అందుకే ధోని అలా చేస్తున్నాడు: ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ | IPL 2024: Adam Gilchrist Reacts To Dhoni New Bat Sticker, Says Just A Local Sports Store - Sakshi
Sakshi News home page

MS Dhoni: అందుకే ధోని అలా చేస్తున్నాడు: ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌

Published Wed, Feb 14 2024 10:01 AM | Last Updated on Wed, Feb 14 2024 10:38 AM

IPL 2024 Just A Local Sports Store: Gilchrist Reacts To Dhoni New Bat Sticker - Sakshi

నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న ధోని (PC: X)

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మరోసారి మైదానంలో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్‌-2024లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున బరిలోకి దిగేందుకు ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు ఈ మిస్టర్‌ కూల్‌.

ఇందులో భాగంగా 42 ఏళ్ల మహి.. నెట్‌ సెషన్స్‌లో పాల్గొంటూ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్‌ సమయంలో ధోని ఉపయోగించిన బ్యాట్‌పై అభిమానుల దృష్టి పడింది.

ముఖ్యంగా.. ఆ బ్యాట్‌ మీద ప్రైమ్‌ స్పోర్ట్స్‌ పేరిట ఉన్న స్టిక్కర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ధోని స్వస్థలం రాంచికి చెందిన పరమ్‌జిత్‌ సింగ్‌ అనే వ్యక్తికి చెందిన షాపు పేరు అది. క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో తనకు సాయం అందించిన పరమ్‌జిత్‌ షాపును ప్రమోట్‌ చేస్తూ ధోని తీసుకున్న ఈ నిర్ణయం అభిమానుల మనసు దోచుకుంది.

ఈ విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్‌ కీపర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఎంఎస్‌ ధోని నెట్స్‌లో బ్యాటింగ్‌ చేయడం చూశాను. అతడి బ్యాట్‌పై కొత్త స్టిక్కర్‌ కనిపించింది.

తన స్కూల్‌మేట్‌కు చెందిన స్థానిక స్పోర్ట్స్‌ స్టోర్‌ పేరు అది. తన స్నేహితుడి షాపులో అమ్మకాలు పెంచడం కోసం ధోని ఇలా తన బ్యాట్‌పై ఆ స్టిక్కర్‌ వేయించుకున్నాడు’’ అని గిల్‌క్రిస్ట్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా- వెస్టిండీస్‌ మధ్య రెండో టీ20 సందర్భంగా కామెంట్రీ చేస్తున్న సందర్భంలో గిల్‌క్రిస్ట్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోని సొంతం. అయితే, వయసు పైబడుతున్న దృష్ట్యా తాజా సీజన్‌కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందిగ్దాల నడుమ.. తలా బ్యాట్‌ పట్టి ప్రాక్టీస్‌ చేయడం అభిమనుల్లో జోష్‌ నింపింది. ధోని ఈసారి కూడా కెప్టెన్‌గా బరిలోకి దిగడం ఖాయమంటూ నెట్టింట సందడి చేస్తున్నారు ఫ్యాన్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement