ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ రాజస్థాన్ రాయల్స్ కొంపముంచింది. రాయల్స్ నిర్దిష్ట సమయానికి (ఓవర్ రేట్‌లో) ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్‌లో సర్కిల్ బయట ఓ ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇదే రాజస్థాన్ ఓటమికి కారణమైంది.
6 బంతుల్లో 15 పరుగులు అవసరమైన సందర్భంలో.. సర్కిల్ బయట ఓ ఫీల్డర్ తక్కువగా ఉండటంతో గుజరాత్ బ్యాటర్లు ఫ్రీగా షాట్లు ఆడి గెలుపుకు కావాల్సిన పరుగులు రాబట్టారు. ఈ ఓవర్‌లో గుజరాత్ బ్యాటర్లు సర్కిల్ పై నుంచి సులువుగా షాట్లు ఆడి మూడు బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు. దీనికి ముందు కుల్దీప్ సేన్ 19వ ఓవర్‌లో 20 పరుగులిచ్చి గుజరాత్‌ను గెలుపు లైన్‌లో నిలబెట్టాడు. మ్యాచ్ ఆరంభంలో ఇదే కుల్దీప్ 10 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను మ్యాచ్‌లోకి తెచ్చాడు. మొత్తంగా చూస్తే స్లో ఓవర్ రేటే రాజస్థాన్ పాలిట శాపంగా మారింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్ 8, హెట్‌మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ను రాహుల్ తెవాతియా (22), రషీద్ ఖాన్ (24 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. ఈ ఇద్దరు ఆఖరి రెండు ఓవర్లలో 37 పరుగులు రాబట్టి రాజస్థాన్‌కు గెలుపును దూరం చేశారు. గుజరాత్ ఇన్నింగ్స్‌కు తొలుత సాయి సుదర్శన్ (35), శుభ్‌మన్ గిల్ (72) గట్టి పునాది వేశారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ వేడ్ 4, అభినవ్ మనోహర్ 1, విజయ్ శంకర్ 16, షారుక్ ఖాన్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. కుల్దీప్ సేన్ (4-0-41-3), చహల్ (4-0-43-2) రాణించినప్పటికీ రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment