ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి ఇంగ్లీష్ రాదని, అందువల్లే తాను బిట్స్ అండ్ పీసెస్ అంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నాడని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. బిట్స్ అండ్ పీసెస్ వ్యవహారంపై ఓ నెటిజన్‌తో జరిపిన చాట్‌లో ఆయన ఈ మేరకు కామెంట్ చేశాడు. అయితే, తాజాగా ఈ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వెలుగులోకి రావడంతో జడేజా, మంజ్రేకర్ మధ్య వార్ మళ్లీ మొదలైనట్లైంది.
వివరాల్లోకి వెళితే.. సూర్య నారాయణ్ అనే ట్విటర్ యూజర్, తాను మంజ్రేకర్‌తో జరిపిన ట్విటర్ సంభాషణను లీక్ చేశాడు. అందులో మంజ్రేకర్.. జడేజాకు ఇంగ్లీష్ రాదని, అసలు తాను ఏం చెబుతున్నానో కూడా అతనికి అర్థం కాదని హేళన చేస్తాడు. బిట్స్ అండ్ పీసెస్ అసలు అర్థం జడేజాకు ఇప్పటికీ తెలీదని, కనీసం దాని అర్ధం తెలుసుకునే ప్రయత్నం కూడా అతను చేయడని పేర్కొన్నాడు. అలాగే 'వెర్బల్ డయేరియా(నోటి విరేచనాలు)' అంటూ జడేజా తననుద్ధేశించి సంబోధించిన పదాన్ని కూడా ఎవరైనా అతనికి చెప్పి ఉంటారని ఎగతాలి చేశాడు. అంతటితో ఆగని మంజ్రేకర్.. సదరు అభిమానిపై కూడా ఫైరయ్యాడు. నీలాగా ప్లేయర్స్‌ను పొగడటానికి నేను అభిమానిని కాదు.. ఓ విశ్లేషకుడినంటూ తన అహంకారాన్ని ప్రదర్శించాడు.
కాగా, 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాని బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్ అని సంబోధిస్తూ సంజయ్ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై జడ్డూ కూడా ఘాటుగానే స్పందించాడు. మంజ్రేకర్.. నీ కెరీర్‌లో నువ్వు ఆడిన మ్యాచ్‌ల కంటే నేను రెట్టింపు మ్యాచ్‌లను ఆడాను, ఇప్పటికీ ఆడుతున్నాను. ఏదైనా సాధించిన వారిని గౌరవించడం నేర్చుకో. ఇప్పటికే చాలా విన్నాను.. ఇకనైనా నీ నోటి విరోచనాలు ఆపు’’ అంటూ కౌంటరిచ్చాడు. అయితే ఈ వివాదం అంతటితో సద్దుమణిగిందనుకుంటే, తాజాగా లీకైన ట్విటర్ చాట్ మళ్లీ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై జడేజా ఎలా స్పందిస్తాడో చూడాలి.
చదవండి: వాళ్లు నిజంగా జాత్యాహంకారులే.. ఇప్పటికీ మన యాసను ఎగతాలి చేస్తారు
Comments
Please login to add a commentAdd a comment