
టోక్యో: జపాన్ ఏ ముహూర్తాన 2020 ఒలింపిక్స్‌కు బిడ్ వేసిందో గానీ... తీరా నిర్వహించే సమయం వచ్చేసరికి అన్నీ ప్రతికూలతలే! గతేడాదే జరగాల్సిన ఈ టోర్నీ కరోనా వైరస్‌తో వాయిదా పడింది. ఇప్పుడు ఆ వైరస్ సెకండ్ వేవ్ కలకలంతో మళ్లీ విశ్వక్రీడల నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దీంతో ఈ ఒలింపిక్స్‌ను వదిలేసి 2032 ఒలింపిక్స్‌ను పట్టుకుందామని జపాన్ ప్రభుత్వం అంతర్గతంగా నిర్ణయించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్ని ఖండిస్తున్నట్లు అటు ప్రభుత్వం, ఇటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించాయి. జపాన్ ప్రధాని యొషిహిదే సుగా మెగా ఈవెంట్ నిర్వహించేందుకు పట్టుదలతో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
‘గేమ్స్ అనుబంధ వర్గాలు షెడ్యూల్ ప్రకారమే భద్రంగా, సురక్షితంగా విశ్వ క్రీడలను నిర్వహించాలని కృతనిశ్చ యంతో ఉన్నాయి’ అని కేబినెట్ డిప్యూటీ చీఫ్ సెక్రటరీ సకాయ్ తెలిపారు. అంతకుముందు ‘టైమ్స్’ పత్రిక ఈ ఏడాది క్రీడల సంగతి అటకెక్కినట్లేనని కథనం రాసింది. జపాన్ కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా చర్చించే ఈ నిర్ణయం తీసుకుందని ఆ కథనంలో పేర్కొంది. ఈ వార్త కథనం జపాన్ ప్రభుత్వంలో కలకలం రేపింది. వెంటనే టోక్యో గవర్నర్ కొయికె స్పందిస్తూ నిరాధార వార్త రాసిన బ్రిటిష్ పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. అసలు ప్రభుత్వం అలాంటి చర్చే జరపలేదని ఆమె చెప్పారు. ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ మాట్లాడుతూ 2020 మార్చి తరహాలో 2021 మార్చి ఉండబోదని, కరోనాకు వ్యాక్సిన్‌లు కూడా వచ్చాయని అన్నారు.