IPL 2022 Auction: అక్షరాలా రూ. 551 కోట్ల 70 లక్షలు | IPL Auction 2022 Latest Updates: 10 Franchises Splurge Rs 551,70,00,000 Over 2 Days | Sakshi
Sakshi News home page

IPL 2022 Auction: అక్షరాలా రూ. 551 కోట్ల 70 లక్షలు

Published Mon, Feb 14 2022 4:56 AM | Last Updated on Mon, Feb 14 2022 7:55 AM

IPL Auction 2022 Latest Updates: 10 Franchises Splurge Rs 551,70,00,000 Over 2 Days - Sakshi

ఐపీఎల్‌కు ఆర్థిక మాంద్యం ఉండదని మరోసారి రుజువైంది. రెండు రోజుల పాటు సాగిన లీగ్‌ వేలంలో క్రికెటర్లను సొంతం చేసుకునేందుకు 10 ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీ పడ్డాయి. గరిష్టంగా 217 స్థానాలకు ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉండగా అన్ని జట్లు కలిపి 204 మందితో సరిపెట్టాయి. ఇందులో భారత్‌ నుంచి 137 మంది ఉండగా... విదేశీ క్రికెటర్లు 67 మంది ఉన్నారు. 2022 సీజన్‌ వేలం కోసం అన్ని టీమ్‌లు కలిపి రూ. 551 కోట్ల 70 లక్షలు ఖర్చు చేయడం విశేషం.

ఎప్పటిలాగే కొందరు ఆటగాళ్లకు అంచనాలకు మించిన అనూహ్య ధర పలకగా... మరికొందరు స్టార్లు ఆశ్చర్యకరంగా తక్కువ విలువతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించకపోవడంతో మరికొందరు పెద్ద క్రికెటర్లు కూడా నిరాశగా చూస్తుండిపోవడం కూడా సహజ పరిణామంలా కనిపించింది. రెండో రోజు ఆదివారం సాగిన వేలంలో ఇంగ్లండ్‌ క్రికెటర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ను అత్యధికంగా రూ. 11 కోట్ల 50 లక్షలకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది.

ఓవరాల్‌గా నలుగురు హైదరాబాద్‌ క్రికెటర్లు నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ, సీవీ మిలింద్, భగత్‌ వర్మ, రాహుల్‌ బుద్ధిలకు... ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు అంబటి రాయుడు, కేఎస్‌ భరత్, అశ్విన్‌ హెబర్‌లను వివిధ ఫ్రాంచైజీలు వేలంలో ఎంచుకున్నాయి. వేలానికే ముందే సిరాజ్‌ను బెంగళూరు ఎంచుకోగా... ఆశ్చర్యకరంగా టెస్టు క్రికెటర్‌ హనుమ విహారి పేరు కూడా వేలంలో వినిపించలేదు. వేలంతో క్రికెటర్ల విలువపై ఒక అంచనా ఏర్పడగా ఏప్రిల్‌–మేలో జరిగే టోర్నీలో ఆటగాళ్ల అసలు సత్తా ఏమిటో బయటపడుతుంది.   

బెంగళూరు: దక్షిణాఫ్రికా బ్యాటర్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌తో వేలం మొదలైంది. రూ. 1 కోటి బేస్‌ప్రైస్‌ కాగా, ముంబైతో పోటీ పడి చివరకు సన్‌రైజర్స్‌ దక్కించుకుంది. భారత ఆటగాడు అజింక్య రహానే కోసం ఎవరూ పోటీ పడకపోగా, కనీస ధర రూ.1 కోటితోనే కోల్‌కతా సొంతం చేసుకుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న మలాన్‌ను ఎవరూ పట్టించుకోలేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు లబుషేన్, ఫించ్, భారత టెస్టు బ్యాటర్‌  పుజారా కోసం ఎవరూ ఆసక్తి చూపించకపోగా...గత సీజన్‌ వరకు కోల్‌కతాకు కెప్టెన్‌గా ఉన్న ఇయాన్‌ మోర్గాన్‌ కోసం కూడా ఏ జట్టూ ముందుకు రాలేదు.  

