భగభగ మండే ఎండ... ఎడారి దేశంలో మిట్ట మధ్నాహ్నం పోరు... ఒంట్లోని నీరంతా ఆవిరవుతోన్న వేళ 20 ఓవర్ల పాటు ఫీల్డింగ్... అలసట...ఇవేవీ బెంగళూరు బ్యాటింగ్‌పై ప్రభావం చూపలేకపోయాయి. కెప్టెన్ విరాట్ కోహ్లి, యువ బ్యాట్స్‌మన్ దేవ్‌దత్ పడిక్కల్ అర్ధసెంచరీలతో అదరగొట్టడంతో రాజస్తాన్ రాయల్స్‌కు ఓటమి తప్పలేదు. మొదట బంతితో తర్వాత బ్యాట్‌తో రాణించిన బెంగళూరు మూడో విజయాన్ని అందుకుంది.
అబుదాబి: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) దూసుకుపోతోంది. లీగ్‌లో మూడో విజయాన్ని సాధించి సత్తా చాటింది. శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి బృందం 8 వికెట్లతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. మహిపాల్ లామ్రోర్ (39 బంతుల్లో 47; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. బట్లర్ (12 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తేవటియా (12 బంతుల్లో 24; 3 సిక్సర్లు) దూకుడు కనబరిచారు. బెంగళూరు బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యజువేంద్ర చహల్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. తర్వాత బెంగళూరు 19.1 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. దేవ్‌దత్ పడిక్కల్ (45 ఓవర్లలో 63; 6 ఫోర్లు, 1 సిక్స్) లీగ్‌లో మూడో అర్ధసెంచరీ నమోదు చేయగా... కెప్టెన్ కోహ్లి (53 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు.
ఆరంభం నుంచే దూకుడు....
మండే వేడిలోనూ ఛేదనలో బెంగళూరు సత్తా చాటింది. ఓపెనర్ ఫించ్ (8) తొందరగానే అవుటైనా... రెండో ఓవర్‌లోనే సిక్స్, ఫోర్ బాదిన దేవ్‌దత్ 15 పరుగులు రాబట్టాడు. మూడో ఓవర్‌లో ఫించ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి కుదురుకునేందుకు ప్రయత్నిస్తుండగా... దేవ్‌దత్ జోరు పెంచాడు. దీంతో పవర్‌ప్లేలో బెంగళూరు 50/1తో నిలిచింది. ఈ క్రమంలో ఉనాద్కట్ బౌలింగ్‌లో ఫోర్‌తో దేవ్‌దత్ 34 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఈ దశలో కోహ్లి జోరందుకోవడంతో అతను దూకుడు తగ్గించాడు. 16వ ఓవర్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో మరో ఫోర్ బాది అదే ఓవర్‌లో దేవ్‌దత్ ఔటయ్యాడు. అప్పటికి ఆర్‌సీబీ విజయ సమీకరణం 24 బంతుల్లో 31 కాగా... డివిలియర్స్ (12 నాటౌట్)తో కలిసి కోహ్లి లాంఛనాన్ని పూర్తి చేశాడు.
మునుపటి కోహ్లి...
గత మూడు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శనలు నమోదు చేసిన కెప్టెన్ కోహ్లి ఈ మ్యాచ్‌తో గాడిలో పడ్డాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన అతను ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో బౌండరీ బాది ఈ సీజన్‌లో తొలి బౌండరీ నమోదు చేశాడు. తర్వాత కూడా సింగిల్స్‌కే ప్రాధాన్యమివ్వడంతో తొలి 29 బంతుల్లో 29 పరుగులే చేశాడు. 13వ ఓవర్ పరాగ్ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదిన కోహ్లి ఇక వెనుదిరిగి చూడలేదు. 41 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. ఆ తర్వాత మరింత చెలరేగాడు. 18 ఓవర్లో మూడు ఫోర్లు బాది 16 పరుగులు రాబట్టాడు.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (సి) దేవ్‌దత్ (బి) సైనీ 22; స్మిత్ (బి) ఉదాన 5; సంజు సామ్సన్ (సి అండ్ బి) చహల్ 4; ఉతప్ప (సి) ఉదాన (బి) చహల్ 17; లామ్రోర్ (సి) దేవ్‌దత్ (బి) చహల్ 47; రియాన్ పరాగ్ (సి) ఫించ్ (బి) ఉదాన 16; తేవటియా (నాటౌట్) 24; ఆర్చర్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154.
వికెట్ల పతనం: 1–27, 2–31, 3–31, 4–70, 5–105, 6–114.
బౌలింగ్: ఉదాన 4–0–41–2, సుందర్ 4–0–20–0, సైనీ 4–1–37–1, చహల్ 4–0–24–3, జంపా 3–0–27–0, శివమ్ దూబే 1–0–4–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: దేవ్‌దత్ పడిక్కల్ (బి) ఆర్చర్ 63; ఫించ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) గోపాల్ 8; కోహ్లి (నాటౌట్) 72; డివిలియర్స్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.1 ఓవర్లలో 2 వికెట్లకు) 158.
వికెట్ల పతనం: 1–25, 2–124.
బౌలింగ్: ఆర్చర్ 4–0–18–1, ఉనాద్కట్ 3–0–31–0, గోపాల్ 4–0–27–1, టామ్ కరన్ 3.1–0–40–0, తేవటియా 4–0–28–0, పరాగ్ 1–0–13–0.
Comments
Please login to add a commentAdd a comment