బజ్‌బాల్ విధానం అంటూ టెస్ట్ క్రికెట్‌లో వేగం పెంచే ప్రయత్నం చేస్తూ, ఇటీవలే ఆసీస్ చేతిలో చావు దెబ్బ (యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో ఓటమి) తిన్న ఇంగ్లండ్ టీమ్‌ను ఉద్దేశిస్తూ ఆసీస్ మాజీ ఓపెనర్, మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కనబర్చిన సంయమనం ఇంగ్లండ్ బజ్‌బాల్ పద్ధతికి విరుగుడు అని ఆయన అభిప్రాయపడ్డాడు.
యాషెస్ తొలి టెస్ట్ ఆఖరి రోజు ఇంగ్లండ్ ఆసీస్‌ను తెగ ఇబ్బంది పెట్టిందని, అయితే కమిన్స్ క్రీజ్‌లోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నాడు. కమిన్స్ తీవ్రమైన ఒత్తిడిలో ఎంతో ఓర్పును, సహనాన్ని ప్రదర్శించి తన జట్టును విజయతీరాలకు చేర్చాడని.. ఒత్తిడిలో కమిన్స్ ప్రదర్శించిన ఆ ఓర్పు,సహనమే ఆసీస్‌ను గెలిపించిందని తెలిపాడు.
కమిన్స్‌కు లయోన్ అద్భుతంగా సహకరించాడని, వారిద్దరు ఒత్తిడిని అధిగమించి, తమ జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారని పేర్కొన్నాడు. ఎంతటి ఒత్తిడిలోనైనా గెలవడం వల్లే ఆసీస్ వరల్డ్ నంబర్ జట్టుగా చలామణి అవుతుందని, ఇందుకు యాషెస్ తొలి టెస్ట్ ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు. బజ్‌బాల్‌కు విరుగుడు ఏమిటనే దానిపై గతంలో చాలా సందర్భాల్లో ప్రశ్నలు తలెత్తాయని.. ఆసీస్ కెప్టెన్ తొలి టెస్ట్‌లో బంతితో పాటు కీలక ఇన్నింగ్స్ ఆడి ఆ ప్రశ్నకు జవాబిచ్చాడని తెలిపాడు.
కాగా, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ (0/59, 38, 4/63, 44 నాటౌట్) ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆసీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. వికెట్లు చేతిలో ఉన్నా, తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఇంగ్లండ్ చేతులు కాల్చుకోగా.. తమ ముందు బజ్‌బాల్ గిజ్‌బాల్ జాన్తానై అంటూ ఆసీస్.. ఇంగ్లండ్ ఎత్తుగడను తిప్పికొట్టింది. ఛేదనలో కమిన్స్ ప్రదర్శించిన ఓర్పు, సంయమనం ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్‌ను తుంగలో తొక్కి ఆసీస్‌కు చారిత్రక విజయాన్ని అందించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ జూన్ 28 నుంచి లార్డ్స్ వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment