ఇరానీ కప్-2024కు ముంబై జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. రెస్టాఫ్ ఇండియాపై గెలుపే లక్ష్యంగా ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెడ్‌బాల్ మ్యాచ్‌లో ముంబైకి అజింక్య రహానే సారథ్యం వహించనున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌కు ఇద్దరు టీమిండియా స్టార్లు కూడా అందుబాటులోకి రావడంతో జట్టు మరింత పటిష్టంగా మారనుందని ముంబై వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా రంజీ ట్రోఫీ గెలిచిన జట్టుకు, రెస్టాఫ్ ఇండియా టీమ్‌కు మధ్య ఇరానీ కప్ పోటీ జరుగుతుంది.
రంజీ తాజా ఎడిషన్ విజేత ముంబై
ఈ ఏడాది రంజీ టోర్నీలో రహానే సారథ్యంలోని ముంబై జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరు 1 నుంచి మొదలయ్యే ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియాతో తలపడనుంది. ఇందుకోసం ఎంసీఏ మంగళవారం తమ జట్టును ప్రకటించనున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది.
ఇద్దరు టీమిండియా స్టార్లు అందుబాటులోకి
రహానే కెప్టెన్సీలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఎంసీఏ అధికారులు నిర్ధారించినట్లు పేర్కొంది. కాగా టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఇటీవల ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. లీసస్టర్‌షైర్‌కు ఆడే క్రమంలో అతడు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
అయితే, ఇరానీ కప్ మ్యాచ్ నాటికి రహానే పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. టీమిండియాలో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్.. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు కూడా ఎంపిక కాలేదు. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్‌లతో మిడిలార్డర్‌లో పోటీలో అతడు వెనుకబడ్డాడు.
శ్రేయస్‌కు మరో అవకాశం
ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లోనూ శ్రేయస్ నిరాశపరిచాడు. దీంతో ఇరానీ కప్ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాలని అతడు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. శస్త్ర చికిత్స అనంతరం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఇన్విటేషనల్ టోర్నీలో ఆడిన శార్దూల్ ఠాకూర్ సైతం ఈ మ్యాచ్‌కు అందుబాటులోని రానున్నట్లు సమాచారం.
కాగా ముంబై చివరగా 1998లో ఇరానీ కప్ గెలిచింది. అయితే, ఈసారి మేటి ఆటగాళ్లు జట్టులో భాగమవడం సానుకూలాంశం. మరోవైపు.. రెస్టాఫ్ ఇండియా జట్టు గత హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదుంది. గత మ్యాచ్‌లలో సౌరాష్ట్రపై రెండుసార్లు, మధ్యప్రదేశ్ జట్టుపై ఒకసారి గెలిచి ఇరానీ కప్ టైటిల్ సొంతం చేసుకుంది. కాగా శ్రేయస్, శార్దూల్ రంజీ గెలిచిన ముంబై జట్టులోనూ సభ్యులేనన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment