మధ్యాహ్నం గం. 3:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఫ్రాంచైజీల చేతిలో ఉన్నవి రూ. 641.50 కోట్లు... కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లు 204... అందుబాటులో ఉన్న ప్లేయర్లు 577 మంది... అత్యధిక మొత్తం ఉన్న ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ రూ 110.50 కోట్లు. ఈ అంకెలు చాలు ఐపీఎల్ ఆటనే కాదు... వేలం పాట కూడా సూపర్‌హిట్ అవుతుందని! రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం వేడుకకు సర్వం సిద్ధమైంది.
వేలం పాట పాడే ఆక్షనీర్ మల్లికా సాగర్, పది ఫ్రాంచైజీ యాజమాన్యాలు, హెడ్ కోచ్‌లు, విశ్లేషకులు వెరసి అందరి కళ్లు హార్డ్ హిట్టర్, వికెట్ కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్‌పైనే నెలకొన్నాయి. అంచనాలు మించితే రూ. పాతిక కోట్లు పలికే భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కేందుకు పంత్ సై అంటున్నాడు.
వచ్చే సీజన్ ఐపీఎల్ ఆటకు ముందు వేలం పాటకు వేళయింది. ఆది, సోమవారాల్లో జరిగే ఆటగాళ్ల మెగా వేలంలో భారత స్టార్లతో పాటు పలువురు విదేశీ స్టార్లు ఫ్రాంచైజీలను ఆకర్శిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన రిషభ్ పంత్‌పై పది ఫ్రాంచైజీలు కన్నేశాయి.
మెగా వేలంలోనే మెగా ధర పలికే ఆటగాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సారథ్యం, వికెట్ కీపింగ్, మెరుపు బ్యాటింగ్ ఇవన్నీ కూడా పంత్ ధరను అమాంతం పెంచే లక్షణాలు. దీంతో ఎంతైన వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి.
అతడితో పాటు భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఈ సీజన్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) విజయసారథి శ్రేయస్ అయ్యర్, సీమర్లు అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్‌లపై రూ. కోట్లు కురవనున్నాయి.
విదేశీ ఆటగాళ్లలో జోస్ బట్లర్, లివింగ్‌స్టోన్ (ఇంగ్లండ్), స్టార్క్, వార్నర్ (ఆస్ట్రేలియా), రబడా (దక్షిణాఫ్రికా)లపై ఫ్రాంచైజీలు దృష్టిపెడతాయి. గతేడాది వేలంపాట పాడిన ప్రముఖ ఆక్షనీర్ మల్లికా సాగర్ ఈ సారి కూడా వేలం ప్రక్రియను నిర్వహించనుంది.
116 మందిపైనే వేలం వెర్రి
వేలానికి 577 మంది ఆటగాళ్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుది జాబితాను సిద్ధం చేసినప్పటికీ మొదటి సెట్‌లో వచ్చే 116 మందిపైనే ఫ్రాంచైజీల దృష్టి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాట రూ. కోట్ల మాట దాటడం ఖాయం.
ఎందుకంటే ఇందులో పేరు మోసిన స్టార్లు, మ్యాచ్‌ను ఏకపక్షంగా మలుపుతిప్పే ఆల్‌రౌండర్లు, నిప్పులు చెరిగే సీమర్లు ఇలా అగ్రశ్రేణి ఆటగాళ్లంతా ముందు వరుసలో వస్తారు. దీంతో వేలం పాట రేసు రసవత్తరంగా సాగడం ఖాయమైంది.
ఇక 117 నుంచి ఆఖరి దాకా వచ్చే ఆటగాళ్లపై వేళ్లమీద లెక్కించే స్థాయిలోనే పోటీ ఉంటుంది. అంటే ఇందులో పది, పదిహేను మందిపై మాత్రమే ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది. మిగతా వారంతా ఇలా చదివితే అలా కుదిరిపోవడం లేదంటే వచ్చి వెళ్లిపోయే పేర్లే ఉంటాయి. పది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 204 మందినే ఎంపిక చేసుకుంటాయి.
అర్ష్‌దీప్ అ‘ధర’హో ఖాయం
అంతర్జాతీయ క్రికెట్‌లో గత మూడు సీజన్లుగా భారత సీమర్ అర్ష్‌దీప్ సింగ్ నిలకడగా రాణిస్తున్నాడు. 96 అంతర్జాతీయ టి20లాడిన అర్ష్‌దీప్ 96 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఈ ఏడాది సఫారీగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ డెత్ ఓవర్లలో సీనియర్ స్టార్ బుమ్రాకు దీటుగా బౌలింగ్ వేసి దక్షిణాఫ్రికాను కట్టడి చేసిన అతనిపై ఫ్రాంచైజీలు ఎగబడటం ఖాయం.
తరచూ పూర్తి జట్టును మారుస్తున్న పంజాబ్ కింగ్స్ వద్దే పెద్ద మొత్తంలో డబ్బులు (రూ.110 కోట్లు) ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌డమ్‌ను తీసుకొచ్చేందుకు పంత్‌ను, బౌలింగ్ పదును పెంచేందుకు అర్ష్‌దీప్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ సానుకూలతలు పంజాబ్‌కే ఉన్నాయి.
బట్లర్ వైపు ఆర్సీబీ చూపు
పంజాబ్ తర్వాత రెండో అధిక పర్సు రూ. 83 కోట్లు కలిగివున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) డాషింగ్ ఓపెనర్ జోస్ బట్లర్‌పై రూ. కోట్లు వెచ్చించే అవకాశముంది. రాహుల్, అయ్యర్ సహా ఆల్‌రౌండర్ దీపక్ చహర్ కోసం పోటీపడనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 73 కోట్లు), గుజరాత్ టైటాన్స్ (రూ.69 కోట్లు), లక్నో సూపర్‌జెయింట్స్ (రూ.69 కోట్లు), చెన్నై సూపర్‌కింగ్స్ (రూ. 55 కోట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ. 51 కోట్లు), ముంబై ఇండియన్స్ (రూ.45 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 45 కోట్లు), రాజస్తాన్ రాయల్స్ (రూ.41 కోట్లు)లు కూడా అందుబాటులో ఉన్న వనరులతో మేటి ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.
చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment