సూపర్‌ సన్‌దీప్‌.. బెంగళూరు విలవిల | IPL, Sunrisers Hyderabad, Royal Challengers Bangalore | Sakshi
Sakshi News home page

సూపర్‌ సన్‌దీప్‌.. బెంగళూరు విలవిల

Published Sun, Nov 1 2020 5:04 AM | Last Updated on Sun, Nov 1 2020 9:55 AM

IPL, Sunrisers Hyderabad, Royal Challengers Bangalore - Sakshi

హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌ దారిలో పడింది. ముందుకెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో  సీమర్‌ సందీప్‌ శర్మ (2/20) చెలరేగి బెంగళూరు పని పట్టాడు. మరోవైపు కోహ్లి సేన ‘హ్యాట్రిక్‌’ పరాజయాలతో 14 పాయింట్ల దగ్గరే ఆగిపోయింది. ఇప్పటికైతే రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఆఖరి మ్యాచ్‌ ఫలితంపైనే ఆర్‌సీబీ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

షార్జా: వారెవ్వా సన్‌రైజర్స్‌... ఈ మ్యాచ్‌ టాస్‌ వేయక ముందు పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌  ఏడో స్థానంలో ఉంది. హోల్డర్‌ సిక్సర్‌తో విన్నింగ్‌ షాట్‌ కొట్టగానే టాప్‌లో నాలుగో స్థానానికి వచ్చేసింది. ఈ ఫలితం జట్టు రాతను ఇంతలా మార్చేసింది. ప్లేఆఫ్స్‌కు చేరువ చేసింది. శనివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 5 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు చేసింది. ఫిలిప్‌ (31 బంతుల్లో 32; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సందీప్‌ శర్మ (2/20) బెంగళూరును కోలుకోలేనంత దెబ్బతీశాడు. తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 14.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ సాహా (32 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, చివర్లో జేసన్‌ హోల్డర్‌ (10 బంతుల్లో 26 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌) ధనాధన్‌గా ముగించేశాడు.  

కోహ్లి విఫలం...
టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న వార్నర్‌ నిర్ణయానికి సీమర్‌ సందీప్‌ శర్మ న్యాయం చేశాడు. అతని దెబ్బకు బెంగళూరు ఆట ప్రారంభమైన మూడో ఓవర్‌లో కష్టాల్లో పడింది. మ్యాచ్‌ సాగే కొద్దీ ఆ కష్టాల్లోనే చిక్కుకుపోయింది. సందీప్‌ శర్మ లైన్‌ అండ్‌ లెంత్‌తో బౌలింగ్‌ చేసి తొలి ఓవర్లో మూడే పరుగులిచ్చాడు. తన రెండో ఓవర్‌ (ఇన్నింగ్స్‌ 3వ)లో ఫామ్‌లో ఉన్న దేవ్‌దత్‌ పడిక్కల్‌ (5)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీన్నుంచి రాయల్‌ చాలెంజర్స్‌ తేరుకోక ముందే మరో దెబ్బ తీశాడు.

సందీపే తన మరుసటి ఓవర్లో కెప్టెన్‌ కోహ్లి (7)ని కూడా అవుట్‌ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 28/2. ఇక తర్వాత ఏబీ డివిలియర్స్‌ (24 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్‌)  వచ్చినా, మోరిస్‌ (3)) దిగినా, గుర్‌కీరత్‌ (24 బంతుల్లో 15 నాటౌట్‌)) అజేయంగా నిలిచినా చేసేదేమీ లేకపోయింది. ఆడేవారిని నిలువనీకుండా... నిలిచిన వారిని ఆడనీకుండా సన్‌రైజర్స్‌ బౌలర్లు చక్కగా కట్టడి చేశారు.

ఆరంభం నుంచి అందరికంటే మెరుగ్గా ఆడుతున్న ఓపెనర్‌ ఫిలిప్‌  పెవిలియన్‌ చేరాక బెంగళూరు కష్టాలు రెట్టింపు అయ్యాయి. రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌లో భారీషాట్‌కు ప్రయత్నించిన ఫిలిప్‌ డీప్‌ మిడ్‌వికెట్‌లో మనీశ్‌ చేతికి చిక్కాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (18 బంతుల్లో 21; 2 ఫోర్లు), గుర్‌కీరత్‌ సింగ్‌ కాసేపు నిలబడటంతో 17వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. సుందర్‌ అవుటయ్యాక సన్‌రైజర్స్‌ పేసర్‌ హోల్డర్‌... ఒకే ఓవర్లో హిట్టర్‌ మోరిస్‌ (3)తో పాటు ఉదన (0)ను ఔట్‌ చేయడంతో ఆఖరి మెరుపులు కరువయ్యాయి.

డివిలియర్స్‌ క్యాచ్‌ వదిలేసినా...
అప్పటికే పడిక్కల్, కోహ్లి అవుటయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్‌ 4 పరుగుల వద్దే అవుట్‌ కావాల్సింది. నదీమ్‌ తన తొలి ఓవర్లోనే (ఇన్నింగ్‌ 7వ) ఆ అవకాశాన్ని జారవిడిచాడు. ఏడో ఓవర్‌ ఆఖరి బంతిని ఏబీ నేరుగా బౌలర్‌ దిశగా ఆడాడు. నదీమ్‌ ఆ రిటర్న్‌ క్యాచ్‌ను వదిలేశాడు. తిరిగి 3 ఓవర్ల తర్వాత తనే డివిలియర్స్‌ను పెవిలియన్‌ చేర్చాడు. ‘మిస్టర్‌ 360’ బ్యాట్స్‌మన్‌ ప్రమాదకరంగా మారకముందే అతన్ని 24 పరుగుల వద్ద అవుట్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ ఊపిరి పీల్చుకుంది. దీంతో ఇన్నింగ్స్‌లోనే కాస్త మెరుగైన 43 పరుగుల భాగస్వామ్యం కూడా ముగిసింది.

వార్నర్‌ అవుటైనా...
స్వల్ప లక్ష్యఛేదనే అయినా... కెప్టెన్, ఓపెనర్‌ వార్నర్‌ (8) రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. సుందర్‌ అతన్ని పెవిలియన్‌ చేర్చడంతో బెంగళూరు శిబిరంలో ఎక్కడలేని ఆనందాన్ని నింపింది. కానీ మరో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌) బెంగళూరు బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కోవడంతో బెంగళూరు ఆనందం అంతలోనే ఆవిరైంది. 5.2 ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు 50 పరుగులకు చేరింది.

తొలివికెట్‌కు సరిగ్గా 50 పరుగులు జోడించాక జట్టు స్కోరు 60 పరుగుల వద్ద ధాటిగా ఆడే ప్రయత్నంలో పాండే అవుటయ్యాడు. ఇతన్ని స్పిన్నర్‌ చహల్‌ పెవిలియన్‌ చేర్చాడు. విలియమ్సన్‌ జతకాగా కాసేపటికే కుదురుగా ఆడుతున్న  సాహాను కూడా చహలే బోల్తా కొట్టించాడు. ఉదాన 13వ ఓవర్‌ తొలిబంతికి విలియమ్సన్‌ (8) అవుటయ్యాడు. 87 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా అతను వెనుదిరిగాడు. అప్పుడు సన్‌రైజర్స్‌ గెలిచేందుకు 34 పరుగుల దూరంలో ఉన్నా... బంతులు (48) బోలెడున్నాయి.

అయితే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ తాలూకు కష్టాలు హైదరాబాద్‌ కళ్లముందు కదిలాయి. ఈ దశలో వరుసలో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హోల్డర్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఉదన బౌలింగ్‌లోనే లాంగాన్‌లో సిక్స్‌ కొట్టాడు. తర్వాత సైనీ బౌలింగ్‌ను ఓ పట్టుపట్టాడు. హోల్డర్‌ 6, 4 కొట్టగా, అభిషేక్‌ శర్మ (8) మరో సిక్సర్‌ కొట్టి తర్వాత బంతిని కూడా సిక్సర్‌గా మలిచేందుకు భారీ షాట్‌ ఆడాడు. కానీ లాంగాఫ్‌లో గుర్‌కీరత్‌ చేతికి చిక్కాడు. 36 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన తరుణంలో చహల్‌ వేసిన 15వ ఓవర్‌ తొలి బంతినే సిక్సర్‌గా తరలించి మ్యాచ్‌ను హోల్డర్‌ ఎంతో ముందుగానే ముగించేశాడు.

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: ఫిలిప్‌ (సి) పాండే (బి) రషీద్‌ ఖాన్‌ 32; దేవదత్‌ (బి) సందీప్‌ 5; కోహ్లి (సి) అభిషేక్‌ (బి) నదీమ్‌ 24; సుందర్‌ (సి అండ్‌ బి) నటరాజన్‌ 21; గురుకీరత్‌ సింగ్‌ (నాటౌట్‌) 15; మోరిస్‌ (సి) వార్నర్‌ (బి) హోల్డర్‌ 3; ఉదాన (సి) విలియమ్సన్‌ (బి) హోల్డర్‌ 0; సిరాజ్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 11;
మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 120.
వికెట్ల పతనం: 1–13, 2–28, 3–71, 4–76, 5–106, 6–113, 7–114.
బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4–0–20–2, హోల్డర్‌ 4–0–27–2, నటరాజన్‌ 4–0–11–1, నదీమ్‌ 4–0–35–1, రషీద్‌ ఖాన్‌ 4–0–24–1.  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) ఉదాన (బి) సుందర్‌ 8; సాహా (స్టంప్డ్‌) డివిలియర్స్‌ (బి) చహల్‌ 39; మనీశ్‌ పాండే (సి) మోరిస్‌ (బి) చహల్‌ 26; విలియమ్సన్‌ (సి) కోహ్లి (బి) ఉదాన 8; అభిషేక్‌ శర్మ (సి) గురుకీరత్‌ (బి) సైనీ 20; హోల్డర్‌ (నాటౌట్‌) 26; సమద్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (14.1 ఓవర్లలో 5 వికెట్లకు) 121.
వికెట్ల పతనం: 1–10, 2–60, 3–82, 4–87, 5–114.
బౌలింగ్‌: మోరిస్‌ 2–0–19–0, సుందర్‌ 3–0–21–1, సైనీ 2–0–30–1, సిరాజ్‌ 1–0–12–0, చహల్‌ 3.1–0–19–2, ఉదాన 3–0–20–1.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement