandya and his brother Krunal Pandya Went Viral on Social Media - Sakshi
Sakshi News home page

Hardik Pandya: కెప్టెన్‌ నేనే కాబట్టి తొలి ఓవర్‌ నేనే బౌలింగ్‌ చేస్తా..!

Published Mon, Mar 25 2024 1:55 PM | Last Updated on Mon, Mar 25 2024 3:17 PM

IPL 2024 GT VS MI: Hardik Pandya Being A Captain Bowled First Over Of The Innings, His Brother Done The Same In Previous Season - Sakshi

ఇటీవలికాలంలో హార్దిక్‌ పాండ్యా ఓవరాక్షన్‌ ఎక్కువైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఐపీఎల్‌ కెప్టెన్‌ అయ్యాక హార్దిక్‌కు పొగరు తలకెక్కిందని మండిపడుతున్నారు. ఐపీఎల్‌ 2024లో భాగంగా గుజరాత్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పట్ల వ్యవహరించిన తీరును ఉదహరిస్తూ హార్దిక్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. తనకంటే సీనియరైన రోహిత్‌ పట్ల కనీస గౌరవం కూడా లేకుండా బౌండరీ లైన్‌ వద్ద అటుఇటు తిప్పడాన్ని సగటు భారత క్రికెట్‌ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. తాజాగా హార్దిక్‌ వెలగబెట్టిన ఓ ఘన కార్యాన్ని ప్రస్తావిస్తూ ఇట్లుంటది ఈ కెప్టెన్‌తోని అంటూ వ్యంగ్యమైన కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. గుజరాత్‌ టైటాన్స్‌తో నిన్నటి మ్యాచ్‌లో బుమ్రా, లూక్‌ వుడ్‌, గెరాల్డ్‌ కొయెట్జీ లాంటి స్పెషలిస్ట్‌ పేసర్లు ఉన్నప్పటికీ హార్దిక్‌ పాండ్యా తనే తొలి ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు. ఇదే ముంబై అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ముగ్గురు స్పెషలిస్ట్‌ పేసర్లు ఉన్నప్పుడు ఈ ఓవరాక్షన్‌ ఎందుకు అని వారు మండిపడుతున్నారు. వేస్తే వేశాడు. ఏమైనా పొడిచాడా అంటే అదీ లేదు. 3 ఓవర్లు వేసి ఒక్క వికెట్‌ కూడా తీయకుండా 30 పరుగులు సమర్పించుకున్నాడు. కెప్టెన్‌ అయ్యాక ఇలా చేయడం హార్దిక్‌కు కొత్తేమీ కాదు.

టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్నప్పుడు, గుజరాత్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఇలా చేశాడు. అసలు పిచ్‌ ఆరంభ ఓవర్లలో తన బౌలింగ్‌ శైలికి  సహకరిస్తుందా లేదా అని కూడా ఆలోచించకుండా తొలి ఓవరే బంతినందుకున్నాడు. కెప్టెన్‌ నేనే కాబట్టి, తొలి ఓవర్‌ నేనే వేస్తాను అన్నట్లుంది అతని ధోరణి. ఈ అతి చేష్టలే ముంబై అభిమానులకు అసలు రుచించడం లేదు. దీనికి తోడు సీనియర్‌ అని కూడా చూడకుండా రోహిత్‌ అగౌరవపరచడం ముంబై అభిమానులకు అస్సలు సహంచడం లేదు. ఎక్కడో గుజరాత్‌ వాడు వచ్చి మాపై (రోహిత్‌) పెత్తనం చెలాయించడమేంటని బహిరంగ విమర్శలు చేస్తున్నారు.

హార్దిక్‌ ఒక్కడే ఇలా (కెప్టెన్‌గా తొలి ఓవర్‌ బౌలింగ్‌ చేయడం) అనుకుంటే పొరబడ్డట్టే. అతని అన్న కృనాల్‌ పాండ్యా కూడా గతంలో ఇలాగే చేశాడు.  గత సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‌లకు లక్నో కెప్టెన్‌గా వ్యవహరించిన కృనాల్‌..  ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో పిచ్‌  గురించి పట్టించుకోకుండా కెప్టెన్‌ నేనే కాబట్టి నేనే తొలి ఓవర్‌ వేస్తా అన్నట్లు వ్యవహరించాడు. పిచ్‌ పేసర్లకు సహకరిస్తుందని తెలిసినప్పటికీ కృనాల్‌ తొలి ఓవర్‌ వేయడంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. మొత్తంగా ఇలా చేయడం పాండ్యా బ్రదర్స్‌కు మాత్రమే సాధ్యమైంది.

ఇదిలా ఉంటే,  ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. సాయి సుదర్శన్‌ (45) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేసి 3 వికెట్లు పడగొట్టగా.. గెరాల్డ్‌ కొయెట్జీ 2, పియుశ్‌ చావ్లా ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్‌ శర్మ (43), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (46) రాణించినప్పటికీ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. గుజరాత్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. ఒమర్‌జాయ్‌, ఉమేశ్‌ యాదవ్‌,స్పెన్సర్‌ జాన్సన్‌, ఉమేశ్‌ యాదవ్‌, మోహిత్‌ శర్మ తలో 2 వికెట్లు, సాయికిషోర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement