కావ్యా మారన్(PC: SRH X)- ప్రీతి జింటా(PC: PBKS X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 తొలిరోజు మెగా వేలం విజయవంతంగా ముగిసింది. ఆక్షనీర్ మల్లికా సాగర్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆదివారం నాటి వేలంపాటను సమర్థవంతంగా పూర్తి చేశారు. ఇక మొదటి రోజు ఫ్రాంఛైజీలు మొత్తంగా 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరికోసం తమ పర్సుల నుంచి ఓవరాల్‌గా రూ. 467.95 కోట్లు ఖర్చు చేశాయి.
ప్రత్యేక ఆకర్షణగా ఆ ముగ్గురు
ఇదిలా ఉంటే.. ఎప్పటిలాగానే ఈసారీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్, ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో తమ వ్యూహాలను అమలు చేసే క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలకు గట్టిపోటీనిచ్చారు.
అందుకు కారణం మాత్రం కావ్యానే!
ఈ నేపథ్యంలో కావ్యా మారన్- ప్రీతి జింటా ఓ ఆటగాడి కోసం తగ్గేదేలే అన్నట్లు పోటాపోటీగా ధర పెంచుతూ పోవడం హైలైట్‌గా నిలిచింది. అయితే, ఆఖరికి కావ్యా తప్పుకోగా.. సదరు ప్లేయర్ ప్రీతి జట్టు పంజాబ్‌కు సొంతమయ్యాడు. కానీ.. పంజాబ్ ఇందుకోసం భారీ ధరను చెల్లించాల్సి వచ్చింది. అందుకు కారణం మాత్రం కావ్యానే!
ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరా అంటారా?.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్. నిజానికి ఈ పేస్ బౌలర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బిడ్ వేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ సైతం రంగంలోకి దిగాయి.
రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా
అయితే, ఊహించని రీతిలో రేసులోకి ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ అర్ష్‌దీప్ ధరను ఏకంగా రూ. 15.75 కోట్లకు పెంచింది. దీంతో మిగతా ఫ్రాంఛైజీలు పోటీ నుంచి తప్పుకోగా.. ఆక్షనీర్ మల్లికా సాగర్.. పంజాబ్ తమ పాత ఆటగాడి కోసం రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించుకుంటుందేమో అడిగారు.
ఇందుకు సమ్మతించిన పంజాబ్ అర్ష్‌దీప్‌నకు అంతే మొత్తం చెల్లిస్తామని చెప్పింది. అయినా కావ్యా మారన్ వెనక్కి తగ్గలేదు. ఏకంగా రెండున్నర కోట్ల మేర పెంచింది. అయితే, పంజాబ్ మాత్రం అర్ష్‌దీప్‌ను వదులుకోలేకపోయింది. ఫలితంగా ఫైనల్‌గా సన్‌రైజర్స్ వేసిన బిడ్‌కు సమానంగా రూ. 18 కోట్లు చెల్లించి అర్ష్‌దీప్‌ను సొంతం చేసుకుంది.
క్యాష్ రిచ్ లీగ్‌లో రూ. 18 కోట్ల భారీ ధర
ఫలితంగా అర్ష్‌దీప్‌నకు వేలంలో సరైన విలువ, తగిన జట్టు లభించాయి. వరుసగా ఆరు సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్‌కే అతడు వచ్చే సీజన్‌లో ఆడనున్నాడు. అంతేకాదు.. క్యాష్ రిచ్ లీగ్‌లో రూ. 18 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన భారత తొలి ఆటగాడిగా అర్ష్‌దీప్ నిలిచాడు. ఏదేమైనా కావ్యా.. ప్రీతితో పోటీపడటం వల్ల అర్ష్‌దీప్‌పై కోట్ల వర్షం కురిసిన మాట వాస్తవం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఐపీఎల్ 2025 తొలి రోజు వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..!
Comments
Please login to add a commentAdd a comment