► ధాటిగా ఆడగల విండీస్‌ బ్యాటర్‌ ఒడెన్‌ స్మిత్‌ కోసం పోటీ బాగా సాగింది. రూ. 5.75 కోట్ల వరకు వచ్చి సన్‌రైజర్స్‌ తప్పుకోగా, రూ. 6 కోట్లకు పంజాబ్‌ సొంతం చేసుకుంది. ఇటీవల సొంతగడ్డపై భారత్‌ను ఇబ్బంది పెట్టిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాన్సెన్‌ కోసం అతని తొలి ఐపీఎల్‌ జట్టు ముంబై రూ. 4 కోట్ల వరకు బాగా ఆసక్తి చూపిం చింది. అయితే మరో 20 లక్షలు జోడించి హైదరాబాద్‌ అతడిని తీసుకుంది. గత సీజన్‌లో రూ. 9.25 కోట్లకు అమ్ముడుపోయిన కృష్ణప్ప గౌతమ్‌కు ఈ సారి రూ. 90 లక్షలు దక్కడం గమనార్హం.  

► అండర్‌–19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టు కెప్టెన్‌ యష్‌ ధుల్‌ను అతని సొంత నగరం ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు రూ. 50 లక్షలకు ఎంచుకుంది. ప్రపంచకప్‌ ఫైనల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన అంగద్‌ రాజ్‌ బావాను పంజాబ్‌ సొంతం చేసుకుంది.  

► ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ కోసం భారీ పోటీ సాగింది. గాయంతో అతను 2022లో ఆడే అవకాశం లేకపోయినా వచ్చే సీజన్లను దృష్టిలో పెట్టుకొని టీమ్‌లు పోటీ పడ్డాయి. రాజస్తాన్, హైదరాబాద్‌లతో పోటీ పడి చివరకు ముంబై రూ. 8 కోట్లకు దక్కించుకుంది.  

► జమ్ము కశ్మీర్‌కు చెందిన 21 ఏళ్ల రసిఖ్‌ సలామ్‌ను రూ. 20 లక్షల బేస్‌ప్రైస్‌కు కోల్‌కతా  ఎంచుకుంది. 2019లో ముంబై ఇండియన్స్‌ తరఫున అతను ఒకే ఒక మ్యాచ్‌ ఆడాడు. అయితే ఆ తర్వాత వయసు తప్పుగా చూపించాడంటూ బీసీసీఐ అతనిపై రెండేళ్ల నిషేధం విధించింది. ముంబై ఇండియన్స్‌ రెండేళ్ల పాటు అతని బాధ్యత తీసుకొని రసిఖ్‌ను ముంబైకి రప్పించింది. అన్ని సౌకర్యాలూ కల్పించి ప్రాక్టీస్‌కు అవకాశం ఇస్తూ స్థానిక మ్యాచ్‌లు కూడా ఆడించింది. అయితే వేలంలో అతని పేరు వచ్చినప్పుడు మాత్రం ముంబై అసలు స్పందించనే లేదు!


లివింగ్‌స్టోన్‌కు రూ. 11 కోట్ల 50 లక్షలు
విధ్వంసక బ్యాటింగ్‌తో పాటు అటు ఆఫ్‌స్పిన్, ఇటు లెగ్‌స్పిన్‌ బౌలింగ్‌ వేయగల నైపుణ్యం లివింగ్‌స్టోన్‌ సొంతం. 165 టి20 మ్యాచ్‌లలో 144.29 స్ట్రయిక్‌రేట్‌ కాగా 2 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. బౌలింగ్‌లోనూ మెరుగైన 7.86 ఎకానమీని అతను నమోదు చేశాడు. గత ఐపీఎల్‌లో రూ. 75 లక్షలకు రాజస్తాన్‌ తరఫున ఆడిన అతను 5 మ్యాచ్‌లలో 42 పరుగులే చేశాడు. అయితే ఏడాది కాలంగా అతని ఆటతీరు అద్భుతంగా మారిపోయింది. 2021లో టి20ల్లో 86 సిక్స్‌లు బాదిన అతను పాకిస్తాన్‌పై 43 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. ఓపెనింగ్‌ నుంచి ఏడో స్థానం వరకు ఎక్కడైనా ఆడగలడు.
 

లివింగ్‌స్టోన్‌ ఆట గురించి బాగా తెలిసిన పంజాబ్‌ కింగ్స్‌ అనలిస్ట్‌ డాన్‌ వెస్టన్‌ కూడా అతడిని సొంతం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. రూ. 1 కోటి కనీస ధరతో మొదలైన లివింగ్‌స్టోన్‌ బిడ్డింగ్‌ ఆ తర్వాత దూసుకుపోయింది. వేలంలో ఒకరిని మించి మరొకరు మొత్తం ఐదు జట్లు అతని కోసం పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్‌ రూ. 11 కోట్ల 50 లక్షలకు లివింగ్‌స్టోన్‌ను గెలుచుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో స్టోక్స్‌ (రూ. 14 కోట్ల 50 లక్షలు), స్టోక్స్‌ (రూ. 12 కోట్ల 50 లక్షలు), టైమల్‌ మిల్స్‌ (రూ. 12 కోట్లు) తర్వాత అత్యధిక మొత్తం పలికిన ఇంగ్లండ్‌ ఆటగాళ్ల జాబితాలో అతను నాలుగో స్థానంలో నిలిచాడు.  
 

సింగపూర్‌ ఆటగాడు టిమ్‌ డేవిడ్‌ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 85 మ్యాచ్‌ల టి20 కెరీర్‌లో 159.39 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసిన డేవిడ్‌ గత ఏడాది బెంగళూరు టీమ్‌తో ఉన్నాడు. రూ.40 లక్షలతో ఢిల్లీ బిడ్‌ మొదలు పెట్టగా మరో నాలుగు జట్లు బరిలో నిలిచాయి. చివరకు అతడిని ముంబై ఎంచుకుంది. ముంబై ఇండియన్స్‌ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడికి ఇచ్చిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. అతను ఐదు లేదా ఆరో స్థానంలో ఆడతాడని ఓనర్‌  అంబానీ ప్రకటించాడు. టిమ్‌ డేవిడ్‌ తండ్రి రోడరిగ్‌ డేవిడ్‌ది ఆస్ట్రేలియా కాగా, ఉద్యోగరీత్యా అతను సింగపూర్‌కు వలస వచ్చాడు. రోడరిక్‌ కూడా సింగపూర్‌ జాతీయ జట్టు తరఫున ఆడాడు.

సారీ రైనా..!
205 మ్యాచ్‌లు... 5,528 పరుగులు... ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానం... అద్భుత ప్రదర్శనలతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయాల్లో కీలక పాత్ర...  ‘చిన్న తలా’ సురేశ్‌ రైనా సూపర్‌  కెరీర్‌ ముగిసినట్లే. వేలంలో రైనాను తీసుకోవడానికి చెన్నై సహా ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. ఇన్నేళ్లలో చెన్నైపై నిషేధం ఉన్న రెండేళ్లు మినహా (అప్పుడు గుజరాత్‌కు) మరే ఫ్రాంచైజీకి అతను ఆడలేదు. అతను రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడకపోవడం కూడా ప్రధాన కారణం. కనీసం బేస్‌ప్రైస్‌ వద్ద కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఈ సీజన్‌ వేలంలో అమ్ముడుపోని కీలక ఆటగాళ్లలో స్టీవ్‌ స్మిత్, షకీబ్‌ అల్‌ హసన్, ఇయాన్‌ మోర్గాన్, ఇషాంత్‌ శర్మ, షమ్సీ, కేదార్‌ జాదవ్, గ్రాండ్‌హోమ్, గప్టిల్, కార్లోస్‌ బ్రాత్‌వైట్, పుజారా, హనుమ విహారి తదితరులు ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement