
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 19) జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అన్‌బాక్స్ ఈవెంట్‌లో ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మహిళల ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంపై స్పందిస్తూ.. ఈ ఏడాది ఆర్సీబీ టైటిళ్ల సంఖ్యను డబుల్ చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.
మహిళల ఆర్సీబీ జట్టు టైటిల్ గెలిచినప్పుడు తామందరం మ్యాచ్ చూస్తున్నామని.. ఆ సమయంలో ఆర్సీబీ అభిమానుల స్వచ్ఛమైన ప్రేమను ఫీలయ్యామని అన్నాడు. ఆర్సీబీ టైటిల్ గెలిచిన క్షణాన బెంగళూరు నగరమే టైటిల్ గెలిచిన ఫీలింగ్ కలిగిందని తెలిపాడు. ఇన్నేళ్ల పాటు అభిమానులు మాపై ఉంచిన నమ్మకాన్ని త్వరలోనే డబుల్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
THE RCB TEAM IS READY FOR IPL 2024...!!!!! 🔥 pic.twitter.com/aRCU4671at
— CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024
16 ఏళ్లలో తాను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా టైటిల్ గెలవాలనే దృడ సంకల్పంతోనే వచ్చానని.. అందు కోసం ప్రతిసారి శాయశక్తుల కృషి చేశానని పేర్కొన్నాడు. ఐపీఎల్ టైటిల్ తొలిసారి గెలిచిన ఆర్సీబీ జట్టులో ఉండాలన్నది తన కోరిక అని.. అభిమానులు, ఫ్రాంచైజీకి సహకారాన్ని ఎప్పటికీ మరువలేనని, టైటిల్ గెలిచి వీరి రుణాన్ని తీర్చుకుంటానని తెలిపాడు.
కాగా, అన్‌బాక్స్ ఈవెంట్ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్ ఛాంపియన్స్ ఆర్సీబీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన పురుషుల ఆర్సీబీ బృందంలో విరాట్ కోహ్లి కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా విరాట్.. సహచరులతో కలిసి చప్పలు కొడుతూ ఛాంపియన్స్‌ను మైదానంలోకి ఆహ్వానించాడు. ఈ ఈవెంట్ సందర్భంగా విరాట్ చాలా హుషారుగా కనిపించాడు.
మహిళా క్రికెటర్లతో కలిసి ఫోటోలను పోజులిచ్చాడు. చిన్నస్వామి స్టేడియం మొత్తం విరాట్ నామస్మరణతో మార్మోగిపోయింది. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కేతో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment