వరుసగా రెండు విజయాలతో జోరు పెంచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సొంతగడ్డపై అడ్డుకట్ట పడింది. కొంత పోరాటపటిమ కనబర్చినా చివరకు విజయం మాత్రం దక్కలేదు. అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ ‘హ్యాట్రిక్’ గెలుపుతో సత్తా చాటింది. కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ విజయంలో కీలకపాత్ర పోషించగా... ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోవడంతో రైజర్స్ ఉప్పల్‌లో చతికిలపడింది.
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఖాతాలో మరో ఓటమి చేరింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కామెరాన్ గ్రీన్ (40 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (17 బంతుల్లో 37; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (41 బంతుల్లో 48; 4 ఫోర్లు,1 సిక్స్), హెన్రిచ్ క్లాసెన్ (16 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
సూర్యకుమార్ విఫలం...
కెప్టెన్ రోహిత్ శర్మ (18 బంతుల్లో 28; 6 ఫోర్లు) ముంబై ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలు పెట్టాడు. సుందర్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను ఈ క్రమంలో ఐపీఎల్‌లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. నటరాజన్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన రోహిత్, అదే ఓవర్లో వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో ముంబై 53 పరుగులు చేసింది. అనంతరం రైజర్స్ బౌలింగ్ కట్టుదిట్టంగా సాగడంతో ముంబై స్కోరు వేగం మందగించింది. జాన్సెన్ ఒకే ఓవర్లో కిషన్, సూర్యకుమార్ (7)లను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు.
ఈ రెండు క్యాచ్‌లను మార్క్‌రమ్ అద్భుతంగా అందుకున్నాడు. 14 ఓవర్లలో ముంబై 109 పరుగులు చేసింది. అయితే చివరి 6 ఓవర్లలో చెలరేగిన ఆ జట్టు 83 పరుగులు రాబట్టింది. నటరాజన్ వేసిన 18వ ఓవర్లో వరుస బంతుల్లో గ్రీన్ 4, 4, 4, 6 తో చెలరేగడం విశేషం. ఈ క్రమంలో 33 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. భువీ తన చివరి 2 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చినా, ఇతర బౌలర్లు విఫలమయ్యారు.
తిలక్ జోరు...
సొంతగడ్డపై ప్రత్యర్థి జట్టు హైదరాబాద్‌పై తిలక్ వర్మ సత్తా చాటాడు. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్‌లో ఉన్న 24 నిమిషాల్లో ఫటాఫట్ బ్యాటింగ్ ప్రదర్శించాడు. జాన్సెన్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన అతను... మర్కండే, భువీ బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్ బాదాడు. భువీ బౌలింగ్‌లో మరో షాట్‌కు ప్రయత్నించి కవర్స్‌లో చిక్కడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది.
సమష్టి వైఫల్యం...
ఛేదనలో రైజర్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. గత మ్యాచ్ హీరో బ్రూక్ (9), రాహుల్ త్రిపాఠి (7)లను బెహ్రన్‌డార్ఫ్ తన వరుస ఓవర్లో అవుట్ చేశాడు. మరో ఎండ్‌లో మయాంక్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 6 ఓవర్లలో జట్టు స్కోరు 2 వికెట్లకు 42. మార్క్‌రమ్ (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోగా, అభిషేక్ (1) కూడా వెంటనే అవుటయ్యాడు.
రైజర్స్ గెలుపు అవకాశాలు సన్నగిల్లుతున్న దశలో చావ్లా వేసిన 14వ ఓవర్ ఆశలు రేపింది. ఈ ఓవర్లో క్లాసెన్ వరుసగా 4, 6, 6, 4 బాదాడు. అయితే చివరి బంతికి అతను అవుట్ కావడంతో పరిస్థితి మళ్లీ మారిపోయింది. తర్వాతి ఓవర్లో మయాంక్ వెనుదిరిగాక జట్టు ఓటమి లాంఛనమే అయింది. అర్జున్ టెండూల్కర్ తన తొలి ఐపీఎల్ వికెట్‌తో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగించగానే ముంబై సంబరాల్లో మునిగిపోయింది.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మార్క్‌రమ్ (బి) నటరాజన్ 28; ఇషాన్ కిషన్ (సి) మార్క్‌రమ్ (బి) జాన్సెన్ 38; గ్రీన్ (నాటౌట్) 64; సూర్యకుమార్ (సి) మార్క్‌రమ్ (బి) జాన్సెన్ 7; తిలక్ (సి) మయాంక్ (బి) భువనేశ్వర్ 37; డేవిడ్ (రనౌట్) 16; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల
పతనం: 1–41, 2–87, 3–95, 4–151, 5–192.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–31–1, జాన్సెన్ 4–0–43–2, సుందర్ 4–0–33–0, నటరాజన్ 4–0–50–1, మర్కండే 4–0–35–0.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: బ్రూక్ (సి) సూర్యకుమార్ (బి) బెహ్రన్‌డార్ఫ్ 9; మయాంక్ (సి) డేవిడ్ (బి) మెరిడిత్ 48; త్రిపాఠి (సి) ఇషాన్ కిషన్ (బి) బెహ్రన్‌డార్ఫ్ 7; మార్క్‌రమ్ (సి) షోకీన్ (బి) గ్రీన్ 22; అభిషేక్ (సి) డేవిడ్ (బి) చావ్లా 1; క్లాసెన్ (సి) డేవిడ్ (బి) చావ్లా 36; సమద్ (రనౌట్) 9; జాన్సెన్ (సి) డేవిడ్ (బి) మెరిడిత్ 13; సుందర్ (రనౌట్) 10; భువనేశ్వర్ (సి) రోహిత్ (బి) అర్జున్ 2; మర్కండే (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 178.
వికెట్ల పతనం: 1–11, 2–25, 3–71, 4–72, 5–127, 6–132, 7–149, 8–165, 9–174, 10–178.
బౌలింగ్: అర్జున్ టెండూల్కర్ 2.5–0–18–1, బెహ్రన్‌డార్ఫ్ 4–0–37–2, మెరిడిత్ 4–0–33–2, షోకీన్ 1–0–12–0, చావ్లా 4–0–43–2, గ్రీన్ 4–0–29–1.
Comments
Please login to add a commentAdd a comment