టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా భారత దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ పేరిట నమోదై ఉన్న ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా మరో 20 వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ రికార్డు ప్రస్తుతం కపిల్ దేవ్ పేరిట ఉంది.
కపిల్ ఆసీస్ గడ్డపై 11 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు తీశాడు. కంగారూల గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో బుమ్రా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. బుమ్రా ఆసీస్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 32 వికెట్లు తీశాడు.
ఈ జాబితాలో బుమ్రాకు ముందు కపిల్ దేవ్ (51), అనిల్ కుంబ్లే (49), రవిచంద్రన్ అశ్విన్ (39), బిషన్ సింగ్ బేడీ (35) ఉన్నారు. బీజీటీలో మొత్తం ఐదు టెస్ట్‌లు జరుగనున్న నేపథ్యంలో కపిల్ రికార్డును బద్దలు కొట్టడం బుమ్రాకు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. అందులోనూ ఆసీస్ పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి బుమ్రాకు కపిల్ రికార్డును అధిగమించడం మరింత సలభమవుతుంది.
కాగా, బీజీటీలో భాగంగా ఆసీస్‌తో జరుగబోయే తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. రోహిత్ భార్య రితిక రెండో బిడ్డకు జన్మనివ్వడంతో అతను భారత్‌లోనే ఉండిపోయాడు. దీంతో తొలి టెస్ట్‌లో బుమ్రా టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. బుమ్రా టెస్ట్‌లో టీమిండియాకు సారధిగా వ్యవహరించడం ఇది రెండోసారి.
2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో బుమ్రా తొలి సారి టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. మరి బుమ్రా కెప్టెన్‌గా తన రెండో టెస్ట్‌లోనైనా టీమిండియాను గెలిపిస్తాడో లేదో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment