
తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నిప్పులు చేరుగుతున్నాడు. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆండర్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టిన ఆండర్సన్.. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆదిలోనే రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బతీశాడు. అయితే తన విడ్కోలు టెస్టులో ఆండర్సన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలో 40,000 బంతులు వేసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా ఆండర్సన్ రికార్డులెక్కాడు. ఈ మ్యాచ్‌లో తన 10వ ఓవర్ వేసిన అనంతరం ఆండర్సన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 188 టెస్టులు ఆడిన ఆండర్సన్.. 6666. 5(40000 బంతులు) ఓవర్లు బౌలింగ్ చేశాడు.
ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో ఆండర్సన్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్లు ఆండర్సన్ కంటే ముందు అనిల్ కుంబ్లే(44039), షేన్ వార్న్(40850), ముత్తయ్య మురళీధరన్(40705) ఉన్నారు.
అదేవిధంగా ఆండర్సన్ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో విండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా ఆండర్సన్ నిలిచాడు. ఆండర్సన్ ఇప్పటివరకు వెస్టిండీస్‌పై 90 వికెట్లు పడగొట్టాడు.
ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(89) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కపిల్ దేవ్ రికార్డును ఆండర్సన్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో గ్లెన్ మెక్‌గ్రాత్(110) తొలి స్ధానంలో ఉన్నాడు.
Jimmy Anderson, there are no words 🤯 pic.twitter.com/bBRCS1uykD
— England Cricket (@englandcricket) July 11, 2024