
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 26) రసవత్తర సమరం జరుగనుంది. గత సీజన్ విజేత సీఎస్‌కే.. ఫైనలిస్ట్ గుజరాత్ టైటాన్స్ ఇవాళ తలపడనున్నాయి. చెన్నైలోని చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి. సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీపై.. గుజరాత్ తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందాయి.
ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. గతేడాది గుజరాత్‌కు హార్దిక్.. సీఎస్‌కేకు ధోని సారధ్యం వహించగా.. ఈ ఏడాది గుజరాత్‌ను గిల్, సీఎస్‌కేను రుతురాజ్ ముందుండి నడిపిస్తున్నారు. ఈ ఇద్దరు యువ కెప్టెన్లు నేటి మ్యాచ్‌లో ఎలాంటి వ్యూహరచనలు చేస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. సీఎస్‌కేపై గుజరాత్ స్వల్ప పైచేయి కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 3, సీఎస్‌కే 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్లు గత సీజన్ ఫైనల్లో చివరిసారిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే.. గుజరాత్‌ను ఓడించి, ఐదో సారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది.
వాతావరణం ఎలా ఉందంటే..
చెపాక్‌లో ఇవాల్టి వాతావరణం ఆటకు ఆనువుగా ఉంటుంది. వాతావరణం నుంచి మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు. మ్యాచ్ జరిగే సమయంలో (7:30-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ వేళల్లో ఉష్ణోగ్రతలు 29-30 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంది.
పిచ్ ఎవరికి అనుకూలం..
ఈ సీజన్‌లో చెపాక్‌లో ఇది రెండో మ్యాచ్. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించినప్పటికీ.. సీఎస్‌కే పేసర్ ముస్తాఫిజుర్ అనూహ్య స్వింగ్‌ను పొందాడు. సహజంగా ఛేదనకు అనుకూలించని ఈ పిచ్‌పై సీఎస్‌కే 174 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. దీన్ని బట్టి చూస్తే ఈ పిచ్‌పై తొలుత బౌలింగ్ చేసే జట్టుకు ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. సొంత మైదానంలో ఆడనుండటంతో ఈ మ్యాచ్‌లో సీఎస్‌కేకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి.