టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. బుమ్రా డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినీగా ఎంపికయ్యాడు. బుమ్రాతో పాటు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్, సౌతాఫ్రికా సీమర్ డేన్ పాటర్సన్ కూడా మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు.
డిసెంబర్ నెలలో ప్రదర్శనల ఆధారంగా ఐసీసీ ఈ ముగ్గురిని నామినేట్ చేసింది. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ కావడం ఇది వరుసగా రెండో సారి. నవంబర్ నెలలోనూ బుమ్రా ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు. నవంబర్ నెలలో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు.
మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ (డిసెంబర్) నామినీస్ విషయానికొస్తే.. ఈ అవార్డుకు పురుషుల నామినీస్ లాగానే భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు చెందిన ఆటగాళ్లు ఎంపికయ్యారు. భారత్ నుంచి స్మృతి మంధన, సౌతాఫ్రికా నుంచి నొన్కులులేకో మ్లాబా, ఆస్ట్రేలియా నుంచి అన్నాబెల్ సదర్‌ల్యాండ్ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. డిసెంబర్ నెలలో ఈ ముగ్గురు అద్భుతంగా రాణించారు.
జస్ప్రీత్ బుమ్రా: పేసు గుర్రం బుమ్రా డిసెంబర్ నెలలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నెలలో అతనాడిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో (ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో) 22 వికెట్లు తీశాడు. ఇదే నెలలో బుమ్రా అత్యధిక రేటింగ్ పాయింట్లు (907) సాధించిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
పాట్ కమిన్స్: ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ డిసెంబర్ నెలలో మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనలు నమోదు చేశాడు. కమిన్స్ ఈ నెలలో 17 వికెట్లు తీయడంతో పాటు అత్యతం కీలకమైన 144 పరుగులు తీశాడు. కమిన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనల కారణంగా డిసెంబర్‌లో జరిగిన మూడు టెస్ట్‌ల్లో ఆసీస్ భారత్‌ను ఓడించింది.
డేన్ పాటర్సన్: ఈ సౌతాఫ్రికన్ పేసర్ తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. డిసెంబర్ నెలలో పాటర్సన్ రెండు టెస్ట్‌ల్లో 13 వికెట్లు తీశాడు. పాటర్సన్ ప్రదర్శనల కారణంగా సౌతాఫ్రికా తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకుంది.
స్మృతి మంధన: మంధన డిసెంబర్ నెలలో ఆడిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో సూపర్ ఫామ్‌ను కనబర్చి 463 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన వన్డేలో మంధన సూపర్ సెంచరీ చేసింది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో మంధన వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసింది.
మ్లాబా: డిసెంబర్ నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో మ్లాబా చెలరేగిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆమె 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ రికార్డు సృష్టించింది. ఇదే నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేల్లోనూ మ్లాబా రాణించింది.
అన్నాబెల్ సదర్‌ల్యాండ్: 23 ఏళ్ల ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ డిసెంబర్ నెలలో బంతితో, బ్యాట్‌తో అద్బుతంగా రాణించింది. ఈ నెలలో సదర్‌ల్యాండ్ ఏడు వికెట్లు తీయడంతో పాటు రెండు సెంచరీలు (భారత్, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేల్లో) చేసింది.
Comments
Please login to add a commentAdd a comment