విధ్వంసకర వీరులు.. పంత్‌కు పగ్గాలు.. లక్నో ఫైనల్‌ చేరుతుందా? | IPL 2025: Pant To Pooran Players To Watch Out For Will LSG Reach Final | Sakshi
Sakshi News home page

విధ్వంసకర వీరులు.. పంత్‌కు పగ్గాలు.. లక్నో ఫైనల్‌ చేరుతుందా?

Published Wed, Mar 19 2025 7:27 PM | Last Updated on Wed, Mar 19 2025 7:33 PM

IPL 2025: Pant To Pooran Players To Watch Out For Will LSG Reach Final

రిషభ్‌ పంత్‌ (PC: LSG X)

పంత్‌కు పగ్గాలు: భారీ మార్పులు.. కొత్త ఆశలతో లక్నో

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో 2022లో అరంగేట్రం చేసింది. వరుసగా రెండు (2022,  2023) సీజన్లలో మూడో స్థానంలో నిలిచి.. ప్లే ఆఫ్స్‌ చేరింది. అయితే, గతేడాది మాత్రం లక్నోకు ఎదురు దెబ్బతగిలింది. తొలిసారిగా ఐపీఎల్లో లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. ఏడు విజయాలు, ఏడు పరాజయాలతో 14 పాయింట్లతో ఏడవ స్థానంతో ముగించింది.

ఈ నేపథ్యంలో 2025 సీజన్ కోసం జట్టులో భారీ మార్పులు చేపట్టింది. ఐపీఎల్ మెగా వేలం ఇందుకు అనువుగా ఉపయోగించుకుంది. విశాఖపట్నంలోని డాక్టర్  వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-విడిసిఏ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మార్చి 24 (గురువారం)న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ తో లక్నో సూపర్ జెయింట్స్ తన ఐపీఎల్ టైటిల్ వేట ప్రారంభిస్తుంది.

భారీ మార్పులతో కొత్త సీజన్లోకి  
ప్రారంభంలో నికోలస్ పూరన్ (Nicholas Pooran), రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ఆయుష్ బదోని, మోసిన్ ఖాన్ వంటి ఆటగాళ్ళని రెటైన్ చేసుకుంది. అయితే అనూహ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్‌ (KL Rahul)ను తప్పించాలని నిర్ణయించింది. రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో చేరాడు. 

వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ను రూ. 27 కోట్ల భారీ బిడ్‌తో కొనుగోలుచేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో నే అత్యంత ఖరీదైన ఒప్పందంగా రికార్డ్ నెలకొల్పింది.

ఇంకా వేలంలో డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్ మరియు మిచెల్ మార్ష్ వంటి విదేశీ ఆటగాళ్ల ను జట్టులో చేర్చుకుంది. వీరు కాక అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాష్ దీప్ వంటి వారిని కూడా తీసుకున్నారు. 

విధ్వంసకర ఆటగాళ్లు.. ఫైనల్‌ చేరేనా?
రిషబ్ పంత్‌తో పటు విధ్వంసకర ఆటగాళ్లుగా పేరుపొందిన మాథ్యూ బ్రీట్జ్కే, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లు ఉన్నందున లక్నో జట్టు బ్యాటింగ్ ఫైర్ పవర్ పూర్తి స్థాయిలో ఉందని చెప్పవచ్చు.

ఇంకా ఆల్ రౌండర్లు మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్ జట్టు కు సమతుల్యతను తెస్తారు. అవేష్ ఖాన్, మోసిన్ ఖాన్, రవి బిష్ణోయ్ నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ ఏ బ్యాటింగ్ లైనప్‌నైనా కూల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ భారీ మార్పులు తర్వాత ఇప్పుడు రిషబ్ పంత్ నాయకత్వంలో ఐపీఎల్ ఫైనల్‌కి చేరాలని లక్నో ఆశిస్తోంది.

గంభీర్‌ వెళ్లిపోయిన తర్వాత
అలాగే, 2024 సీజన్ ప్రారంభంలో మెంటార్‌ గౌతమ్ గంభీర్ జట్టును విడిచిపెట్టి కోల్‌కతాలో చేరాడు. గంభీర్ రెండు సీజన్ లలో లక్నో జట్టుకు మెంటార్ గా పనిచేసాడు. ఇప్పుడు అతడి స్థానంలో దక్షిణాఫ్రికా లెజెండ్ లాన్స్ క్లూసెనర్‌ను అసిస్టెంట్ కోచ్‌గా చేర్చుకోవడం ద్వారా కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేసింది. 

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జస్టిన్ లాంగర్ నాయకత్వంలో క్లూసెనర్ నైపుణ్యం ఉండటంతో, లక్నో చివరి అడ్డంకులను అధిగమించి రాబోయే సీజన్‌లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు లో ప్రధాన ఆటగాళ్లు
రిషబ్ పంత్
లక్నో సూపర్ జెయింట్స్ బిడ్డింగ్ పోరులో విజయం సాధించి, రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఈ చారిత్రాత్మక బిడ్‌లో గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, పంత్‌ను టోర్నమెంట్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిపింది. పంత్ చేరికతో లక్నో వ్యూహం, స్వరూపం పూర్తిగా మారే అవకాశముంది.

నికోలస్ పూరన్
ఈ వెస్టిండీస్ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ తన అసాధారణ ప్రతిభ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. అందుకే లక్నో ఈ ఆటగాడ్ని వేలానికి ముందే రెటైన్ చేసుకుంది. 76 ఐపీఎల్ మ్యాచ్ లలో పూరన్ 160 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 1,769 పరుగులు చేశాడు, తొమ్మిది అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. అతని అపార సామర్థ్యం కారణంగా జట్టులో కీలకమైన ఆటగాడనడంలో సందేహం లేదు.

డేవిడ్ మిల్లర్
మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసే డేవిడ్ మిల్లర్ ఇప్పటికే మ్యాచ్ విన్నర్గా నిరూపించుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 130 ఐపీఎల్ మ్యాచ్ లలో 13 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో దాదాపు 140 స్ట్రైక్ రేట్ తో 2,924 పరుగులు చేశాడు.

మయాంక్ యాదవ్
మయాంక్ యాదవ్ బౌలింగ్లో లక్నోకి కీలకమైన ఆటగాడిగా ఉండే అవకాశముంది. లక్నో రూ. 11 కోట్లకు మయాంక్ యాదవ్ ను కొనుగోలు చేసింది. వేగం, వైవిధ్యం మయాంక్ సొత్తు. కొత్త బంతితో పాటు డెత్ బౌలింగ్‌లో కూడా మయాంక్ బాగా రాణించగలనని ఇప్పటికే నిరూపించాడు.

ఆయుష్ బదోని
లక్నో జట్టుతో చేరినప్పటి నుంచి ఆయుష్ బదోని తన క్రికెట్ కెరీర్‌లో భారీ పురోగతి సాధించాడు. 25 ఏళ్ల ఈ స్టైలిష్ బ్యాటర్ 2022 సీజన్‌లో రెండు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడటం ద్వారా ఫ్రాంచైజీపై తనదైన  ముద్ర వేశాడు. అయితే, టోర్నమెంట్ కొనసాగే కొద్దీ అతని ఫామ్ క్షీణించింది. కొద్దిగా నిలకడ తగ్గినప్పటికీ లక్నో అతన్ని రెటైన్ చేయాలని నిర్ణయించింది.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొసిన్ ఖాన్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, అవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుయల్, ఆకాష్ దీప్, హిమ్మత్ సింగ్, ఎం. సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్, ప్రిన్స్ యాదవ్‌,  యువరాజ్ చౌదరి, రాజవర్ధన్ హంగర్గేకర్, షెహబాజ్‌ అహ్మద్‌,  షమార్‌ జోసెఫ్‌, అర్షిన్ కులకర్ణి, మాథ్యూ బ్రీట్జ్కే.
 

చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్‌ పాండ్యా
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement