విరాట్ కోహ్లితో శుబ్‌మన్ గిల్ (PC: BCCI)
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-2024 సందడి మొదలుకానుంది. చెన్నై వేదికగా మార్చి 22న ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. తాజా ఎడిషన్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పది ఫ్రాంఛైజీల ఆటగాళ్లందరూ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. జాతీయ జట్టు షెడ్యూల్‌తో బిజీగా ఉన్న వాళ్లు మినహా మిగతా వాళ్లంతా ఐపీఎల్ జట్ల శిక్షణా శిబిరంలో చేరి.. ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు.
ఇక ఎప్పటిలాగే.. ఈ సీజన్ ఆరంభానికి ముందు కూడా.. ఈసారి ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? పర్పుల్ క్యాప్ గెలిచేది ఎవరు? చాంపియన్‌గా నిలిచేది ఏ జట్టు? అంటూ అభిమానులు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు ఇలాంటి ప్రశ్నలు ఎదురుకాగా.. ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చహల్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి ఆరెంజ్ క్యాప్‌ను యశస్వి జైస్వాల్ లేదంటే జోస్ బట్లర్ గెలుస్తాడు.
ఇక పర్పుల్ క్యాప్ విషయానికొస్తే.. ఈసారి అత్యధిక వికెట్లు తీసేది నేనే.. నా తర్వాతి స్థానంలో రషీద్ ఖాన్ ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. ఈ మేరకు అత్యధిక పరుగుల వీరుడిగా టీమిండియా స్టార్ ఓపెనర్, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరును చెప్పాడు చహల్.
యజువేంద్ర చహల్- బట్లర్, జైస్వాల్(PC: RR/IPL)
అదే విధంగా.. రాయల్స్‌లో మరో సహచర ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌కు కూడా ఆరెంజ్ క్యాప్ గెలిచే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే, అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ మాత్రం తానే గెలుస్తానని చహల్ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.
కాగా ఐపీఎల్‌లో విజయవంతమైన బౌలర్‌గా యజువేంద్ర చహల్ పేరొందాడు. చాలా ఏళ్లపాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చహల్.. రెండేళ్ల క్రితం రాజస్తాన్ రాయల్స్‌కు మారాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లలో కలిపి 21 వికెట్లు తీశాడీ మణికట్టు స్పిన్నర్.
తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్లు(187) తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే, టీమిండియాలో మాత్రం చహల్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. ఇటీవలే సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడతడు!
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ స్టార్ శుబ్‌మన్ గిల్ 890 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఆర్సీబీ స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ 730, సీఎస్‌కే ఓపెనర్ డెవాన్ కాన్వే 672, ఆర్సీబీ ముఖచిత్రం విరాట్ కోహ్లి 639 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.
చదవండి: #DhanashreeVerma: పదే పదే ఇలా ఎందుకు? చహల్ భార్య ధనశ్రీ వర్మ ఫొటోపై రచ్చ
Comments
Please login to add a commentAdd a comment