టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అద్భుత ప్రదర్శనతో జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal). తొలుత(2023) టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారీ శతకం(171) బాది.. తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. విండీస్‌తో సిరీస్‌తోనే టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చాడు.
డబుల్ సెంచరీల వీరుడు
నిలకడైన ఆట తీరుతో దాదాపు ఏడాదిన్నర కాలంలోనే జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు జైస్వాల్. ముఖ్యంగా టెస్టుల్లో ఓపెనర్‌గా పాతుకుపోయి.. ఇప్పటికే ఎన్నెన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇప్పటి వరకు 19 టెస్టులు ఆడిన జైస్వాల్.. 1798 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు రెండు డబుల్ సెంచరీలు కూడా ఉండటం విశేషం.
వన్డేల్లో మాత్రం నో ఛాన్స్!
ఇక అంతర్జాతీయ టీ20లలో 23 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ ముంబై బ్యాటర్.. 723 రన్స్ సాధించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మ(Rohit Sharma)కు జోడీగా, టీ20లలో శుబ్‌మన్ గిల్(Shubman Gill)కు జంటగా ఓపెనర్‌గా పాగా వేసిన 23 ఏళ్ల జైసూకు ఇంత వరకు వన్డేల్లో మాత్రం అవకాశం రాలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ- గిల్‌లు వన్డేల్లో టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న నేపథ్యంలో ఈ యువ బ్యాటర్‌కు ఇంత వరకు సెలక్టర్లు పిలుపునివ్వలేదు.
మెగా టోర్నీకి ఎంపిక?!
అయితే, స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా జైస్వాల్ వన్డేల్లోనూ అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జనవరి 22 నుంచి భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో జైసూ వన్డే అరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడనుంది.
లిస్ట్-‘ఎ’ క్రికెట్‌లో గణాంకాలు ఇలా
అందుకే ఈ మెగా టోర్నీకి ముందు జైస్వాల్‌ను పరీక్షించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్- గిల్‌లకు చాంపియన్స్ ట్రోఫీలో బ్యాకప్ ఓపెనర్‌గా జైస్వాల్‌ను ఎంపిక చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంగ్లండ్‌తో కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఆడించి అతడిని సన్నద్ధం చేయాలని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
కాగా లిస్ట్-‘ఎ’ క్రికెట్‌లో యశస్వి జైస్వాల్ మెరుగైన గణాంకాలు కలిగి ఉన్నాడు. కేవలం 32 మ్యాచ్‌లలోనే 1511 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు శతకాలు, ఏడు హాఫ్ సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ(203) ఉంది.
నితీశ్ కుమార్ రెడ్డికి బంపరాఫర్!
ఇక జైస్వాల్‌తో పాటు మరో యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) కూడా దుబాయ్ ఫ్లైట్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆంధ్ర క్రికెటర్ ఇప్పటికే టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లో శతకంతో సత్తా చాటి తనను తాను నిరూపించుకున్నాడు.
అయితే, ఇప్పట్లో వన్డేల్లో నితీశ్ రెడ్డి అరంగేట్రం చేసే అవకాశం లేకపోయినా.. చాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అతడు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు రెవ్‌స్పోర్ట్స్ పేర్కొంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా నితీశ్ రెడ్డి ఎంపికకానున్నట్లు పేర్కొంది.
అయితే, ప్రధాన జట్టులో కాకుండా ట్రావెలింగ్ రిజర్వ్స్‌లో అతడు చోటు సంపాదించనున్నట్లు సమాచారం. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి.
చదవండి: Ind vs Eng: ఇంకెన్నాళ్లు ఇలా?.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లలోనైనా ఆడిస్తారా?
Comments
Please login to add a commentAdd a comment