
Photo Courtesy: BCCI
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 100 వికెట్లతో పాటు 3000 పరుగులు పూర్తి చేసి తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మార్చి 28) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు చేసిన జడేజా.. తన చివరి పరుగు వద్ద ఐపీఎల్‌లో 3000 పరుగుల మార్కును తాకాడు. జడేజా ఖాతాలో 160 ఐపీఎల్ వికెట్లు కూడా ఉన్నాయి. జడ్డూ తన ఐపీఎల్ కెరీర్‌లో 242 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 27 మంది 3000 పరుగులు స్కోర్ చేయగా.. అందులో జడేజా మాత్రమే 100కుపైగా వికెట్లు కూడా తీశాడు. 3000 పరుగులు చేసిన మరో ఇద్దరు మాత్రమే 50కి పైగా వికెట్లు తీశారు. వీరిలో ఒకరు షేన్ వాట్సన్ కాగా.. మరొకరు కీరన్ పోలార్డ్. వాట్సన్ 145 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 3874 పరుగులతో పాటు 92 వికెట్లు తీయగా.. పోలార్డ్ 189 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 3412 పరుగులు చేసి 69 వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 50 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. తొలుత బౌలింగ్ చేసి 20-30 పరుగులు అదనంగా సమర్పించుకోవడంతో పాటు కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేసింది. అనంతరం బ్యాటింగ్‌లో కనీస పోరాటం కూడా చూపలేక ప్రత్యర్థికి దాసోహమైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది.
స్లోగా ఉన్న పిచ్‌పై ఇది చాలా మంచి స్కోర్. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్ అహ్మద్ (4-0-28-1) బాగానే బౌలింగ్ చేసినా అశ్విన్ (2-0-22-1), జడ్డూ (3-0-37-0) సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సీఎస్‌కే ఆదిలోనే చేతులెత్తేసింది. 8 పరుగులకే (రెండో ఓవర్‌లో) 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఆతర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు.
హాజిల్‌వుడ్ (4-0-21-3), లవింగ్‌స్టోన్ (4-0-28-2), యశ్ దయాల్ (3-0-18-2) వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్‌కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర (41) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.