ఆక్షనీర్ మల్లికా సాగర్(PC: BCCI/IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలానికి పది ఫ్రాంఛైజీలు సిద్ధమయ్యాయి. సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా ఆది, సోమ వారాల్లో వేలం పాట నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబరు 31న తమ రిటెన్షన్ లిస్టు విడుదల చేసిన ఫ్రాంఛైజీలు.. మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలతో సన్నద్ధంగా ఉన్నాయి.
ఇక ఐపీఎల్-2025 మెగా వేలం సందర్భంగా రైటు మ్యాచ్ కార్డు(ఆర్టీఎమ్) మరోసారి అందుబాటులోకి వచ్చింది. అయితే, బీసీసీఐ మాత్రం ఈసారి ఆర్టీఎమ్ విషయంలో నిబంధనను సవరించి ట్విస్ట్ ఇచ్చింది. కాగా.. ఐపీఎల్- 2014 మెగా వేలం సందర్భంగా తొలిసారి ఈ ఆర్టీఎమ్ నిబంధన ప్రవేశపెట్టారు.
నిబంధన ఏమిటి?
ఈ రూల్ ప్రకారం.. ఒక ఫ్రాంఛైజీ.. వేలానికి ముందు తాము విడిచిపెట్టిన ఆటగాడిని తిరిగి దక్కించుకోవాలంటే ఆర్టీఎమ్ కార్డును ఉపయోగించుకుంటుంది. తమ ఆటగాడిని కొనుగోలు చేసేందుకు వేరొక ఫ్రాంఛైజీ వెచ్చించిన మొత్తాన్ని.. తామే చెల్లించి అతడిని తిరిగి తీసుకునే వీలుంటుంది. ఇలా ఆర్టీఎమ్ కార్డు ద్వారా.. ఒక ఫ్రాంఛైజీ తమ ప్లేయర్ ధరను ఖరారు చేసిన తర్వాత.. ఈ మేర తమ నిర్ణయాన్ని చెప్పే వీలుంటుంది.
ఈసారి ‘లాక్’ చేయడం కుదరదు
అయితే, ఈసారి మాత్రం ఆర్టీఎమ్ కార్డు వినియోగం విషయంలో బీసీసీఐ ఓ మెలిక పెట్టింది. ఆర్టీఎమ్‌తో తాము కోరుకున్న ఆటగాడిని సదరు ఫ్రాంఛైజీ ‘లాక్’ చేయడం కుదరదు.
అంటే.. ఉదాహరణకు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా పనిచేసిన రిషభ్ పంత్.. వేలంలో రూ. 20 కోట్లు పలికితే.. ఢిల్లీ ఫ్రాంఛైజీ ఆర్టీఎమ్ కార్డ్‌తో అతడిని దక్కించుకోలేదు. ఆ మొత్తంపై పెంచేందుకు, వేలంపాట పొడిగించేందుకు మిగతా ఫ్రాంచైజీలకు ఈసారి అవకాశముంటుంది. దీంతో రూ. 20 కోట్ల వద్ద అన్‌లాక్ అయిన పంత్.. రూ. 25 కోట్ల వరకు వెళ్లిపోయే చాన్స్‌వుంది.
మరో ఉదాహరణ గమనిద్దాం.. వేలానికి ముందు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వదిలేసిన విషయం తెలిసిందే. అయితే, తిరిగి మాక్సీని ఆర్సీబీ దక్కించుకోవాలంటే పాత నిబంధన ప్రకారం.. వేరే ఫ్రాంఛైజీ ధర ఫిక్స్ చేసిన తర్వాత.. అంతే ధరకు లాక్ చేసుకునేది.
కానీ ఈసారి ఆ వెసలుబాటు లేదు. ఒకవేళ మాక్సీ కోసం చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడింది అనుకుందాం. రూ. 6 కోట్లతో బిడ్ విన్ అయిన తర్వాత.. ఆర్సీబీ అదే ధరకు అతడిని సొంతం చేసుకోవాలని భావించి తమ నిర్ణయాన్ని వెల్లడించిందనే అనుకుందాం. పాత నిబంధన ప్రకారం అయితే, అదే ధరకు మాక్సీ ఆర్సీబీకి వెళ్లిపోయేవాడే!
కానీ కొత్త రూల్ ప్రకారం.. బిడ్ లాక్ అయిన తర్వాత కూడా మాక్స్‌వెల్ ధరను పెంచేందుకు చెన్నైకి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. అదే సమయంలో చెన్నై మరోసారి మాక్సీ ధరను రూ. 8 కోట్లకు పెంచితే.. ఆర్సీబీ అప్పటికీ అతడిని కోరుకుంటే 8 కోట్లు చెల్లించాల్సిందే. లేదంటే.. అతడు చెన్నై ఫ్రాంఛైజీ సొంతమవుతాడు.
ట్విస్ట్ ఇదే
కాగా 2018 ఎడిషన్‌లో బీసీసీఐ.. ఫ్రాంఛైజీలకు అత్యధికంగా మూడు ఆర్టీఎమ్ కార్డులు ఉపయోగించుకునే అవకాశం ఇచ్చింది. కానీ 2022 వేలానికి ముందు ఈ నిబంధనను పూర్తిగా ఎత్తివేసింది. ఇప్పుడు మళ్లీ 2025 మెగా వేలం సందర్భంగా ఆర్టీఎమ్ రూల్‌ను అందుబాటులోకి తెచ్చినా ఇలా.. ట్విస్ట్ ఇచ్చిందన్న మాట!
ఇక ఈసారి రిటెన్షన్(గరిష్టంగా ఆరుగురు- అత్యధికంగా ఐదుగురు క్యాప్డ్, ఇద్దరు ఇండియన్ అన్‌క్యాప్డ్ ప్లేయర్) సమయంలో ఏదైనా ఫ్రాంఛైజీ.. తమ పూర్తి కోటాను వినియోగించుకోకపోతే ఆర్టీఎమ్ కార్డు వాడుకోవచ్చు. అంటే, వారు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల సంఖ్యపైనే ఈ కార్డు వినియోగం ఆధారపడి ఉంటుందన్న మాట.
ఉదాహరణకు.. ఒక ఫ్రాంఛైజీ నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంటే.. సదరు ఫ్రాంఛైజీ రెండు ఆర్టీఎమ్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. అయితే, దీనికి కూడా గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్, ఇద్దరు ఇండియన్ అన్‌క్యాప్డ్ ప్లేయర్ల నిబంధన వర్తిస్తుంది. అంటే.. ఒక ఫ్రాంఛైజీ ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకుంటే.. వేలంలో ఒకే ఒక్కరిని ఆర్టీఎమ్ కార్డు ద్వారా తిరిగి పొందవచ్చు.
ఐపీఎల్ మెగా వేలం-2025రిటెన్షన్స్ పోనూ ఎవరి పర్సులో ఎంత?
రాజస్తాన్ రాయల్స్
సంజూ సామ్స(భారత్-రూ. 18 కోట్లు), యశస్వి జైస్వాల్(భారత్-రూ. 18 కోట్లు), రియాన్ పరాగ్(భారత్-రూ. 14 కోట్లు), ధ్రువ్ జురెల్(భారత్ రూ. 14 కోట్లు), హెట్‌మైర్(వెస్టిండీస్ రూ. 11 కోట్లు), సందీప్ శర్మ(భారత్- రూ. 4 కోట్లు)
👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 41 కోట్లు
👉ఆర్టీఎమ్ అవకాశం లేదు
గుజరాత్ టైటాన్స్
రషీద్ ఖాన్(అఫ్గానిస్తాన్- రూ. 18 కోట్లు), శుబ్‌మన్ గిల్(భారత్- రూ. 16.50 కోట్లు), సాయి సుదర్శన్(భారత్-రూ. 8.50 కోట్లు), రాహుల్ తెవాటియా(భారత్‌రూ. 4 కోట్లు), షారుఖ్ ఖాన్(భారత్- రూ. 4 కోట్లు)
👉పర్సులో మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు
👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక క్యాప్‌డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు
ఢిల్లీ క్యాపిటల్స్
అక్షర్ పటేల్(భారత్- రూ. 16.50 కోట్లు), కుల్దీప్ యాదవ్(భారత్‌రూ. 13.25 కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్(దక్షిణాఫ్రికారూ. 10 కోట్లు), అభిషేక్ పొరెల్(భారత్‌రూ. 4 కోట్లు)
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 73 కోట్లు
👉ఆర్టీఎమ్ అవకాశం: ఇద్దరు క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు
లక్నో సూపర్ జెయింట్స్
నికోలస్ పూరన్(వెస్టిండీస్-రూ. 21 కోట్లు ),రవి బిష్ణోయ్(భారత్-రూ. 11 కోట్లు), మయాంక్ యాదవ్(భారత్-రూ. 11 కోట్లు),మోహసిన్ ఖాన్(భారత్- రూ. 4 కోట్లు), ఆయుష్ బదోని (భారత్- రూ. 4 కోట్లు)
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు
👉ఆర్టీఎమ్ అవకాశం లేదు: ఒక క్యాప్‌డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు
సన్‌రైజర్స్ హైదరాబాద్
హెన్రిచ్ క్లాసెన్(దక్షిణాఫ్రికా- రూ. 23 కోట్లు), ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా- రూ. 18 కోట్లు), అభిషేక్ శర్మ(భారత్- రూ. 14 కోట్లు), ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా రూ. 14 కోట్లు), నితీశ్ రెడ్డి(భారత్ రూ. 6 కోట్లు)
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు
👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు
ముంబై ఇండియన్స్
జస్‌ప్రీత్ బుమ్రా(భారత్- రూ. 18 కోట్లు ), సూర్యకుమార్(భారత్- రూ. 16.35 కోట్లు), హార్దిక్ పాండ్యా(భారత్-రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ(భారత్-రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ(భారత్‌రూ. 8 కోట్లు)
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు
👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు
చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ గైక్వాడ్(భారత్-రూ. 18 కోట్లు), మతీశా పతిరన(శ్రీలంరూ. 13 కోట్లు), శివమ్ దూబే(భారత్-రూ. 12 కోట్లు), రవీంద్ర జడేజా(భారత్ రూ. 18 కోట్లు), ధోనీ)భారత్- రూ. 4 కోట్లు)
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 55 కోట్లు
👉ఆర్టీఎమ్ అవకాశం: ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు
కోల్‌కతా నైట్ రైడర్స్
రింకూ సింగ్(భారత్- రూ. 13 కోట్లు), వరుణ్ చక్రవర్తి(భారత్ రూ. 12 కోట్లు), సునీల్ నరైన్(వెస్టిండీస్-రూ. 12 కోట్లు), ఆండ్రె రసెల్(వెస్టిండీస్- రూ. 12 కోట్లు), హర్షిత్ రాణా(భారత్-రూ. 4 కోట్లు), రమణ్‌దీప్ సింగ్(భారత్- రూ. 4 కోట్లు)
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 51 కోట్లు
👉ఆర్టీఎమ్ అవకాశం లేదు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లి(భారత్- రూ. 21 కోట్లు), రజత్ పాటిదార్(భారత్-రూ. 11 కోట్లు), యశ్ దయాళ్(భారత్- రూ. 5 కోట్లు)
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు
👉ఆర్టీఎమ్ అవకాశం: ముగ్గురు క్యాప్‌డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు
పంజాబ్ కింగ్స్
శశాంక్ సింగ్(భారత్- రూ. 5.5 కోట్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్(భారత్- రూ. 4 కోట్లు)
👉వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 110.5 కోట్లు
👉ఆర్టీఎమ్ అవకాశం: నలుగురు క్యాప్‌డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment