దుబాయ్: ప్రేక్షకులు లేరన్న లోటే ఉంది కానీ... ఐపీఎల్–2020 టోర్నీలో బోలెడంత థ్రిల్ రోజూ అందుతోంది. రెండో మ్యాచ్ ‘సూపర్’దాగా సాగితే... మూడో మ్యాచ్ ‘బౌల్డ్’ మలుపులు తిరిగింది. పటిష్టమనుకున్న స్కోరే తర్వాత పలుచన అయింది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్ సాగిలపడిపోయింది. సోమవారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి బోణీ కొట్టింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు), డివిలియర్స్ (30 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో మెరిపించారు. లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్ 19.4 ఓవర్లలో 153 పరుగుల వద్ద ఆలౌటైంది. బెయిర్‌స్టో (43 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ చహల్ 3 వికెట్లు తీశాడు. గాయాల తాకిడి కొనసాగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష చీలమండ గాయంతో మైదానం వీడాడు.
అదిరే ఆరంభం...
బెంగళూరుకు ఓపెనర్లు దేవ్‌దత్, ఫించ్ (27 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అదిరే ఆరంభం ఇచ్చారు. భువనేశ్వర్ తొలి ఓవర్‌ను జాగ్రత్తగా ఎదుర్కొన్న దేవ్‌దత్ రెండో ఓవర్ నుంచే చెలరేగాడు. సందీప్ వేసిన ఆ ఓవర్లో 2 బౌండరీలు బాదిన దేవ్‌దత్... నటరాజన్ ఓవర్లో డోస్ పెంచాడు. వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. మరోవైపు ఫించ్... విజయ్ శంకర్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదడంతో జట్టు స్కోరు వేగంగా దూసుకెళ్లింది. రైజర్స్ కెప్టెన్ వార్నర్... రషీద్ ఖాన్‌ను ప్రయోగించినా లాభం లేకపోయింది. ఫించ్ వరుసగా 4, 6తో జోరు పెంచాడు. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 86/0తో ఉంది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ఎట్టకేలకు 11వ ఓవర్లో దేవ్‌దత్‌ను బౌల్డ్ చేయడం ద్వారా విజయ్ విడదీశాడు. ఆ మరుసటి ఓవర్ తొలి బంతికి ఫించ్‌ను అభిషేక్ ఎల్బీడబ్ల్యూ చేయడంతో వరుస బంతుల్లో ఓపెనర్లను కోల్పోయింది.
డివిలియర్స్ ఫిఫ్టీ...
కెప్టెన్ కోహ్లి, డివిలియర్స్ బెంగళూరు స్కోరును పెంచే పనిలో పడ్డారు. బంతుల్ని వృథా చేయకుండా సింగిల్స్, డబుల్స్‌తో చకచకా పరుగులు జతచేశారు. అయితే భారీ షాట్లకు ప్రయత్నిస్తుండగా కోహ్లి (14)) ఆటను నటరాజన్ ముగించాడు. తర్వాత ఆఖరి ఓవర్లలో డివిలియర్స్ మెరుపులు మెరిపించడంతో స్కోరు 150 పరుగులు దాటింది. సందీప్ శర్మ 19వ ఓవర్లో అతను ఎక్స్‌ట్రా కవర్‌లో రెండు వరుస సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్లో ఏబీ రనౌట్ కావడంతో ఆశించిన పరుగులు రాలేదు. బౌలింగ్ వేస్తూ గాయపడిన మార్‡్ష మళ్లీ బ్యాటింగ్‌కు దిగినా బంతి ఆడేసరికే విలవిల్లాడాడు.
రాణించిన బెయిర్‌స్టో...
లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో ఓవర్లోనే కెప్టెన్ వార్నర్ వికెట్‌ను కోల్పోయింది. బెయిర్‌స్టో కొట్టిన షాట్ ఉమేశ్ చేతికి తగిలి వికెట్లను గిరాటేయగా అప్పటికి వార్నర్ క్రీజు బయటే ఉండటంతో అతను రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో బెయిర్‌స్టోకు మనీశ్ పాండే జతయ్యాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలతో రన్‌రేట్ పడిపోకుండా సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. 6.2 ఓవర్లలో జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. ఆ తర్వాత కూడా ఇద్దరు జాగ్రత్త ఆడటంతో పరుగుల రాక సాఫీగా సాగిపోయింది. సగం ఓవర్లు (10) ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 78 పరుగులతో పటిష్టంగానే ఉంది. అయితే తర్వాత మూడు ఓవర్లు కట్టుదిట్టగా వేయడంతో వేగం తగ్గింది. అంతలోనే మనీశ్ పాండే (33 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్)ను చహల్ ఔట్ శాడు. కాసేపటికి ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో స్టెయిన్ క్యాచ్ చేజార్చడంతో బతికిపోయిన బెయిర్‌స్టో 37 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు.
‘క్లీన్‌బౌల్డ్’ మలుపులు...
అనుభవజ్ఞుడైన స్టెయిన్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదిన బెయిర్‌స్టో 13 పరుగులు పిండుకున్నాడు. 15వ ఓవర్ ముగిసేసరికి సన్‌రైజర్స్ స్కోరు 121/2. ఇక ఆఖరి 30 బంతుల్లో 43 పరుగులు చేస్తే సరిపోతుంది. చేతిలో 8 వికెట్లు, క్రీజులో పాతుకుపోయిన బెయిర్‌స్టో ఉన్న హైదరాబాద్‌కు ఇదేమంత కష్టం కానేకాదు. కానీ చహల్ వేసిన 16వ ఓవర్ రైజర్స్‌నే కాదు మొత్తం ఆటనే మలుపు తిప్పింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచిన బెయిర్‌స్టోను క్లీన్‌బౌల్డ్ చేసిన చహల్ ఆ మరుసటి బంతికే విజయ్ శంకర్‌నూ బౌల్డ్ చేయడంతో హైదరాబాద్‌కు అనూహ్య పతనం మొదలైంది.
శివమ్ దూబే కూడా 17వ ఓవర్లో ప్రియమ్ గార్గ్ (12)ను బౌల్డ్ చేయగా... అభిషేక్ శర్మ (7) రెండో పరుగు తీసేక్రమంలో పిచ్ మధ్యలో రషీద్ ఖాన్‌ను ఢీకొట్టుకొని రనౌటయ్యాడు. దీంతో ఆ ఓవర్లో 2 వికెట్లు, సైనీ వేసిన 18వ ఓవర్లోనూ 2 వికెట్లు పడ్డాయి. భువీ (0)తో పాటు రషీద్ (6)లు కూడా క్లీన్‌బౌల్డ్ అయ్యారు. గాయపడిన మార్‡్ష (0) వచ్చీ రాగానే దూబే బౌలింగ్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 121/2తో పటిష్టంగా ఉన్న రైజర్స్ స్కోరు చూస్తుండగానే 143/9గా పతనమైంది. కేవలం 18 బంతుల వ్యవధిలోనే 7 వికెట్లను కోల్పోయింది. ఇందులో ఐదుగురు క్లీన్‌బౌల్డ్ కావడం విశేషం!
దేవ్‌దత్ దూకుడు....
ఓ అంతర్జాతీయ స్టార్, ఆసీస్ కెప్టెన్ (ఫించ్)తో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన దేవ్‌దత్ మెరిశాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో క్రీజులో ఉన్నంతసేపు సన్‌రైజర్స్ బౌలర్లను చితక్కొట్టిన ఈ దేశవాళీ హీరో కోహ్లి సేనకు చక్కని ఆరంభాన్నిచ్చాడు. అతని షాట్లు మైదానంలోని అన్ని ప్లేసింగ్స్‌ను టచ్ చేశాయి. మిడ్ వికెట్, షార్ట్ ఫైన్, కవర్స్, ఎక్స్‌ట్రా కవర్, డీప్ స్క్వేర్‌ల మీదుగా బంతిని బౌండరీలకు తరలించిన తీరు ఆకట్టుకుంది. చూడచక్కని స్ట్రోక్ ప్లేతో స్కోరు బోర్డును బౌండరీలతో స్పీడెక్కించాడు. అతని జోరుకు అవతలి ఎండ్‌లో ఉన్న ఫించ్ కూడా అచ్చెరువొందాడు. ఎక్కువగా కుర్రాడికే స్ట్రయిక్ రొటేట్ చేయగా... దీన్ని అలవోకగా, అనుకూలంగా మార్చుకొని మరింతగా రెచ్చిపోయాడు. బెంగళూరు 5.2 ఓవర్లలో 50 పరుగులను చేరుకుంటే అందులో 36 పరుగులు దేవ్‌దత్‌వే! వ్యక్తిగతంగా తను 36 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: దేవ్‌దత్ (బి) విజయ్ 56; ఫించ్ ఎల్బీడబ్ల్యూ (బి) అభిషేక్ 29; కోహ్లి (సి) రషీద్ (బి) నటరాజన్ 14; డివిలియర్స్ (రనౌట్) 51; దూబే (రనౌట్) 7; ఫిలిప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 163.
వికెట్ల పతనం: 1–90, 2–90, 3–123, 4–162, 5–163.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–25–0, సందీప్ 4–0–36–0, నటరాజన్ 4–0–34–1, మార్‡్ష 0.4–0–6–0, విజయ్ 1.2–0– 14–1, రషీద్ 4–0–31–0, అభిషేక్ 2–0–16–1.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (రనౌట్) 6; బెయిర్‌స్టో (బి) చహల్ 61; మనీశ్ పాండే (సి) సైనీ (బి) చహల్ 34; ప్రియమ్ గార్గ్ (బి) దూబే 12; విజయ్ (బి) చహల్ 0; అభిషేక్ (రనౌట్) 7; రషీద్ (బి) సైనీ 6; భువనేశ్వర్ (బి) సైనీ 0; సందీప్ శర్మ (సి) కోహ్లి (బి) స్టెయిన్ 9; మార్‡్ష (సి) కోహ్లి (బి) దూబే 0; నటరాజన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 153. వికెట్ల పతనం: 1–18, 2–89, 3–121, 4–121, 5–129, 6–135, 7–141, 8–142, 9–143, 10–153.
బౌలింగ్: స్టెయిన్ 3.4–0–33–1, ఉమేశ్ 4–0–48–0, సైనీ 4–0–25–2, సుందర్ 1–0– 7–0, చహల్ 4–0–18–3, దూబే 3–0–15–2.
Comments
Please login to add a commentAdd a comment