బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు: రాయల్స్‌కు బట్లర్‌ గుడ్‌బై | Its A Shame: Jos Buttler Pulls out of SA20 2025For England Duties Video | Sakshi
Sakshi News home page

SA20: బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు: రాయల్స్‌కు బట్లర్‌ గుడ్‌బై

Published Tue, Aug 6 2024 12:46 PM | Last Updated on Tue, Aug 6 2024 2:59 PM

Its A Shame: Jos Buttler Pulls out of SA20 2025For England Duties Video

ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ కీలక ప్రకటన చేశాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌(SA20) నుంచి దూరం అవుతున్నట్లు తెలిపాడు. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ప్రపంచవ్యాప్తంగా పొట్టి ఫార్మాట్‌ లీగ్‌ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు సైతం.. 2023లో తమ సొంత లీగ్‌ను ఆరంభించింది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగమైన ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీలు ఈ లీగ్‌లో పెట్టుబడులు పెట్టాయి. వరుసగా.. ఎంఐ కేప్‌టౌన్‌, జొబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, ప్రిటోరియా క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ పేరిట ఆరు జట్లు కొనుగోలు చేశాయి.

పర్ల్‌ రాయల్స్‌ తరఫున
ఇక ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్‌ సారథి జోస్‌ బట్లర్‌.. సౌతాఫ్రికా లీగ్‌లోనూ అదే ఫ్రాంఛైజీకి చెందిన పర్ల్‌ రాయల్స్‌కు ఆడుతున్నాడు. రెండేళ్లపాటు అదే జట్టుతో కొనసాగిన బట్లర్‌.. 2025 సీజన్‌కు మాత్రం అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి పర్ల్‌ రాయల్స్‌ సోషల్‌ మీడియా వేదికగా తన సందేశం వినిపించాడు.

విడిచి వెళ్లాలంటే బాధగా ఉంది
‘‘వచ్చే ఏడాది ఇక్కడకు రాలేకపోతున్నందుకు నిరాశగా ఉంది. ఇంగ్లండ్‌ మ్యాచ్‌లతో బిజీ కాబోతున్నాను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం వాటి మీదే ఉంది. ఈ టోర్నీకి ఇక తిరిగి రాలేకపోతున్నందుకు ఎంతగానో బాధపడుతున్నా. ఇక్కడి అభిమానులు నన్నెంతగానో ప్రేమించారు. పర్ల్‌ రాయల్స్‌ను విడిచి వెళ్లాలంటే బాధగా ఉంది. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌. బహుశా భవిష్యత్తులో మళ్లీ తిరిగి వస్తానేమో’’ అంటూ జోస్‌ బట్లర్‌ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.

రెండు సీజన్లలో విజేతగా సన్‌రైజర్స్‌
ఈ వీడియోను షేర్‌ చేసిన పర్ల్‌ రాయల్స్‌.. ‘‘జోస్‌.. ది బాస్‌.. మా జట్టుకు ఆడినందుకు ధన్యవాదాలు. నీ స్కూప్‌ షాట్స్‌ మేము కచ్చితంగా మిస్‌ అవుతాం’’ అంటూ క్యాప్షన్‌ జత చేసింది. కాగా అరంగేట్ర 2023, 2024 సీజన్లలో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌కేప్‌ సౌతాఫ్రికా టీ20 లీగ్‌ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా జరిగిన ఈ రెండు ఎడిషన్లలో ప్రిటోరియా క్యాపిటల్స్‌, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి.

ఇక 2023లో పది మ్యాచ్‌లకు గానూ నాలుగు మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన పర్ల్‌ రాయల్స్‌.. 2024లో పదికి ఐదు గెలిచి మూడో స్థానంతో ముగించింది. రెండుసార్లు సెమీ ఫైనల్‌ చేరినా ఓటమినే చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ గాయం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement