
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెమినిదవ ఎడిషన్ ఆరంభానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో శనివారం (మార్చి 22) ఐపీఎల్-2025కి తెరలేవనుంది. ఇక ఈ సీజన్‌కు ముందు మెగా వేలం జరగడంతో జట్లలో చాలా మార్పులే చోటుచేసుకున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్ప.. మిగిలిన ఐదు జట్లు తమ కెప్టెన్లను కూడా మార్చేశాయి.
లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant) కోసం రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు ఖర్చు చేసి.. అతడిని తమ సారథిగా నియమించుకుంది.
మరోవైపు.. పంజాబ్ కింగ్స్ కూడా ఈసారి కెప్టెన్ కోసం భారీగానే ఖర్చుపెట్టింది. భారత జట్టు మిడిలార్డర్ స్టార్, ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ క్రమంలో ఈ ఇద్దరు టీమిండియా స్టార్లు క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లుగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మరి మిగిలిన జట్ల కెప్టెన్లు, వారి జీతాలు ఈసారి ఎలా ఉన్నాయో చూద్దామా?
కోల్‌కతా నైట్ రైడర్స్
2012, 2014 2024లో చాంపియన్‌గా నిలిచిన జట్టు. గతేడాది తమకు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను వదులుకున్న కేకేఆర్.. ఈసారి అనూహ్య రీతిలో ఓ వెటరన్ ప్లేయర్‌ను తమ కెప్టెన్‌గా నియమించింది.
మెగా వేలం-2025లో తొలి రౌండ్‌లో అమ్ముడుపోకుండా మిగిలి పోయిన అజింక్య రహానేను రూ. 1.5 కోట్లకు కొని.. పగ్గాలు అప్పగించింది. అతడికి డిప్యూటీగా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు బాధ్యతలు ఇచ్చింది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో అతి తక్కువ జీతం అందుకున్న కెప్టెన్ రహానేనే కావడం గమనార్హం. అన్నట్లు వెంకటేశ్ అయ్యర్ జీతం రూ.23.75 కోట్లు.
సన్‌రైజర్స్ హైదరాబాద్
గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈసారీ తమ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్‌ను కొనసాగించింది. అయితే, గతేడాది అతడికి రూ. 20.50 కోట్ల మేర ముట్టజెప్పిన ఫ్రాంఛైజీ.. ఈసారి రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకోవడం గమనార్హం.
రాజస్తాన్ రాయల్స్
ఐపీఎల్ తొట్టతొలి విజేతగా చరిత్ర సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ గత కొన్నేళ్లుగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ సామ్సన్‌ను తమ కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. ఈసారి కూడా ‘పింక్’ జట్టును సంజూ ముందుండి నడిపించనున్నాడు. ఇందుకోసం రూ. 18 కోట్ల జీతం అందుకుంటున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఏకంగా ఐదు ట్రోఫీలు గెలిచిన చెన్నై.. గతేడాది నుంచి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడుతోంది. ఈసారీ అతడినే కెప్టెన్‌గా కొనసాగించిన సీఎస్‌కే.. ఇందుకోసం అతడిని రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్
ఈసారి కెప్టెన్‌ను మార్చిన ఫ్రాంఛైజీల జాబితాలో ఢిల్లీ ఒకటి. గతేడాది రిషభ్ పంత్ కెప్టెన్సీలో ఆడిన ఢిల్లీ.. ఈసారి టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. ఇందుకోసం తమ కెప్టెన్‌కు రూ. 16.50 కోట్ల మేర చెల్లిస్తోంది.
గుజరాత్ టైటాన్స్
అరంగేట్ర సీజన్‌లో తమకు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యా జట్టును వీడిన తర్వాత.. అంటే గతేడాది టీమిండియా నయా సూపర్ స్టార్ శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించింది. వేలానికి ముందు గిల్‌ను రూ. 16.5 కోట్లకు రిటైన్ చేసుకున్న గుజరాత్ ఈసారీ అతడినే సారథిగా కొనసాగిస్తోంది.
ముంబై ఇండియన్స్
ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కాదని.. గతేడాది హార్దిక్ పాండ్యాను ఏరికోరి కెప్టెన్‌ను చేసిన ముంబై ఘోర పరాభవం చవిచూసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. అయితే, ఈసారీ అతడికి మరో అవకాశం ఇచ్చిన అంబానీల యాజమాన్యంలోని ముంబై... పాండ్యాను రూ. 16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ఎంత క్రేజ్ ఉన్నా ఒక్క టైటిల్ కూడా గెలవని జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. ఈసారి ఊహించని రీతిలో రజత్ పాటిదార్‌ను సారథిగా నియమించింది. విరాట్ కోహ్లి మరోసారి పగ్గాలు చేపడతాడనే ప్రచారం జరిగగా.. బెంగళూరు ఫ్రాంఛైజీ ప్రకటనతో అది జరగదని తేలింది.
అన్నట్లు వేలానికి ముందు రూ. 11 కోట్లకు పాటిదార్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఐపీఎల్-2025 కెప్టెన్లలో రహానే తర్వాత తక్కువ జీతం ఆర్సీబీ సారథికే!

చదవండి: వాళ్లను చూస్తేనే చిరాకు.. బుమ్రా, రబడ మాత్రం వేరు: డేల్ స్టెయిన్
Comments
Please login to add a commentAdd a comment