రిషభ్ పంత్- కేఎల్ రాహుల్ (PC: BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు అనుకున్నంత ధర దక్కలేదు. భారీ అంచనాల నడుమ ఆక్షన్‌లోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ కోసం ఏ ఫ్రాంఛైజీ కూడా మరీ అంతగా ఎగబడిపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో రాహుల్ తన పేరును నమోదు చేసుకున్నాడు.
అయితే, లోకల్ బాయ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలుత బిడ్ వేయగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా పోటీకి వచ్చింది. కానీ ధర కాస్త పెరగగానే ఈ రెండూ తప్పుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రాహుల్ కోసం పోటీపడ్డాయి. అలా ఆఖరికి రాహుల్‌ను ఢిల్లీ రూ. 14 కోట్లకు దక్కించుకుంది.
కాగా కేఎల్ రాహుల్ ఐపీఎల్-2022- 2024 వరకు లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథ్యం వహించాడు. లక్నో ఫ్రాంఛైజీని అరంగేట్రంలో(2022)నే ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. మరుసటి ఏడాది కూడా టాప్-4లో నిలిపాడు. కానీ.. ఐపీఎల్-2024లో మాత్రం లక్నోకు వరుస పరాభవాలు ఎదురయ్యాయి.
రాహుల్‌పై గోయెంకా ఆగ్రహం
సీజన్ మొత్తంలో ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఏడు మాత్రమే గెలిచిన లక్నో.. 14 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. ఆ ఫ్రాంఛైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా.. తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.
స్వేచ్ఛ ఉన్న చోటే ఆడాలని
అందరి ముందే రాహుల్‌ను గోయెంకా తిట్టినట్లుగా ఉన్న దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రిటెన్షన్‌కు ముందు రాహుల్- లక్నోల బంధం తెగిపోయింది. ఈ విషయంపై రాహుల్ స్పందిస్తూ.. స్వేచ్ఛ ఉన్న చోట ఆడాలని అనుకుంటున్నట్లు పరోక్షంగా గోయెంకా వైపు మాటల బాణాలు విసిరాడు.
ఈ నేపథ్యంలో మెగా వేలం సందర్భంగా సంజీవ్ గోయోంకా సైతం కేఎల్ రాహుల్‌కు కౌంటర్ గట్టిగానే ఇచ్చాడు. కాగా సౌదీ అరేబియాలో జరిగిన ఆక్షన్‌లో లక్నో.. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం రూ. 27 కోట్లు వెచ్చించింది. ఈ విషయం గురించి గోయెంకా మాట్లాడుతూ.. ‘‘మాకు కావాల్సిన ఆటగాడికి ఉండాల్సిన లక్షణాలన్నీ పంత్‌లో ఉన్నాయి. అందుకే అతడి కోసం మేము ముందే రూ. 25- 27 కోట్లు పక్కన పెట్టుకున్నాం’’ అని పేర్కొన్నాడు.
ఏదేమైనా వేలం ముగిసే సరికి పంత్, రాహుల్‌ల జట్లు తారమారయ్యాయి. రాహుల్ స్థానంలో లక్నో కెప్టెన్‌గా పంత్, పంత్ ప్లేస్‌లో ఢిల్లీ సారథిగా రాహుల్ వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ వీళ్లిద్దరి ఫొటోతో ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.
అన్నీ బాగానే ఉంటాయి.. కానీ
రాహుల్ పంత్ చెవిలో ముచ్చటిస్తున్నట్లుగా ఉన్న ఫొటోకు.. ‘‘చూడు భాయ్.. కంపెనీ మంచిది.. డబ్బు కూడా బాగానే ఇస్తారు.. కానీ బాస్ మాత్రం విషపూరితమైన మనసున్న వ్యక్తి’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు ప్రముఖ వ్యాపారవేత్త, సంజీవ్ గోయెంకా అన్న హర్ష్ గోయెంకా స్పందించారు. ఇదేమిటబ్బా అన్నట్లుగా ఉన్న ఎమోజీని ఆయన జతచేశారు.
చదవండి: IPL 2025 Mega Auction: మెగా వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment